ఫండే
కవర్ స్టోరీ
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు. దీర్ఘాయుర్దాయాన్ని మాత్రమే కాదు, ఆయువు ఉన్నంత వరకు ఒంట్లో పట్టుసడలని ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నారు.
పైపై పొగడ్తలను కాదు, ప్రేమతో పలకరించే మనుషులను కోరుకుంటున్నారు. సంపదను పోగేసుకోవడం కంటే జీవితంలో సంతృప్తిని కోరుకుంటున్నారు. ఖరీదైన వస్తువుల కోసం కంటే విలువైన అనుభవాల కోసం ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సమాజం ఒరవడిలో కొట్టుకుపోకుండా, తమదైన సమయాన్ని తమ కోసం కోరుకుంటున్నారు. జీవితాన్ని మరింత అర్థవంతంగా మలచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవనశైలిలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆనందాన్ని వెదుక్కోవడం వరకు; సామాజిక జీవితాన్ని ఆస్వాదించడం నుంచి తన కోసం తనదైన సమయాన్ని కేటాయించుకోవడం వరకు; కొత్త అనుభవాల కోసం అడుగులు వేయడం నుంచి జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవడం వరకు ఈతరం మనిషి కోరుకుంటున్నది ఒక్కటే– ‘జీవితాన్ని ఎలాగోలా గడపడం కాదు, మనస్ఫూర్తిగా జీవించాలి’. ‘తెల్లారిందా, నిద్రలేచామా, తిన్నామా, మళ్లీ నిద్రపోయామా’ అనేదే దినచర్య కాదు. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆలోచనల కోసం, ఆనందం కోసం ఆరోగ్యంగా బతకడమే జీవించడం.
నేటి తరం మనిషి మళ్లీ తనను తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే రాబట్టుకోవాలి అన్నట్లు మళ్లీ మొదటికే పయనమవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పరుగెడుతూనే ఉన్నాడు. శరీరం అలసిపోతూనే ఉంది. అయినా మరుసటి రోజు మళ్లీ అదే పరుగు. కానీ ఒక్కసారి ఆగి చూస్తే, అసలు ఎటు పరుగెడుతున్నాడో మాత్రం తెలియడం లేదు.
ఉత్సాహమే ఊపిరి!
ఇంతకాలం ‘ఎక్కువ కాలం బతకాలి’ అనేది ప్రధాన లక్ష్యం. ‘బతికినంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అనేది ఇప్పటి లక్ష్యం. వయసును ఆపడం ఎవరి చేతిలోనూ లేదు. కానీ వయసుతో పాటు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. మంచి ఆహారం, క్రమంతప్పని వ్యాయామం, తగినంత నిద్ర, నడక, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత– ఇవి ఇప్పుడు అందమైన రూపం కోసం మాత్రమే కాదు, ఆనందభరితమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన అలవాట్లు.
లక్ష్యం కేవలం ఎక్కువ రోజులు జీవించడం కాదు. బతికినంత కాలం మన పనులను మనమే చేసుకునేంత ఆరోగ్యంగా ఉండటం. అరవైలోనూ ఇరవైలా ఇష్టమైన ప్రయాణాలు చేయగలగాలి. డెబ్బై వచ్చినా మనకు నచ్చిన పనులు మనమే చేసుకోగలగాలి. అందుకు శరీరం సహకరించగలిగేలా చూసుకోవాలి. మనసు ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకునే విషయం కాకుండా ప్రతిరోజూ నిర్మించుకునే జీవన విధానంగా మారాలి.
అనుబంధాలకు అగ్రతాంబూలం
మన చుట్టూ చాలామంది ఉంటారు. మనసు విప్పి మాట్లాడగలిగే వారు ఎంతమంది? మనపై ప్రేమ కురిపించేవారెందరు? అందుకే పెద్ద పెద్ద వేడుకలు, హడావుడి కార్యక్రమాల కంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడటం, సాయంత్రం సరదాగా కలిసి నడవడం వంటి చిన్న చిన్న క్షణాలకు విలువ పెరుగుతోంది.
సంతోషకరమైన జీవితం కావాలంటే ఎప్పుడూ ఖర్చుతో కూడిన వినోదాలే అవసరం లేదు. మనసును తాకే చిన్న ఆత్మీయత చాలాసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అయినా, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం లేకుండా పోతున్న తరుణంలో తక్కువ మంది సన్నిహితులు, గాఢమైన అనుబంధం అనే ఆలోచనకు ఈ ట్రెండ్ కొత్త ఉత్తేజాన్నిస్తోంది.
ప్రయాణం పదిలం!
ప్రయాణం అంటే ఇప్పుడు కేవలం కొత్త ప్రదేశాలను చూసి తిరిగి రావడం కాదు. కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మన ఆలోచనలను మార్చే అనుభవాలను పొందడం కూడా ప్రయాణంలో భాగమవుతోంది. ఒక మంచి ప్రయాణం ముగిసిన తర్వాత మన దగ్గర కొన్ని చిత్రాలు మాత్రమే కాదు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కథలు, కొన్ని కొత్త ఆలోచనలు మిగలాలి.
కొన్నిసార్లు ఖరీదైన టూర్ కంటే ఓ ప్రశాంతమైన ఉదయం, సముద్రపు అలల చప్పుడు, కొండల మధ్య నడక మనసుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెడితేనే ప్రయాణం మొదలవుతుందనేది వందశాతం నిజం. ఎందుకంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచనను పక్కనపెట్టి, ఒక్కసారి కళ్లతో చూసి మనసులో దాచుకుంటే ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ప్రయాణం ముగిసేది మనం ఇంటికి చేరుకున్నప్పుడు కాదు, ఆ ప్రయాణం మనలో ఒక జ్ఞాపకంగా మిగిలినప్పుడు.’
ట్రెండ్ సెట్ చేద్దామనుకుంటూ...
వందేళ్లు బతకాలనే లక్ష్యంతో రోజూ పొద్దున్నే చేదు జ్యూస్‌లు తాగుతూ, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రోజు ప్రారంభించేవారు ఉంటారు. విడ్డూరమేంటంటే, అలా తాగేటప్పుడు వాళ్ల మొహం చూస్తే వందేళ్లు కాదు కదా, ఈ ఐదు నిమిషాలు బతికితే చాలు అనేలా ఎక్స్‌ప్రెషన్ పెడతారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లిన వాళ్లు కూడా, అక్కడ ‘మ్యాగీ తింటూ రీల్స్ చేయడం’ మర్చిపోరు.
హెల్దీ లైఫ్ కోసం కొన్న ఫిట్‌నెస్ బ్యాండులు రోజూ పదివేల అడుగులు వేయమని అలారమ్‌లు మోగిస్తుంటే, వాటిని ఇంట్లో ఆడుకునే పిల్లల చేతికి కట్టేసి కామ్‌గా టీవీ చూసే మహానుభావులు మన మధ్యే కనిపిస్తారు.
ఒకప్పుడు ఫ్రెండ్స్ కలవడమంటే కలిసి టీ కొట్టు దగ్గర గంటలు గడపడం. కానీ నేటి రిలాక్స్‌డ్ సోషియబిలిటీ రూమ్‌లో అందరూ పక్కపక్కనే కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రీల్స్ షేర్ చేసుకోవడం.
‘మన మందరం కలిసి ఈ వీకెండ్ ట్రిప్ వెళ్లాలి’ అని వాట్సాప్ గ్రూప్‌లో ప్లాన్ వేయడమే అసలైన ఎంజాయ్‌మెంట్. ఆ ట్రిప్ ఎప్పటికీ క్యాన్సిల్ అవుతుందని గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు!

ఈరోజు నాకు ప్రశాంతత కావాలి, ఈ టైమ్ నాది అని ఫోన్ సైలెంట్‌లో పెట్టి డోర్ వేసుకుంటారు. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో ‘ఎవరైనా మెసేజ్ చేశారేమో, నోటిఫికేషన్లు వచ్చాయేమో’ అని ఫోన్ అన్ లాక్ చేసి మరీ చూస్తుంటారు.
బాత్ రూమ్‌లో షవర్ కింద నిలబడి జీవిత పాఠాల గురించి ఆలోచించే ఆ పదిహేను నిమిషాలే నేటి మానవుడికి దొరికే తనదైన సమయం.
‘జీవితంలో కొత్త అనుభవం కావాలి, నన్ను నేను వెతుక్కోవాలి‘ అని కొండలు, కోనలు ఎక్కడానికి సోలో ట్రిప్‌లు వేస్తారు. తీరా అక్కడ కొండ కొనకి వెళ్లాక వెతికేది ‘తనను తాను’ కాదు, ఫోన్ లో ‘సిగ్నల్ వస్తుందా లేదా‘ అని!
మనకంటూ మనదైన సమయం
అందరి కోసం పరుగెడుతూ, మనల్ని మనం మర్చిపోవద్దు. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, బాధ్యతల కోసం– ఇలా అందరి కోసం సమయం కేటాయిస్తున్నాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయించు కోగలుగుతున్నాం? పుస్తకం చదవడానికి కావచ్చు, సంగీతం వినడానికి కావచ్చు, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కావచ్చు, ఇష్టమైన పని చేసుకోవడానికి కావచ్చు– రోజులో కొంత మనదైన సమయం మనకంటూ ఉండాలి.
మనల్ని మనం చూసుకోవడం స్వార్థం కాదు. మనసు అలసిపోకుండా చూసుకోవడం. మన మనసుకు నచ్చిన పని చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, మన గురించి మనం ఆలోచించేందుకు కాసేపు సమయం కేటాయించడం. ఇందులో పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. మనసుకు కాస్త ఊరటనివ్వడమే లక్ష్యం. రోజులో గంటల సమయం అవసరం లేదు. పది నిమిషాలైనా మన కోసం కేటాయిస్తే, ఆ రోజు మనదిగా అనిపిస్తుంది. అందరి కోసం పరుగెత్తే జీవితంలో ఒక్కసారి మన కోసం ఆగడం కూడా అవసరమే!

ప్రశాంతతకే ప్రాధాన్యం
ఇంతకు ముందు ఎంత లగ్జరీగా ఉంటే అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటారు అనే ఒక భావన ఉండేది. ఇల్లు నిండా వస్తువులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని లేదు. అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం, ఉపయోగించని వస్తువులను తగ్గించడం, ఉన్నవాటిని విలువగా ఉపయోగించడం ఇప్పుడు కొత్త జీవన విధానంలో భాగమవుతోంది. తక్కువ వస్తువులు అంటే తక్కువ జీవితం కాదు. తక్కువ గందరగోళంలో ఎక్కువ ప్రశాంతత.
దుస్తులు, అలంకరణ వస్తువులు, ఇంటి సామగ్రి, ఉపయోగించని పరికరాలు– ఇలా అవసరంలేని వాటిని తగ్గించుకుంటూ సరళమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వస్తువులను తగ్గించుకోవడం కాదు. మన సమయాన్ని, మన డబ్బును, మన శక్తిని ఎక్కడ ఉపయోగించాలో ఎంచుకోవడం. ఇల్లు వస్తువులతో నిండిపోవడం కంటే మనసుకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే ఆలోచన పెరుగుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ గందరగోళం, తక్కువ ఖర్చు, ఎక్కువ స్వేచ్ఛ.
ఆహార శ్రద్ధతోనే ఆరోగ్యం
ఆహారం విషయంలోనూ కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. రుచితో పాటు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తయారైంది? శరీరానికి ఎంత ఉపయోగం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంటివంట, స్థానికంగా లభించే పదార్థాలు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, తక్కువగా తయారుచేసిన ఆహారం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ‘కడుపు నిండితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘శరీరానికి మేలు చేసే ఆహారం కావాలి’ అనే ఆలోచన వైపు మార్పు కనిపిస్తోంది.
ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులుగా ఇంటివంట, తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, సంప్రదాయ ధాన్యాలు, స్థానికంగా లభించే పదార్థాలు వంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిర్మించే రోజువారీ పెట్టుబడి అనే భావన నవతరంలో బలపడుతోంది. రుచిని వదులుకోకుండా, ఆరోగ్యాన్ని కూడా దృష్టి్టలో పెట్టుకుని తినడం నేటి జీవనశైలిలో ముఖ్యమైన మార్పుగా మారుతోంది.
జీవితం పరుగు పందెం కాదు
అందరి కంటే ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా మనమే ముందుండాలి అనే ఆలోచనతో పరుగులు పెడుతూనే ఉన్నాం. అదే మనల్ని, మన ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తోంది. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు మాత్రమే విజయం కాదు. ఆరోగ్యంగా ఉండటం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే! జీవితమేమీ పరుగు పందెం కాదు, ప్రతి రోజూ గెలవాల్సిన పనిలేదు. రోజులో కొన్ని క్షణాలనైనా ఆనందంగా ఆస్వాదించడమే అసలైన జీవితం. జీవితాన్ని తర్వాత ఎప్పుడో ఆస్వాదిద్దాం అనుకుంటూ ఉంటే, ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.
సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చిన కొద్దీ జీవితం మరింత సులభతరంగా, మరింత వేగవంతంగా మారింది. కానీ అదే సమయంలో నిశ్శబ్దం, విశ్రాంతి, ప్రకృతి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సమయం వంటి వాటి విలువ కూడా మనకు మరింత స్పష్టంగా తెలుస్తోంది. అందుకే 2026 జీవనశైలి ఒక విచిత్రమైన మలుపులో నిలిచింది. ఈతరం పనుల్లో వేగాన్ని కోరుకుంటూనే, జీవితంలో నిదానానికి ప్రాధాన్యమిస్తోంది. సౌకర్యాలను ఆస్వాదిస్తూనే, సరళత వైపు అడుగులు వేస్తోంది. సాంకేతికతను అక్కున చేర్చుకుంటూనే, దాని నుంచి కొంత దూరం కావాలని కోరుకుంటోంది.
కొత్తదనం కోసం కొత్తగా ప్రయత్నించక్కర్లేదు, ముందు ఆన్‌లైన్ చెత్తను డంప్ చేస్తే చాలు. జీవితం దానంతట అదే కొత్తగా అనిపిస్తుంది!
- రమా జంబుల
ఇదీ చదవండి: డాటర్ ఇన్‌లా మదర్


