చక్కెర కేజీ రూ.140! | Nepals Sugar Shock: Prices Hit Rs 140 Per kg Hopes Rest on India | Sakshi
Sakshi News home page

చక్కెర కేజీ రూ.140!

Sep 9 2026 12:40 PM | Updated on Sep 9 2026 12:52 PM

Nepals Sugar Shock: Prices Hit Rs 140 Per kg Hopes Rest on India

పండుగ సీజన్‌లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్‌ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్‌ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.

కాఠ్‌మాండులోని సిగల్‌ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్‌లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్‌ రిటైల్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్‌ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.

సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..
మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.

25 వేల టన్నుల దిగుమతికి అనుమతి
ధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్‌ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్‌ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్‌టీసీ, ఫుడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.

అదే సమయంలో భారత్‌ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్‌ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఏటా 2.5 లక్షల టన్నుల అవసరం
నేపాల్‌లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్‌ సీజన్‌ ముగిసింది. తదుపరి సీజన్‌ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్‌ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్‌టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్‌ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

భారత్‌ సరఫరాపైనే ఆశలు
మరోవైపు నేపాల్‌ పంచదార అవసరాల్లో భారత్‌ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్‌ మార్కెట్‌ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్‌, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్‌ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. 

భారత్‌పైనా ధరల ఒత్తిడి
మరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్‌లో పెరిగే డిమాండ్‌ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్‌ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్‌ భారత్‌ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్‌ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement