కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న! | Supreme Court: Is Coconut a Fresh Fruit or Vegetable for Sales Tax | Sakshi
Sakshi News home page

కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!

Sep 27 2026 10:46 AM | Updated on Sep 27 2026 11:14 AM

Supreme Court: Is Coconut a Fresh Fruit or Vegetable for Sales Tax

భగవంతునికి భక్తునికి అనుసంధానమైన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి. అయితే ఇది పండా? కూరగాయ? డ్రై ఫ్రూటా? ఈ మూడూ  కాదా? వినడానికి ఇది చాలా చిన్న ప్రశ్నలానే అనిపిస్తోంది..కానీ ఇదే ప్రశ్న ఓ వ్యాపారిని కోర్టు మెట్లు ఎక్కించింది.  కొబ్బరికాయ ‘గ్రీన్‌ ఫ్రూట్‌ ’ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనికి పన్ను మినహాయించాలని వ్యాపారి, మినహాయించరాదని మున్సిపల్‌ అధికారులు.. చివరికి ఈ ప్రశ్న సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఒకటీ రెండూ కాదు– పదేళ్లకు పైగా ఈ వివాదం సాగింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో దీనిపై ఒక స్పష్టత వచ్చింది.

బరూచ్‌ కొబ్బరి ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కొబ్బరి బొండాలు, కాయలను దిగుమతి చేసుకుని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విక్రయించేవారు. కొబ్బరికాయ పైన ఉండే డొక్కలు, పీచు తీసేసి వాటిని మార్కెట్‌కు తీసుకు వచ్చేవారు. వాటిలోని నీటిని పానీయంగా, కొబ్బరిని వంటలకు విక్రయించే వారు. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చే, వెళ్లే వస్తువులపై ఆక్ట్రాయ్‌ పన్నును ఆ కార్పొరేషన్‌కు చెల్లించేలా విధించే వారు. నిబంధనల ప్రకారం కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపు ఉండేది. వాటిలో గ్రీన్‌ ఫ్రూట్స్‌ ఒకటి. 

పన్నును వ్యతిరేకించిన వ్యాపారులు
మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదట్లో కొబ్బరి బొండాలు/కాయలపై 100 కేజీలకు రూ.1 చొప్పును పన్ను విధించేంది. తర్వాత ఈ పన్నును రూ. 5కి పెంచింది. దీనిని కొబ్బరి వ్యాపారులు వ్యతిరేకించారు. కొబ్బరికాయలు కూడా గ్రీన్‌ ఫూట్స్‌ పరిధిలోకి వస్తాయి కాబట్టి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి మున్సిపల్‌ అధికారులు అంగీకరించలేదు. కొబ్బరికాయలు ఆ పరిధిలోకి రావని తేల్చి చెప్పారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో వాదనలు
గుజరాత్‌ హైకోర్టు వ్యాపారుల వాదనను అంగీకరించలేదు. కొబ్బరి కాయను గ్రీన్‌ఫ్రూట్‌గా పరిగణించలేమని తేల్చింది. పన్ను మినహాయింపు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆక్ట్రాయ్‌ నిబంధనల్లోని ఐటెమ్‌ 55 పరిధిలోకి వస్తుందని పేర్కొంది. అందువల్ల పన్ను చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తీర్పు వెలువరించిన సుప్రీం
కొబ్బరి కాయ పైన ఉండే తొక్క లేదా డొక్క... పీచును తొలగించిన తర్వాత గోధుమ రంగులో ఉండే కొబ్బరికాయను గ్రీన్‌ ఫ్రూట్‌గా పరిగణించొచ్చా? లేదా? ఈ ప్రశ్నే సుప్రీంకోర్టు ముందు నిలిచింది. గ్రీన్‌ అనే పదానికి సాధారణ అర్థం, సాధారణ ప్రజలు ఫ్రూట్‌ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారనే అంశాన్ని కోర్టు పరిశీలించింది. కోర్టు ఒక ఆసక్తికరమైన సందేహాన్ని ఈ సందర్భంగా వెలిబుచ్చింది. ‘ఒక ఇంట్లో ఎవరైనా వ్యక్తిని ఫ్రెష్‌ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ తీసుకురా అంటే? ఈ రెండింటిలో ఏ కేటగిరీ కిందా అయినా కొబ్బరికాయను తీసుకువస్తాడా? అని ప్రశ్నించింది. ఎవరూ కొబ్బరికాయను గ్రీన్‌ ఫ్రూట్‌గా గుర్తించరు. 

అందువల్ల అది కేవలం గ్రీన్‌ ఫ్రూట్‌ అని చెప్పడం ద్వారా పన్ను మినహాయింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడే మరో వాదన కూడా వచ్చింది. దీన్ని డ్రైఫ్రూట్‌ కింద పరిగణించొచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. దీన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. డ్రై ఫ్రూట్‌ అంటే అదొక ప్రత్యేకమైన వర్గంగా పేర్కొంది. దీన్ని ఆ కేటగిరీలోనూ చేర్చలేమని చెప్పింది. 

రెండు కేటగిరీల పరిధిలోకి రానందున ఏ కేటగిరీకి చెందని వస్తువులకు వర్తించే ఐటెమ్‌ 55 రూల్‌ 14 కింద కొబ్బరికాయను చేర్చవచ్చని పేర్కొంది. దీంతో వీటికి కూడా ఆక్ట్రాయ్‌ పన్ను విధించొచ్చని స్పష్టం చేసింది. ఈ తరహాలో పలు రాష్ట్రాల్లో సేల్స్‌ ట్యాక్స్‌ వంటి వివాదాలు వస్తుంటాయని కావున ఈ కేసును విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని వ్యాపారుల తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఆ అవసరం లేదని ద్విసభ్య బెంచ్‌ పేర్కొంది.  వ్యాపారుల అప్పీల్‌ను కొట్టివేసింది. 

ఈ కేసు మొత్తం కొబ్బరికాయ గ్రీన్‌ ఫ్రూటా? కాదా? అనే అంశంపైనే తిరిగింది. చట్టంలో ఓ పదానికి స్పష్టమైన నిర్వచనం, వివరణ లేనప్పుడు సాధారణంగా వాడుకలో ఉన్నవే ఒక్కోసారి కీలకంగా మారుతాయని ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. కొబ్బరికాయపై పన్ను వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆసక్తికరమైన అంశంగా మారింది.
దిలీప్‌ మాదిరెడ్డి 

ఇదీ చదవండి: Andy Allen Success Story: ఎలక్ట్రీషియన్‌ నుంచి మాస్టర్‌ చెఫ్ విజేత, రెస్టారెంట్‌ యజమాని రేంజ్‌కి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement