41 చోట్ల వారంలోగా ఓటర్ల జాబితాలు..
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ) సాధారణ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ ఈనెల 8 నుంచి చేపట్టనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని ఆయనన్నారు. నూతన నిబంధనల ప్రకారం కార్పొరేషన్లలో మేయర్‌ను.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక డిప్యూటీ మేయర్, నగర పంచాయతీల్లో ఒక వైస్ చైర్‌పర్సన్ మాత్రమే ఉంటారన్నారు. డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరుగుతాయని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం ఓటర్ల గుర్తింపు ప్రక్రియను 59 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఇందులో ఉన్నాయి.
వారం రోజుల్లో ఓటరు జాబితాలు..
ఇక 41 పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలను వారం రోజుల్లో ప్రచురించనున్నట్లు సురేశ్‌కుమార్ తెలిపారు. అనంతరం రిజర్వేషన్లు, ఇతర ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యాక్ట్–5కు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 23 యూఎల్‌బీల్లో మాత్రం కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, తదుపరి ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, ఇతర చట్టబద్ధమైన కార్యక్రమాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పూర్తిచేస్తున్నామన్నారు.


