దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్‌కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్‌ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.
నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.
‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’
దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్‌లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.
ఇది బెదిరించడమే..
చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్‌ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్‌ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.
PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLD
YOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIAL
A dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026
దక్షిణ చైనా సముద్రంపై వివాదం
ఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.
అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్‌కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.
ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా?


