మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు | Mojtaba Khameneis London Flats Row, Iran Denies Property Ownership Claims, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు

Sep 9 2026 10:07 AM | Updated on Sep 9 2026 10:43 AM

Khameneis London Flats Row: Iran Denies Property Claims

పశ్చిమాసియా యుద్ధంలో తండ్రి అయతొల్లా ఖమేనీ మరణాంతరం.. ఊహించని రీతిలో ఇరాన్‌కు సుప్రీం బాధ్యతలు చేపట్టాడు మొజ్తబా ఖమేనీ. అయితే యుద్ధంలో గాయపడిన ఆయన..  దాదాపు ఆరు నెలల నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన మీద సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయంటూ బ్రిటన్‌ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్‌లోని ‘ది సండే టైమ్స్‌’ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్‌లో పాలెస్‌ గ్రీన్‌ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు మొజ్తబా ఖమేనీకి చెందినవిగా పేర్కొన్నారు. ఆ భవనం ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచింది.

అయితే ఈ ఆరోపణలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఖమేనీకి ఇరాన్‌లోనే కాదు.. విదేశాల్లోనూ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్‌ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

‘ఆరోపణలు పూర్తిగా నిరాధారం’
బ్రిటన్‌ మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను ఇరాన్‌ రాయబార కార్యాలయం ‘పూర్తిగా నిరాధారం’గా అభివర్ణించింది. మొజ్తబా ఖమేనీ తన తండ్రిలాగే ఎలాంటి ఆస్తులు కలిగి లేరని పేర్కొంది. ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఇరాన్‌ ప్రజలు బాగా తెలుసని తెలిపింది. ఖమేనీకి దేశంలోగానీ.. విదేశాల్లోగానీ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఆయన జీవితం, వ్యక్తిత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించేందుకేనని రాయబార కార్యాలయం ఆరోపించింది.

లండన్‌లోని కెన్సింగ్టన్‌లో పాలెస్‌ గ్రీన్‌ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు.. ఆరో, ఏడో అంతస్తుల్లో ఉన్నాయని, వాటిని 2014, 2016 సంవత్సరాల్లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు బ్రిటన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆస్తుల యాజమాన్యం ఖమేనీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఇటీవలే గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

అరెస్టులతో ముడిపెట్టి ప్రచారం
లండన్‌లో యూదు సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తూ నలుగురు ఇరానియన్‌, బ్రిటిష్‌-ఇరానియన్‌ వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాన్ని గమనించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాట్లు ఉండటంపై కూడా బ్రిటన్‌ మీడియాలో చర్చ జరిగింది. రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపే ఈ భవనం ఉందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే బ్రిటన్‌ మీడియా కథనాలకు ఇరాన్‌ ఇచ్చిన సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. మొజ్తబా ఖమేనీకి ఎక్కడా ఆస్తులు లేవని.. ఆయన నిరాడంబర జీవితం గడుపుతున్నారని రాయబార కార్యాలయం చెబుతోంది. 

ఇదీ చదవండి: అలా నెతన్యాహు ఇరుకున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement