ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెల్లడి
ఉద్యోగుల ప్రయోజనాలకు భంగం కలిగితే ఉద్యమాన్ని కొనసాగించేలా ఏకగ్రీవ తీర్మానం
ఐఆర్, బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి
ఆరు నెలల్లో పీఆర్సీ నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రధాన డిమాండ్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు : ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్
డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగితే మళ్లీ ఉద్యమం
సాక్షి, అమరావతి : ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల పోరాట ఫలితంగా ప్రభుత్వం నుంచి కొన్ని సానుకూల నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై గౌరవంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం ఏపీ జేఏసీ అమరావతి, రాష్ట్ర మహిళా విభాగం ఉమ్మడి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో సెపె్టంబర్ 5న ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ప్రకటించిన నిర్ణయాలు, తదుపరి ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఉద్యోగులు అత్యంతగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతి (ఐఆర్), రూ.వేల కోట్ల బకాయిల చెల్లింపుపై స్పష్టత లేకపోవడంపై ఏపీ జేఏసీ అమరావతికి చెందిన కొన్ని జిల్లాల నాయకత్వాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేపథ్యంలో నిర్దిష్ట సమయం వేచి చూడాలని నిర్ణయించారు. ఐఆర్ సాధ్యమైనంత త్వరగా ప్రకటించి అమలు చేయాలని, బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించి పే స్లిప్‌లో చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా త్వరితగతిన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఇప్పటికే ఆలస్యమైన పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి, ఆరు నెలల్లో నివేదిక సమర్పించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మిగిలిన 30 ప్రధాన డిమాండ్లను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ త్వరితగతిన చర్చించి, ఒక్కో అంశానికి స్పష్టమైన పరిష్కారం చూపాలని ఏపీ జేఏసీ నేతలు కోరారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలు పూర్తిగా అమలయ్యే వరకు, మిగిలిన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలిగితే ఉద్యమ కార్యాచరణను కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సెపె్టంబర్ 8న అన్ని జిల్లాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలిశెట్టి దామోదరరావు, టీవీ ఫణి పేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు, పి.లక్ష్మీ, పొన్నూరు విజయలక్ష్మి తదితరులతో పాటు అన్ని జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
హామీలు అమలు కాకపోతే ఉద్యమమే..
ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ స్పష్టీకరణ
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, ప్రధాన డిమాండ్లపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోయినా, డిమాండ్ల పరిష్కారంలో జాప్యం జరిగినా.. మళ్లీ ఉద్యమాలకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటు ఐఆర్ ప్రకటించాలని కోరామని, తగిన సమయంలో పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఐఆర్‌తోపాటు ఇతర పెండింగ్ డిమాండ్లు ఎప్పుడు పరిష్కారమవుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.
హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడటం, డిమాండ్లు అమలు కావడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమ కార్యాచరణ చేపట్టడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సెపె్టంబర్ మూడో వారంలో ఏపీ జేఏసీ రాష్ట్ర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కెఎస్‌ఎస్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


