రహదారుల అభివృద్ధికి నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

రహదారుల అభివృద్ధికి నిధుల వరద

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

ఖమ్మం అర్బన్‌/మధిర: జిల్లాలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఈమేరకు రహదారుల విస్తరణ, అభివృద్ధితో పాటు వంతెనల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తూ వేర్వేరుగా జీఓలు జారీ చేసింది. ఈ నిధులతో చేపట్టే రహదారుల పనులు పూర్తయితే జిల్లాలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

మూడు రోడ్లకు రూ.141 కోట్లు

ప్రభుత్వం జారీ చేసిన జీఓ 467 ద్వారా మూడు రహదారుల అభివృద్ధికి రూ.141 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం–చింతకాని రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు రూ.60కోట్లు, రామకృష్ణాపురం–పెద్దగోపతి రోడ్డు అభివృద్ధికి రూ.50కోట్లు, చింతకాని–నాగులవంచ రోడ్డు అభివృద్ధికి రూ.31 కోట్లు కేటాయించారు.

మధిర నియోజకవర్గానికి రూ.189 కోట్లు

జీఓ 469 ద్వారా మధిర నియోజకవర్గంలోని ఆరు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులను కేటాయించింది. ఈ జాబితాలో సిరిపురం–మిట్టగూడెం రహదారికి రూ.21 కోట్లు, గొల్లపూడి–ప్రొద్దుటూరు రహదారికి రూ.33 కోట్లు, కందులపాడు–గంగినేని–ఎర్రుపాలెం రోడ్డుకు రూ.22 కోట్లు, చిరుమర్రి–పమ్మి–అమ్మపేట రోడ్డుకు రూ.26 కోట్లు, బాణాపురం–పెద్దమండవ రహదారికి రూ.18 కోట్లు, అయ్యగారిపల్లి–గంధసిరి రోడ్డుకు రూ.13 కోట్లు మంజూరయ్యాయి. అలాగే, మధిర–శివాలయం రోడ్డుకు రూ.28 కోట్లే కాక మధిర నుంచి శివాలయం ఆలయానికి వెళ్లే రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం మరో రూ.28 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవికాక ఎండీఆర్‌ పథకం కింద కిలోమీటర్‌ 0/0 నుంచి 1/0 వరకు రహదారి మెరుగుదల పనులతో పాటు వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చారు. అదనపు బడ్జెట్‌ కేటాయింపులతో ఈ నిధులు మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొనగా.. పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ రాష్ట్ర రహదారుల విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు

మధిర నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంపై కాంగ్రెస్‌ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పారుపల్లి విజయ్‌కుమార్‌, తలుపుల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. మధిరలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం వారు వెల్లడించగా... నిధులు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్‌ చైర్మన్‌ బండారు నరసింహారావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సామినేని సుజాత రామనాథం, వైస్‌ చైర్మన్‌ కోనా ధనికుమార్‌, నాయకులు సూరంశెట్టి కిషోర్‌, కర్నాటి రామారావు, మిరియాల రమణ గుప్తా, శ్రీపాలశెట్టి వెంకట్రావు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, తన్నీరు రామకృష్ణ పాల్గొన్నారు.

జిల్లాలోని కీలక రోడ్లకు మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement