ఫండే
కథాకళి
‘‘హలో. జస్ట్ మీ వాయిస్ విందామని చేశాను. వచ్చేప్పుడు తేగలు తెండి. ఇక్కడికన్నా రాజమండ్రిలో మంచి తేగలు దొరుకుతాయి.’’ సుదతి తన భర్తకి ఫోన్ చేసి చెప్పింది.
‘‘గుర్తుంది. తెస్తాను. రేగుపళ్ళ గుజ్జుతో చేసే దాన్నేదో అంటారు. అదీ తెస్తాను.’’
‘‘ఒరుగులు. అవి మనమ్మాయికి బాగా ఇష్టం.’’
ఏభై ఒక్కేళ్ళ సుదతి ఆ కాల్ పూర్తయ్యాక భర్త పాత లుంగీని తీసుకొని బాత్‌రూంలోకి వెళ్ళింది. దాన్ని ఆమె వృథా పోనీకుండా టవల్‌గా వాడుతోంది. స్నానం చేస్తూ ఆ పూట ఏం వండాలని ఆలోచిస్తూ ఫ్రిజ్‌లోని కూరగాయలని గుర్తుచేసుకోసాగింది.
వంట చేసేప్పుడు ఇంగువ ఐపోయిందని గ్రహించింది. ఉదయం తొమ్మిదికి వంట పూర్తి చేసి, కాలేజ్‌కి వెళ్ళే కూతురికి కేరియర్ ఇచ్చింది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కాబట్టి హోటల్‌కి వెళ్ళడం ఆ కుటుంబంలోని ఎవరికీ అలవాటు లేదు.
ఆమె వెళ్ళాక సుదతి సంచీ తీసుకుని పది నిమిషాల నడక దూరంలోని జయంట్ సూపర్ బజార్‌కి వెళ్ళింది. ఆవిడ సరాసరి ఆ ఐల్‌కి వెళ్ళి ఎల్.జి. ఇంగువ డబ్బాని తీసుకుంది. మరికొన్ని వస్తువులని కూడా తీసుకుని కూతురికి టెక్స్›్ట మెసేజ్ చేసింది. ఆవిడ చెక్ అవుట్ కౌంటర్‌లో ఉండగా కూతురు నుంచి ఫోన్ వచ్చింది.
‘‘జయంట్‌లో ఉంటే శానిటరీ నేప్‌కిన్స్ తీసుకో. ఎర్రరంగు తిలకం కూడా. ఇంకేమైనా గుర్తొస్తే ఐదు నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను.’’
ఆవిడ క్యూలోంచి బయటకి వచ్చి ఆ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని మళ్ళీ వచ్చి చెకౌట్ క్యూలో నిలబడింది. తన ముందు నిలబడ్డ పద్దెనిమిదేళ్ళ కుర్రాడిని చూసి, ‘ఈ రోజుల్లో గడ్డం పెంచడం మగాళ్ళకి ఫేషన్ ఐపోయింది’ అని అనుకుంది.
ఆ కుర్రాడి కళ్ళు పదే పదే తన చేతికున్న బ్రేస్లెట్ వంక చూడటం గమనించాక సుదతికి అతను దొంగేమో అన్న ఆలోచన కలిగింది. కొంగుతో దాన్ని కప్పుకోవాలి అని అనుకుంటూండగా అతను ప్రశ్నించాడు.
‘‘మీరు పాలేశ్వరావు భార్య కదా?’’
ఆవిడకి ఆ ప్రశ్నకి కొద్దిగా ఆశ్చర్యం వేసింది.
‘‘అవును. ఆయన నీకు తెలుసా?’’ వెంటనే అడిగింది.
‘‘తెలుసు. మా నాన్నగారు, ఆయన కొలీగ్స్.’’
‘‘నన్ను ఎలా గుర్తుపట్టావు? మా ఇంటికి వచ్చావా?’’
‘‘లేదు. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి.’’
‘‘మరెలా గుర్తుపట్టావు?’’
‘‘ఆ బ్రేస్లెట్ మీద మీ పేరుని చూసి. రావుగారు దాన్ని కొని మీకు ఇరవైయ్యవ మేరేజ్ ఏనివర్సరీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారని మా ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. నాకు ఎడ్యుకేషన్ లోన్ తిరస్కరిస్తే ఆయనే ఇప్పించారు.’’
‘‘మా వారికి ‘పరోపకారి పాపన్న’ అనే ముద్దు పేరు పెట్టాము. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందని తెలిస్తే ఆయన అంతట ఆయనే వాళ్ళింటికి వెళ్ళి సాయం చేస్తారు.’’ సుదతి నవ్వుతూ చెప్పింది.
‘‘ఆయన రాలేదా?’’ అతను ఆవిడ బుట్టలోని సామానుని కౌంటర్ మీద పెడుతూ అడిగాడు.
‘‘కేంప్‌కి వెళ్ళారు.’’
అతను ఆవిడ కేరీ బేగ్ బయటకి మోసుకువచ్చాడు. అతనేదో చెప్పడానికి సందేహిస్తున్నాడని గ్రహించిన సుదతి అడిగింది.
‘‘ఏమిటి?’’
‘‘మీరు పాలేశ్వరరావుగారికి ఫెయిత్‌ఫుల్‌గా ఉంటానని ఆయనకి మాట ఇవ్వండి. ఆయన తిరిగి వచ్చాక మీ ప్రేమని వ్యక్తం చేస్తూండండి.’’
ఆ మాటలకి ఆవిడ తుళ్ళిపడింది.
‘‘నా వయసు ఎంతో తెలిస్తే ఆ మాట అనవు. వచ్చే ఏడు ఏభై రెండు వస్తాయి.’’
‘‘గతంలో హంస రాయబారాలు ఉన్నాయో లేవో నాకు తెలీదు. కాని నేడు ఆ పనిని వాట్సప్ చక్కగా చేస్తోంది. వివాహేతర సంబంధాలకి వయసు అడ్డురాదు. మా అమ్మ మీకన్నా ఓ ఏడాది పెద్దది. తన క్లాస్‌మేట్‌తో వాట్సాప్ ద్వారా టచ్‌లోకి వచ్చింది. అది ప్రేమగా అనను కాని కామంగా మారింది. ఆయనతో...’’ దుఃఖంగా ఆగాడు.
సుదతి ఉలిక్కిపడింది.
‘‘మా అమ్మానాన్నల విడాకుల కేస్ కోర్ట్‌లో నడుస్తోంది. మా అమ్మ చాపల్యం వల్ల ఓ చక్కటి కుటుంబం విడిపోయింది. మీరు మా అమ్మలా మీ కుటుంబానికి ద్రోహం చేయకండి అని చెప్పాలి అనిపించింది.’’
ఆవిడ ఆ షాక్‌లోంచి తేరుకునేలోగా అతను తన సైకిల్ దగ్గరకి వెళ్ళిపోయాడు. ఆవిడకి తనతో ఆప్యాయంగా మాట్లాడే ఓ పాత క్లాస్మేట్ గుర్తుకి వచ్చాడు. వెంటనే మొబైల్ ఓపెన్ చేసి ఓల్డ్ స్కూల్ స్టూడెంట్స్ గ్రూప్‌లోంచి బయటకి వచ్చేసింది.
ఆవిడ సామాను ఉంది కాబట్టి ఊబర్ ఆటోని బుక్ చేసింది. తర్వాత తన భర్తకి ఫోన్ చేసింది.
‘‘ఏమిటి?’’ పాలేశ్వర్ అడిగాడు.
‘‘ఐ లవ్ యు.’’
‘‘ఇదేమిటి కొత్తగా?’’
‘‘ఇప్పుడే మనకి మేలు చేసే ఓ ఆధునిక ఆర్తనాదం విన్నాను.’’ ఆవిడ నెమ్మదిగా చెప్పింది.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇదీ చదవండి: మశూచితో చనిపోయి... మళ్లీ పుట్టాడు? అసలేం జరిగిందంటే?


