మదర్ అండ్ డాటర్
‘నా బిడ్డ ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టగలదా? ఆమె రూపంపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు చేస్తారా? ఆ క్రూరమైన వెక్కిరింపులను నా బిడ్డ భరించగలదా?
అమ్మా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను... అని అడిగితే ఏ విధంగా సర్ది చెప్పాలి?
ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఎన్ని రకాల వివక్షలు ఎదురవుతాయో, అసలు నా బిడ్డ భవిష్యత్ ఎలా ఉండబోతుందో?’.... సింగిల్ మదర్‌గా తన బిడ్డ మసాబా పెంపకంలో ప్రముఖ నటి నీనా గుప్తాకు ఇలాంటి సందేహాలు ఎన్నో ఎదురయ్యాయి. ఒత్తిడితో మనసు అల్లకల్లోలం అయ్యేది. ‘ఇలా నిరుత్సాహపడితే,ప్రతికూల ఆలోచనలలో మునిగిపోతే... బిడ్డ భవిష్యత్ ఏం అవుతుంది?’ అని ఆలోచించిన నీనా గుప్తా తనలో ప్రతికూల ఆలోచనల స్థానంలో, సానుకూల ఆలోచనలు నింపుకుంది. కూతురి పెంపకంలో ఎదురైన సమస్యలను ధైర్యసాహసాలతో ఎదుర్కొంది. ‘చిన్నప్పుడు మసాబా చాలా సైలెంట్. స్కూల్‌లో తనను ఎవరైనా వెక్కిరించినా, వేధించినా నాకు చెప్పేది కాదు’ గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు నీనాగుప్తా.
కట్ చేస్తే...
నీనా గుప్తా కూతురు మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ లేబుల్ ‘హౌజ్ ఆఫ్ మసాబా’కు ఫౌండర్‌గా విజయపథంలో దూసుకెళుతోంది. ‘మసాబా గుప్తా’ అనే పేరు వినిపిస్తే ఆమె తల్లి కళ్లలో గర్వం తొంగిచూస్తుంది. కూతురు గురించి గతాన్ని గుర్తు చేసుకున్నారు నీనా గుప్తా. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...
‘నేను టీవీ పనుల్లో బాగా బిజీగా ఉండేదాన్ని. అయినా సరే, మసాబా ఎప్పుడూ ఏ ఫిర్యాదు చేయలేదు. నేను ఇవ్వగలిగింది ఆమెకు ఇచ్చాను. తనలో ఎప్పుడూ అసంతృప్తి ఉండేది కాదు. ఆమె తండ్రి గురించి నేను ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదు. నిజం చెప్పాను. అలా చెప్పడం వల్ల ఆమె సెక్యూర్‌గా ఫీల్ అయింది.
మసాబా తన మనసులో మాట నాకు ఎప్పుడూ చెప్పేది కాదు. నాకు మాత్రం వేరే ఆందోళనలు ఉండేవి. ఆమె మొటిమల గురించి కావచ్చు, ఎక్కువసేపు టెన్నిస్ ఆడడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం చూపడం కావచ్చు. మొటిమల తీవ్రత ఎలా ఉండేదంటే, వాటి భయంతో ఇంటి నుంచి బయటికి రావడానికి మసాబా భయపడేది! మొటిమలకు సంబంధించి ముంబైలోని ప్రతి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్లి ఉంటాను. కొందరు వైద్యులు మాత్రలు సూచించారు. అంత చిన్న వయసు అమ్మాయికి మాత్రలు వాడడం నాకు నచ్చలేదు. శరీరాకృతి కారణంగా స్కూల్లో మసాబాను కొందరు ‘కర్లీ టాప్’ అని పిలుస్తూ వేధించేవారనే విషయం తెలిసి బాధపడ్డాను. కానీ నా బిడ్డ ఒక ఫైటర్. ఎప్పుడూ తలవంచదు. ఓటమి అంగీకరించదు!
నేను సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను. మసాబా ఫ్రెండ్స్‌కు సినిమా ఫీల్డ్‌లో ఎంతోమంది తెలుసు. అయితే ఆ పరిచయాలేవీ మసాబా సినిమా ఫీల్డ్‌లోకి అడుగు పెట్టడానికి సరిపోలేదు. సన్నగా, తెల్లగా ఉండే మహిళలను ఆరాధించే సినీ పరిశ్రమలో మసాబాకు చోటు లేదు అనిపించింది. ఉన్న విషయం చెబితే ఆమెకు మనోవేదన కలుగుతుందని తెలుసు. అందుకే... మసాబాను సంగీతంతో సహా ఇతర రంగాల వైపుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాను.
చివరికి మసాబా ఫ్యాషన్‌ను ఎంచుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ పెద్ద బ్రాండ్‌ను సృష్టించుకుంది.’


