● సాగర్ కాల్వల పటిష్టతపై దృష్టి ● నీటి విడుదల ‘గ్యాప్’లో పనులకు ప్రణాళిక ● చివరి ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం
ఖమ్మం అర్బన్: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో పునరుద్ధరణపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కేవలం తాగునీటి అవసరాలకే నీరు విడుదల చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత నీటి విడుదల ఆగిపోనుండగా.. ఈ సమయాన్ని కాల్వల మరమ్మతులు, పూడికతీత, షట్టర్ల పునరుద్ధరణకు వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు ప్రధాన కాల్వ మొదలు బ్రాంచ్ కాల్వలు, మేజర్లు, మైనర్ల వరకు జలవనరులశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎక్కడెక్కడ పనులు అవసరమో గుర్తిస్తున్నారు.
అధికారుల పర్యటన
కాల్వ వెంట పర్యటిస్తున్న అధికారులు దెబ్బతిన్న కాంక్రీట్ నిర్మాణాలు, కాల్వ గట్లు, పూడిక, కంపచెట్లు, దెబ్బతిన్న యూటీలు, షట్టర్లను పరిశీలిస్తున్నారు. ఎక్కడ పూడికతీత చేపట్టాలి.. ఎక్కడెక్క కాంక్రీట్ పనులు చేయాలి.. ఏ షట్టర్లకు మరమ్మతులు అవసరమరో గుర్తిస్తున్నారు. పరిశీలన అనంతరం పనులకు అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. ఈ ఏడాది నీటి విడుదలపై అస్పష్టత ఉన్నందున ఈ సమయంలో అవసరమైన పనులు చేపడితే తదుపరి పంట కాలంలో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఎదురుకావని.. తద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సమర్థంగా అందుతుందని భావిస్తున్నారు.
గతంలో రూ.4,400 కోట్లు
సాగర్ కాల్వల ఆధునికీకరణకు గతంలో భారీగా నిధులు వెచ్చించారు. 2004–05లో సుమారు రూ.4,400 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు 2016 నాటికి పూర్తయ్యాయి. కాల్వ నిర్మాణాలను పటిష్టం చేయడం, రాతి నిర్మాణాల స్థానంలో కాంక్రీట్ పనులు చేపట్టడం, గట్ల వెడల్పు పెంపు, షట్టర్ల ఏర్పాటు, కాంక్రీట్ పనులు అప్పట్లో చేపట్టారు. ఆ పనులు జరిగి దాదాపు పదేళ్లు కావడం.. నిరంతరం నీటి సరఫరాతో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ మరమ్మతులు అవసరమవుతున్నాయి. గతంలో మరమ్మతులు జరిగిన ప్రాంతాలే కాక అప్పుడు పరిగణనలోకి తీసుకోని ప్రాంతాల్లోనూ ఈసారి మరమ్మతులు చేసేలా పరిశీలన జరుగుతోంది.
చివరి ఆయకట్టుపైనే దృష్టి
సాగర్ నీటిపై ఆధారపడే ఆయకట్టు జిల్లాలో నానాటికీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యాన చివరి భూములకు కూడా సకాలంలో నీరు చేరేలా కాల్వల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పనులు చేపట్టేందుకు ప్రస్తుతం అనువైన సమయం కావడంతో వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యాక చేపట్టే పనులపై రైతుల్లో ఆసక్తి నెలకొనగా.. ఈ పనులు పూర్తయితే నీటి వృథా తగ్గి చివరి భూములకు సైతం నీరు చేరుతుందనే భావన వ్యక్తమవుతోంది.
గోదావరి జలాల తరలింపునకు..
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రాజీవ్ లింక్ కాల్వ నుంచి సాగర్ ప్రధాన కాల్వలోకి తరలిస్తున్నారు. ఆపై నీరు పారించే సమయాన ఎగువకు చేర్చాల్సి వస్తోంది. వైరా రిజర్వాయర్‌లోకి నీరు చేర్చే క్రమాన ఏన్కూరు నుంచి తిమ్మారావుపేట వరకు సాగర్ ప్రధాన కాల్వలో సుమారు 13 కి.మీ. ఎగువకు పారించాల్సి వస్తోంది. కాల్వ డిజైన్ అందుకు అనుగుణంగా లేక కట్టలపై ఒత్తిడి పడి ప్రమాదాలు ఎదురవుతాయని భావిస్తున్నారు. ఈమేరకు తక్షణ మరమ్మతులు చేపట్టేలా సుమారు రూ.5.5 కోట్లు అవసరమని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నిధులు మంజూరైతే సుమారు 10 కి.మీ. మేర కట్టలను బలపరిచే అవకాశముంది.


