డాటర్‌ ఇన్‌లా మదర్‌ | Intersection of Daughters Day and Daughters-in-Law | Sakshi
Sakshi News home page

డాటర్‌ ఇన్‌లా మదర్‌

Sep 27 2026 4:35 AM | Updated on Sep 27 2026 4:35 AM

 Intersection of Daughters Day and Daughters-in-Law

అనగనగా ఒక అత్త... ఒక కోడలు... వారి మధ్య కథ మొదలైతే... ఉప్పూ నిప్పూ... కన్నీళ్లూ కుట్రలూ.... బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో... టీవీ స్క్రీన్‌ మీద సీరియళ్లు. కాని రిమోట్‌ మార్చే వేళయింది.  అత్తా ఒకింటి అమ్మే... కోడలూ ఒకింటి కూతురే అన్నట్టు అత్తాకోడళ్లు జట్టు కడుతున్నారు. అత్తలో అమ్మను కోడలిలో కూతురిని చూసుకుంటున్నారు.  కోడలే ఈకాలం కూతురు.

మొన్న విజయవాడ పెళ్లిలో ఒక దృశ్యం...
అత్తగారి చీర కుచ్చిళ్లు సర్దుతున్న కోడలు ‘నువ్వు సూపర్‌గా ఉన్నావ్‌ అత్తయ్య, ఒక ఫొటో దిగుదాం’ అని సెల్ఫీ దిగుతోంది. పక్కనే ఇంకో టేబుల్‌ దగ్గర అత్తాకోడళ్ల సంభాషణ... ‘రాత్రికి మళ్లీ వంటెందుకు అమ్మాయ్‌... స్విగ్గిలో చపాతి తెప్పిద్దాంలే’ అని అత్త అంటే ‘అదే బెస్ట్‌ అత్తయ్యా’ అని కోడలు అంటోంది.

ఇప్పుడు కనిపిస్తున్న ఈ దృశ్యాలు 2016 అంటే పదేళ్ల కింద కూడా లేవు. అత్తాకోడళ్లంటే శత్రువులే అని సమాజం నమ్మేది... నమ్మించేది.... వాళ్లు కొట్లాడుకుంటే మనకే మంచిదన్నట్టు కుటుంబ రాజకీయాలు వర్ధిల్లేవి. ఇప్పుడు భారీ కుటుంబాలు లేవు. అమ్మగారింట్లో తల్లీదండ్రీ ఇద్దరు పిల్లలు. అత్తగారింట్లో తల్లీదండ్రీ ఇద్దరు పిల్లలు. అమ్మగారిల్లయినా అత్తగారిల్లయినా నలుగురు కుటుంబ సభ్యులే ప్రైమరీ యూనిట్‌. వీళ్ల మధ్య మళ్లీ యుద్ధాలు ఎందుకు... పేచీలు ఎందుకు... పోట్లాటలు ఎందుకు... వరుస మారినా బంధంలో అదే తీపి ఉంచుకోవచ్చుకదా అనుకుంటున్నారు. మారిన అత్తాకోడళ్ల ట్రెండ్స్‌ ఇలా ఉన్నాయి.

ట్రెండ్‌ 1: మిత్రలాభం
‘ఇద్దరూ బాగా ఫ్రెండ్సయినట్టున్నారు’ అని ఏదో సినిమాలో డైలాగ్‌. రాను రాను అత్తాకోడళ్లు ‘మిత్రలాభా’న్ని గ్రహిస్తున్నారు. ఒకప్పుడు ‘నా కొడుకుని నా నుంచి దూరం చేసింది’ అని ఫీల్‌ అయ్యే అత్తగారు ఇప్పుడు ‘నా కోడలు నా కొడుకు కంటే బాగా చూసుకుంటుంది‘ అని ఫీల్‌ అవుతోంది. అత్తా కోడళ్లకు ఇప్పుడు కామన్‌ టాపిక్‌ వంట కాదు... ఫైనాన్స్  ప్లానింగ్‌. ‘అత్తమ్మా, ఈ మ్యూచువల్‌ ఫండ్‌ బాగుందట’ అని కోడలు చె΄్తోంది. ‘మనిద్దరం కలిసి తిరుమల వెళదామా ఆయనకు కుదరపోతే’ అనేంత చనువు తీసుకుంటోంది. ఇద్దరూ కలిసి మార్నింగ్‌ వాక్, జిమ్‌ చేస్తున్నారు. వంట భారాన్ని ఇద్దరూ చెరి ఒక చేయి వేసి లాగించేస్తున్నారు. వీకెండ్‌ వస్తే ‘ఈరోజు వంటొద్దులే అత్తమ్మా, బయట తిందాం’ అని చెప్పే స్వేచ్ఛ కోడలికి ‘నువ్వు రెస్ట్‌ తీసుకోమ్మా‘ అని చెప్పే ప్రేమ అత్తమ్మకూ వచ్చింది.

ట్రెండ్‌ 2: ఈగో కాదు, ఈక్వేషన్‌
‘ఇగోలు పోతే ఇల్లు స్వర్గమే’ అన్నాడో సంసారి. ఒకప్పుడు అత్త ‘ఇది నా ఇల్లు... వీడు నా కొడుకు’ అనే ఇగోలో ఉండేది. ఇప్పుడు కోడలు సంపాదిస్తున్నది. చన్నీళ్లకు చన్నీళ్లు వేణ్ణీళ్లకు వేణ్ణీళ్లు అందిస్తోంది. ఆమె ప్రమేయం అనివార్యం అయ్యే కొద్దీ అత్తలో ‘నా ఇల్లు’ బదులు ‘మన ఇల్లు’ భావన వస్తోంది. అత్త కూడా పెన్షన్‌తోనో, సేవింగ్స్‌తోనో కొద్దో గొ΄్పో ఇండిపెండెంట్‌గా ఉంది కాబట్టి ‘ఆ ఒక్క ప్రాణం ఏం భారం’ అనుకోవడమూ ఉంది.  దాంతో ‘ఎవరు గొప్ప?’ అని కాదు, ‘ఎలా బెటర్‌ గా ఉందాం?’ అనే ఆలోచన అత్తాకోడళ్లలో. ‘మా అత్తమ్మ నా వంటలో తప్పులు వెతకదు, నేర్చుకోవడానికి సాయం చేస్తుంది’ అని కోడలు చెబితే... ‘నా కోడలు ఆన్ లైన్‌ బ్యాంకింగ్, ఓటీటీ యాప్స్‌ వాడటం నేర్పిన గైడ్‌’ అంటోంది అత్త. ఇలా స్కిల్స్‌ షేర్‌ చేసుకోవడమే నేటి అత్తాకోడళ్ల బాండింగ్‌ సీక్రెట్‌.

ట్రెండ్‌ 3: లోటు భర్తీ
చాలా మంది అత్తయ్యలు కొడుకు పెళ్లి నాటికి కూతురు పెళ్లి చేసేసి ఉంటారు. ఇంట్లో కూతురు లేని లోటు వారికి తెలుసు. కోడలు వస్తే కూతురు వయసు అమ్మాయి వచ్చినట్టే కదా. ‘నా కూతురు ఉంటే ఇలాగే చూసుకునేదాన్ని’ అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. కోడళ్లు కూడా తల్లిని వదిలి వచ్చిన బెంగను అత్త ప్రేమతో మర్చిపోతున్నారు. ‘అమ్మా’ అని పిలవడానికి మొహమాటం పోయింది. ఇంట్లో ఏదైనా చిన్న గొడవ జరిగితే కొడుకును పక్కన పెట్టి, కోడలి వైపు నిలబడి న్యాయం చేసే అత్తమ్మలు పెరిగినప్పుడు ఆ కోడలు ఆ ఇంటిని సొంత ఇంటిలా కాకుండా ఇంకేమని భావిస్తుంది? అందుకే ఇది కోడరికం కాదు, మరో అమ్మ ఒడి! ‘డాటర్స్‌ డే’ అంటే కన్న కూతురు గురించి మాత్రమే కాదు... ఇంటికి వచ్చిన కూతురు గురించి కూడా.

సీరియల్స్‌లో చూపించే అత్తాకోడళ్లు ఎప్పుడో అవుట్‌ డేటెడ్‌. ఆ సంగతి తెలియక ఇంకా అలాంటి సబ్జెక్ట్సే తీస్తూ రోత పుట్టిస్తున్నారు. 2026లో నిజమైన అత్తాకోడళ్లంటే ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకునే సపోర్ట్‌ సిస్టమ్‌. ఆఫీస్‌ ప్రెజర్స్, డెడ్‌లైన్స్ ఉన్నప్పుడు కోడలికి వేడి కాఫీ అందిస్తూ... ‘నువ్వు ప్రెజెంటేషన్‌ మీద ఫోకస్‌ పెట్టు, ఇల్లు నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చే అత్తమ్మలు మన చుట్టూ చాలామంది కనిపించడం లేదా? అత్త అమ్మ కావడం; కోడలు కూతురు కావడం... ఈ డాటర్స్‌డేకి ఇంతకంటే పెద్ద సెలబ్రేషన్‌ ఏముంటుంది? 
   
 – కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement