పోలీసులు అడ్డుకోవడంతో నెల్లూరు బ్యారేజీపై బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులు
శ్రీశైలం జలాలు విడుదల చేయాలంటూ వైఎస్సార్‌సీపీ ‘చలో నెల్లూరు బ్యారేజీ’
నేతలను, రైతులను అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించిన బాబు సర్కారు
బ్యారేజీ వద్దకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి ఆంక్షలు
రోప్ పార్టీలను రంగంలోకి దింపి రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యం
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగు నీరివ్వడం లేదని మండిపడ్డ కాకాణి, సాకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీశైలం జలాలు సోమశిలకు విడుదల చేయాలనే డిమాండ్‌తో నెల్లూరు జిల్లా రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ మంగళవారం పోరుబాట పట్టింది. వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ కో–ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో మంగళవారం ‘చలో నెల్లూరు బ్యారేజీ’ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. వైఎస్సార్‌సీపీ నేతలు, రైతులను బ్యారేజీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పిం చారు. బారికేడ్లు పెట్టి మరీ ఆంక్షలు విధించారు. రోప్ పార్టీలను రంగంలోకి దింపి రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యం చేశారు.
ఎస్పీకి ముందుగానే సమాచారమిచ్చినా..
ఈ కార్యక్రమంపై ముందుగానే జిల్లా ఎస్పీకి వైఎస్సార్‌సీపీ నేతలు సమాచారమిచ్చినప్పటికీ అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. తొలుత మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సాకే శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ ఇన్‌చార్జి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగం అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి తదితరులతో కలిసి రైతులు, పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం నుంచి సుమారు 100 కార్లు, బైకులతో భారీ ర్యాలీగా నెల్లూరు బ్యారేజీ వైపు తరలివచ్చారు.
అప్పటికే బ్యారేజీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రోప్ పార్టీలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులను ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి బ్యారేజీ రెండువైపుల బారికేడ్లు పెట్టి ప్రజలను సైతం రాకపోకలు సాగించకుండా నిలువరించారు. దీంతో దాదాపు గంటపాటు పోలీసులు, పార్టీ నేతల మధ్య తోపులాటలు జరిగాయి. అనంతరం రైతులు, నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా బ్యారేజీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
చంద్రబాబు నిర్లక్ష్యంతోనే శాశ్వత కరువు: కాకాణి
చంద్రబాబు నిర్లక్ష్యంతోనే గ్రేటర్ రాయలసీమ శాశ్వత కరువు కోరల్లోకి వెళ్లిపోతోందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే శ్రీశైలం జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం శ్రీశైలం దిగువ ప్రాజెక్ట్‌లకు నీటిని విడుదల చేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని నిలదీశారు. శ్రీశైలంలో నీళ్లున్నా సోమశిలకు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నీటిమట్టం మరింత పడిపోతే నెల్లూరు జిల్లాకు శాశ్వత కరువు ముప్పు ఏర్పడుతుందన్నారు.
సోమశిల–కండలేరు ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ద్వారా ఒక్క రోజు నీటిని విడుదల చేసినా కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఇప్పటికే కలువాయి మండలం కనుపూరుపల్లి, నూకనపల్లి, యదనపర్తి, వెరు»ొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. రైతుల పోరాటాల్ని అడ్డుకుని ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని మండిపడ్డారు.
ఎల్‌నినో కాదు.. ఎల్లో నిల్ ఎఫెక్ట్: శైలజానాథ్
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ.. ఇది ఎల్‌నినో ఎఫెక్ట్ కాదని.. ఎల్లో నిల్ ఎఫెక్ట్ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా రైతుల్ని కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమశిల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి తక్షణమే నీటిని తరలించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పది రోజులుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటిని తరలించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. శ్రీశైలం నుంచి సోమశిలకు చుక్క నీరు కూడా ఇవ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


