breaking news
welness
-
నయా ట్రెండ్.. నయా లైఫ్! హాయిగా.. హ్యాపీగా..
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు. దీర్ఘాయుర్దాయాన్ని మాత్రమే కాదు, ఆయువు ఉన్నంత వరకు ఒంట్లో పట్టుసడలని ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నారు.పైపై పొగడ్తలను కాదు, ప్రేమతో పలకరించే మనుషులను కోరుకుంటున్నారు. సంపదను పోగేసుకోవడం కంటే జీవితంలో సంతృప్తిని కోరుకుంటున్నారు. ఖరీదైన వస్తువుల కోసం కంటే విలువైన అనుభవాల కోసం ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సమాజం ఒరవడిలో కొట్టుకుపోకుండా, తమదైన సమయాన్ని తమ కోసం కోరుకుంటున్నారు. జీవితాన్ని మరింత అర్థవంతంగా మలచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవనశైలిలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆనందాన్ని వెదుక్కోవడం వరకు; సామాజిక జీవితాన్ని ఆస్వాదించడం నుంచి తన కోసం తనదైన సమయాన్ని కేటాయించుకోవడం వరకు; కొత్త అనుభవాల కోసం అడుగులు వేయడం నుంచి జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవడం వరకు ఈతరం మనిషి కోరుకుంటున్నది ఒక్కటే– ‘జీవితాన్ని ఎలాగోలా గడపడం కాదు, మనస్ఫూర్తిగా జీవించాలి’. ‘తెల్లారిందా, నిద్రలేచామా, తిన్నామా, మళ్లీ నిద్రపోయామా’ అనేదే దినచర్య కాదు. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆలోచనల కోసం, ఆనందం కోసం ఆరోగ్యంగా బతకడమే జీవించడం.నేటి తరం మనిషి మళ్లీ తనను తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే రాబట్టుకోవాలి అన్నట్లు మళ్లీ మొదటికే పయనమవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పరుగెడుతూనే ఉన్నాడు. శరీరం అలసిపోతూనే ఉంది. అయినా మరుసటి రోజు మళ్లీ అదే పరుగు. కానీ ఒక్కసారి ఆగి చూస్తే, అసలు ఎటు పరుగెడుతున్నాడో మాత్రం తెలియడం లేదు.ఉత్సాహమే ఊపిరి!ఇంతకాలం ‘ఎక్కువ కాలం బతకాలి’ అనేది ప్రధాన లక్ష్యం. ‘బతికినంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అనేది ఇప్పటి లక్ష్యం. వయసును ఆపడం ఎవరి చేతిలోనూ లేదు. కానీ వయసుతో పాటు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. మంచి ఆహారం, క్రమంతప్పని వ్యాయామం, తగినంత నిద్ర, నడక, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత– ఇవి ఇప్పుడు అందమైన రూపం కోసం మాత్రమే కాదు, ఆనందభరితమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన అలవాట్లు.లక్ష్యం కేవలం ఎక్కువ రోజులు జీవించడం కాదు. బతికినంత కాలం మన పనులను మనమే చేసుకునేంత ఆరోగ్యంగా ఉండటం. అరవైలోనూ ఇరవైలా ఇష్టమైన ప్రయాణాలు చేయగలగాలి. డెబ్బై వచ్చినా మనకు నచ్చిన పనులు మనమే చేసుకోగలగాలి. అందుకు శరీరం సహకరించగలిగేలా చూసుకోవాలి. మనసు ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకునే విషయం కాకుండా ప్రతిరోజూ నిర్మించుకునే జీవన విధానంగా మారాలి.అనుబంధాలకు అగ్రతాంబూలంమన చుట్టూ చాలామంది ఉంటారు. మనసు విప్పి మాట్లాడగలిగే వారు ఎంతమంది? మనపై ప్రేమ కురిపించేవారెందరు? అందుకే పెద్ద పెద్ద వేడుకలు, హడావుడి కార్యక్రమాల కంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడటం, సాయంత్రం సరదాగా కలిసి నడవడం వంటి చిన్న చిన్న క్షణాలకు విలువ పెరుగుతోంది. సంతోషకరమైన జీవితం కావాలంటే ఎప్పుడూ ఖర్చుతో కూడిన వినోదాలే అవసరం లేదు. మనసును తాకే చిన్న ఆత్మీయత చాలాసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అయినా, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం లేకుండా పోతున్న తరుణంలో తక్కువ మంది సన్నిహితులు, గాఢమైన అనుబంధం అనే ఆలోచనకు ఈ ట్రెండ్ కొత్త ఉత్తేజాన్నిస్తోంది.ప్రయాణం పదిలం!ప్రయాణం అంటే ఇప్పుడు కేవలం కొత్త ప్రదేశాలను చూసి తిరిగి రావడం కాదు. కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మన ఆలోచనలను మార్చే అనుభవాలను పొందడం కూడా ప్రయాణంలో భాగమవుతోంది. ఒక మంచి ప్రయాణం ముగిసిన తర్వాత మన దగ్గర కొన్ని చిత్రాలు మాత్రమే కాదు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కథలు, కొన్ని కొత్త ఆలోచనలు మిగలాలి.కొన్నిసార్లు ఖరీదైన టూర్ కంటే ఓ ప్రశాంతమైన ఉదయం, సముద్రపు అలల చప్పుడు, కొండల మధ్య నడక మనసుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెడితేనే ప్రయాణం మొదలవుతుందనేది వందశాతం నిజం. ఎందుకంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచనను పక్కనపెట్టి, ఒక్కసారి కళ్లతో చూసి మనసులో దాచుకుంటే ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ప్రయాణం ముగిసేది మనం ఇంటికి చేరుకున్నప్పుడు కాదు, ఆ ప్రయాణం మనలో ఒక జ్ఞాపకంగా మిగిలినప్పుడు.’ట్రెండ్ సెట్ చేద్దామనుకుంటూ...వందేళ్లు బతకాలనే లక్ష్యంతో రోజూ పొద్దున్నే చేదు జ్యూస్‌లు తాగుతూ, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రోజు ప్రారంభించేవారు ఉంటారు. విడ్డూరమేంటంటే, అలా తాగేటప్పుడు వాళ్ల మొహం చూస్తే వందేళ్లు కాదు కదా, ఈ ఐదు నిమిషాలు బతికితే చాలు అనేలా ఎక్స్ప్రెషన్ పెడతారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లిన వాళ్లు కూడా, అక్కడ ‘మ్యాగీ తింటూ రీల్స్ చేయడం’ మర్చిపోరు.హెల్దీ లైఫ్ కోసం కొన్న ఫిట్నెస్ బ్యాండులు రోజూ పదివేల అడుగులు వేయమని అలారమ్‌లు మోగిస్తుంటే, వాటిని ఇంట్లో ఆడుకునే పిల్లల చేతికి కట్టేసి కామ్‌గా టీవీ చూసే మహానుభావులు మన మధ్యే కనిపిస్తారు.ఒకప్పుడు ఫ్రెండ్స్ కలవడమంటే కలిసి టీ కొట్టు దగ్గర గంటలు గడపడం. కానీ నేటి రిలాక్స్డ్ సోషియబిలిటీ రూమ్‌లో అందరూ పక్కపక్కనే కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రీల్స్ షేర్ చేసుకోవడం.‘మన మందరం కలిసి ఈ వీకెండ్ ట్రిప్ వెళ్లాలి’ అని వాట్సాప్ గ్రూప్‌లో ప్లాన్ వేయడమే అసలైన ఎంజాయ్మెంట్. ఆ ట్రిప్ ఎప్పటికీ క్యాన్సిల్ అవుతుందని గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు!ఈరోజు నాకు ప్రశాంతత కావాలి, ఈ టైమ్ నాది అని ఫోన్ సైలెంట్లో పెట్టి డోర్ వేసుకుంటారు. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో ‘ఎవరైనా మెసేజ్ చేశారేమో, నోటిఫికేషన్లు వచ్చాయేమో’ అని ఫోన్ అన్ లాక్ చేసి మరీ చూస్తుంటారు.బాత్ రూమ్‌లో షవర్ కింద నిలబడి జీవిత పాఠాల గురించి ఆలోచించే ఆ పదిహేను నిమిషాలే నేటి మానవుడికి దొరికే తనదైన సమయం.‘జీవితంలో కొత్త అనుభవం కావాలి, నన్ను నేను వెతుక్కోవాలి‘ అని కొండలు, కోనలు ఎక్కడానికి సోలో ట్రిప్‌లు వేస్తారు. తీరా అక్కడ కొండ కొనకి వెళ్లాక వెతికేది ‘తనను తాను’ కాదు, ఫోన్ లో ‘సిగ్నల్ వస్తుందా లేదా‘ అని!మనకంటూ మనదైన సమయంఅందరి కోసం పరుగెడుతూ, మనల్ని మనం మర్చిపోవద్దు. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, బాధ్యతల కోసం– ఇలా అందరి కోసం సమయం కేటాయిస్తున్నాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయించు కోగలుగుతున్నాం? పుస్తకం చదవడానికి కావచ్చు, సంగీతం వినడానికి కావచ్చు, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కావచ్చు, ఇష్టమైన పని చేసుకోవడానికి కావచ్చు– రోజులో కొంత మనదైన సమయం మనకంటూ ఉండాలి.మనల్ని మనం చూసుకోవడం స్వార్థం కాదు. మనసు అలసిపోకుండా చూసుకోవడం. మన మనసుకు నచ్చిన పని చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, మన గురించి మనం ఆలోచించేందుకు కాసేపు సమయం కేటాయించడం. ఇందులో పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. మనసుకు కాస్త ఊరటనివ్వడమే లక్ష్యం. రోజులో గంటల సమయం అవసరం లేదు. పది నిమిషాలైనా మన కోసం కేటాయిస్తే, ఆ రోజు మనదిగా అనిపిస్తుంది. అందరి కోసం పరుగెత్తే జీవితంలో ఒక్కసారి మన కోసం ఆగడం కూడా అవసరమే!ప్రశాంతతకే ప్రాధాన్యంఇంతకు ముందు ఎంత లగ్జరీగా ఉంటే అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటారు అనే ఒక భావన ఉండేది. ఇల్లు నిండా వస్తువులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని లేదు. అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం, ఉపయోగించని వస్తువులను తగ్గించడం, ఉన్నవాటిని విలువగా ఉపయోగించడం ఇప్పుడు కొత్త జీవన విధానంలో భాగమవుతోంది. తక్కువ వస్తువులు అంటే తక్కువ జీవితం కాదు. తక్కువ గందరగోళంలో ఎక్కువ ప్రశాంతత.దుస్తులు, అలంకరణ వస్తువులు, ఇంటి సామగ్రి, ఉపయోగించని పరికరాలు– ఇలా అవసరంలేని వాటిని తగ్గించుకుంటూ సరళమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వస్తువులను తగ్గించుకోవడం కాదు. మన సమయాన్ని, మన డబ్బును, మన శక్తిని ఎక్కడ ఉపయోగించాలో ఎంచుకోవడం. ఇల్లు వస్తువులతో నిండిపోవడం కంటే మనసుకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే ఆలోచన పెరుగుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ గందరగోళం, తక్కువ ఖర్చు, ఎక్కువ స్వేచ్ఛ.ఆహార శ్రద్ధతోనే ఆరోగ్యంఆహారం విషయంలోనూ కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. రుచితో పాటు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తయారైంది? శరీరానికి ఎంత ఉపయోగం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంటివంట, స్థానికంగా లభించే పదార్థాలు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, తక్కువగా తయారుచేసిన ఆహారం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ‘కడుపు నిండితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘శరీరానికి మేలు చేసే ఆహారం కావాలి’ అనే ఆలోచన వైపు మార్పు కనిపిస్తోంది.ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులుగా ఇంటివంట, తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, సంప్రదాయ ధాన్యాలు, స్థానికంగా లభించే పదార్థాలు వంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిర్మించే రోజువారీ పెట్టుబడి అనే భావన నవతరంలో బలపడుతోంది. రుచిని వదులుకోకుండా, ఆరోగ్యాన్ని కూడా దృష్టి్టలో పెట్టుకుని తినడం నేటి జీవనశైలిలో ముఖ్యమైన మార్పుగా మారుతోంది.జీవితం పరుగు పందెం కాదుఅందరి కంటే ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా మనమే ముందుండాలి అనే ఆలోచనతో పరుగులు పెడుతూనే ఉన్నాం. అదే మనల్ని, మన ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తోంది. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు మాత్రమే విజయం కాదు. ఆరోగ్యంగా ఉండటం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే! జీవితమేమీ పరుగు పందెం కాదు, ప్రతి రోజూ గెలవాల్సిన పనిలేదు. రోజులో కొన్ని క్షణాలనైనా ఆనందంగా ఆస్వాదించడమే అసలైన జీవితం. జీవితాన్ని తర్వాత ఎప్పుడో ఆస్వాదిద్దాం అనుకుంటూ ఉంటే, ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చిన కొద్దీ జీవితం మరింత సులభతరంగా, మరింత వేగవంతంగా మారింది. కానీ అదే సమయంలో నిశ్శబ్దం, విశ్రాంతి, ప్రకృతి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సమయం వంటి వాటి విలువ కూడా మనకు మరింత స్పష్టంగా తెలుస్తోంది. అందుకే 2026 జీవనశైలి ఒక విచిత్రమైన మలుపులో నిలిచింది. ఈతరం పనుల్లో వేగాన్ని కోరుకుంటూనే, జీవితంలో నిదానానికి ప్రాధాన్యమిస్తోంది. సౌకర్యాలను ఆస్వాదిస్తూనే, సరళత వైపు అడుగులు వేస్తోంది. సాంకేతికతను అక్కున చేర్చుకుంటూనే, దాని నుంచి కొంత దూరం కావాలని కోరుకుంటోంది.కొత్తదనం కోసం కొత్తగా ప్రయత్నించక్కర్లేదు, ముందు ఆన్లైన్ చెత్తను డంప్ చేస్తే చాలు. జీవితం దానంతట అదే కొత్తగా అనిపిస్తుంది!- రమా జంబులఇదీ చదవండి: డాటర్ ఇన్లా మదర్ -
సుమారు రూ. 3 లక్షలు : ఉద్యోగులకు టెక్ కంపెనీ సర్ప్రైజ్ గిఫ్ట్!
ఉన్నట్టుండి లేఆఫ్స్ చేసే దిగ్గజ టెక్నాలజీ కంపెనీలతో పాటు, కంపెనీ అభివృద్ధికి పాటుపడిన తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించి, వారికి భారీ బహుమతులు, ప్రోత్సాహకాలు అందించిన టెక్ యజమానులు చాలా మందే ఉన్నారు. కానీ వినూత్నంగా లోచించిన ఈ స్టార్టప్ కంపెనీ ఓనర్ మాత్రం చాలా భిన్నం. తన ఎంప్లాయిస్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పదండి మరి అదేంటో తెలుసుకుందాం."బిజినెస్ ఇన్సైడర్" ప్రకారం కార్యాలయ ప్రయోజనాలను పునఃసమీక్షిస్తున్న తరుణంలో, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అధిపతి తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించారు. అందులో భాగంగా తమ సిబ్బంది కోసం నిద్రకు సంబంధించిన టెక్నాలజీపై వేల డాలర్లను ఖర్చు చేయడం విశేషం. ఇదీ చదవండి: షాకింగ్ : ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!స్టార్టప్ 'ఫ్యాక్టరీ' (Factory) అధినేత మతాన్ గ్రిన్బర్గ్ (Matan Grinberg) తన ఉద్యోగుల పనితీరును మెరుగు పరిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే వారి ఆరోగ్యంతోపాటు, తద్వారా వచ్చే ఫలితంపై దృష్టిపెట్టారు. కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ఉద్యోగులందరికీ సుమారు 2,83,746 విలువైన 'ఎయిట్ స్లీప్' (Eight Sleep) ప్రీమియం మ్యాట్రెస్ కవర్లను కానుకగా ఇచ్చారు. కంపెనీలో దాదాపు 30 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్‌ను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో 120 మంది ఉద్యోగులు ఉన్నారు, అలాగే కంపెనీకి 150 మిలియన్ల డాలర్ల ఫండింగ్ కూడా లభించిందట.ఇలా ఇవ్వడానికి కారణమేంటి అంటే.గ్రిన్బర్గ్ తన ఉద్యోగుల విశ్రాంతిని క్రీడాకారుల రికవరీతో పోల్చారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి మంచి నిద్ర అవసరమని తాను నమ్ముతా నన్నారు. ప్రతి ఒక్కరూ తమ మెదడులోని ప్రతి అణువు శక్తిని పూర్తిగా వినియోగించుకునేలా చూడాలనుకుంటున్నా అని, అలా చేయాలంటే, వారికి మంచి నిద్ర అవసరమని చెప్పారు. ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లిఉద్యోగుల పనితీరుపై తన దృష్టి నిద్రకు మాత్రమే పరిమితం కాదని వ్యవస్థాపకుడు చెప్పారు. ఏకాగ్రత మరియు మానసిక చురుకుదనంపై వాటి ప్రభావం గురించి ఆందోళనల కారణంగా, కార్యాలయంలో అధికంగా ప్రాసెస్ చేయబడిన చక్కెర పదార్థాల లభ్యతను తగ్గించడానికి కూడా ఆయన ప్రయత్నించారు. దానికి బదులుగా, కంపెనీ ప్రోటీన్ ఆధారిత స్నాక్స్ , క్యాన్డ్ మాచా పానీయాలతో సహా మరింత ఖరీదైన ప్రత్యామ్నాయాలను అందిస్తుంది. మరో విషయం ఏమిటంటే 2010 నాటి గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఆఫీసుల్లో వినోదానికిచ్చిన అనవసరమైన సదుపాయాలను ఆయన తప్పు బట్టారు. అవి ఉత్పాదకతకు ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. గత దశాబ్దంలో ప్రధాన టెక్నాలజీ సంస్థలతో ముడిపడి, విస్తృతంగా ప్రచారంలో ఉన్న కార్యాలయ సంస్కృతికి తన తత్వం భిన్నంగా ఉంటుందని గ్రిన్బర్గ్ నొక్కి చెప్పారు.రోజుకు అతిగా, నిర్బంధంగా పని చేసే విధానాన్ని "గ్రైండ్స్లాప్" (ఉదాహరణకు 996 వర్క్ కల్చర్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పనిచేసే ఒక కఠినమైన పని విధానం. దీని ప్రకారం ఉద్యోగి వారానికి ఏకంగా 72 గంటలు పని చేయాల్సి ఉంటుంది.) విధానాన్ని వ్యతిరేకించారు. "మనమీ డేకేర్ సెంటర్ నడపట్లేదు, ఉద్యోగులు ఇన్ని గంటలు పని చేయాలని రూల్ పెట్టడానికి" అని గ్రిన్బర్గ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అఫ్గాన్‌లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!భవిష్యత్తు ప్రణాళికలుఅయితే కొత్తగా చేరిన ఉద్యోగులకు ఇంకా ఈ మ్యాట్రెస్ కవర్లు ఇవ్వలేదు. అయితే, భవిష్యత్తులో దీనిని ఒక శాశ్వత వెల్నెస్ అలవెన్స్‌గా మార్చాలని ఆయన ఆలోచిస్తున్నారు. దీని వల్ల ఉత్పాదకత ఎంత పెరిగిందో ఖచ్చితంగా లెక్కించలేకపోయినా, మంచి నిద్ర వల్ల ఉద్యోగులు మరింత చురుగ్గా, తెలివిగా పనిచేస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. సిబ్బంది వాటిని అభినందిస్తున్నారని తనకు తెలుసని గ్రిన్బర్గ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!అలాగే ఒక 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'ని నియమించుకునే బదులు, ఆఫీస్ కోసం ఒక ప్రైవేట్ చెఫ్‌ను నియమించుకోవడం లాభదాయకమని భావించారు. 2024లో ఈ వేరబుల్ టెక్నాలజీ కంపెనీ, తమ ఉద్యోగుల సగటు నిద్ర స్కోరు 85 శాతం దాటితే ప్రతి నెల 100 డాలర్లు బోనస్ ఇస్తామని ప్రకటించడం మరో విశేషం.కాగా కోవిడ్ అనంతరం, ఆరోగ్య రక్షణపైనా అందులోప్రధానమైన నిద్రకు ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే నోటికి టేప్ చుట్టే పద్ధతుల నుండి ఓరా రింగ్స్ వరకు, చాలా మంది వినియోగదారులు మెరుగైన నిద్ర నాణ్యతను సాధించే ప్రయత్నంలో సాంకేతికత,జీవనశైలి మార్పుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండ్ ఆన్లైన్లో "స్లీప్‌మాక్సింగ్" గా (Sleepmaxxing) పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం -
యోగ కోచ్‌గా ఐఐటీయన్..!
ఐఐటియన్‌గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్‌లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్‌లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్‌కు చెందిన వారు. తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్. చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్‌ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు. కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న సౌరభ్‌కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్‌లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్లైన్ క్లాస్‌లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్లైన్ క్లాస్‌లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్లైన్ క్లాస్‌లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.ముగ్గురితో మొదలైన ఆన్లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్‌లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.వావ్ అనిపించే వరల్డ్ రికార్డులుయూట్యూబ్లో యోగా లైవ్ స్ట్రీమ్‌ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్‌ఫామ్‌గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్‌ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్‌కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్‌కు సంబంధించింది. మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్. (చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..) -
చేతుల పరిశుభ్రత కోసం..!
విద్యార్థుల్లో మంచి ఆరోగ్య పద్ధతులను, పరిశుభ్రత అలవాట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఇల్నెస్ టు ఫౌండేషన్ సహకారంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PEFI) ‘స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్’ (ఆరోగ్యకరమైన చేతులు, ఆరోగ్యకరమైన బాల్యం) అనే ప్రచారాన్ని ప్రారంబించింది. సుమారు వంద పాఠశాలలు కవర్ చేసేలా దాదాపు 40 వేల మంది విద్యార్థులను భాగస్వామ్యం అయ్యేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. గతేడాది దాదాపు 35 పాఠశాలల్లో దగ్గర దగ్గర 30 వేల మందికి పైగా విద్యార్థులను విజయవంతంగా భాగస్వామ్యం అయ్యేలా చేసింది. ఈ ప్రచార కార్యక్రమం విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంలో సహాయపడటమే కాకుండా పాఠశాల వాతావరణం తోపాటు సమాజంలోని ప్రజారోగ్య అవగాహనను బలోపేతం చేస్తోంది. ఈ వెల్నెస్ పద్ధతులను విద్యార్థులు జీవితాంత అనుసరించేలా చేయడం తోపాటు నిజమైన స్వస్థ్ భారత్ మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఈ ఇల్నెస్ టు వెల్నెస్ ఫౌండేషన్ సలహా మండలి చైర్పర్సన్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. కేవలం సాంప్రదాయ ఉపన్యాసాలపై మాత్రమే ఆధారపడకుండా, వివిధ రకాల ఆకర్షణీయమైన, వినూత్న ఫార్మాట్ల ద్వారా హ్యాండ్‌వాషింగ్ టెక్నిక్లను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ 'స్వస్థ్ హాత్, స్వస్థ్ బచ్పన్' ప్రచారం ప్రారంభ కార్యక్రమం సెప్టెంబర్ 6,2025న న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ - IIలోని బల్వంత్రాయ్ మెహతా విద్యా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలకు అనుగుణమైన హ్యాండ్‌వాషింగ్ టెక్నిక్‌లపై నిపుణుల సలహాలతో కూడిన ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్‌ను అందించారు కూడా.(చదవండి: Weight Loss Story: లైఫ్స్టైల్లో ఆ ఐదు మార్పులు తప్పనిసరి..! 59 కిలోలు తగ్గిన ఇన్ఫ్లుయెన్సర్) -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ ఫార్ట్ వాక్ అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
ట్రా'వెల్నెస్' టిప్స్..!
నిన్నమొన్ననే జరిగిన క్రిస్మస్ సెలవుల కోసమని కొందరు, జనవరి మొదటిరోజు తమకు ఇష్టమైన వారిని కలవడం కోసం లేదా రాబోయే సంక్రాంతికి ఇంకొందరు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. కారణమేదైనా రకరకాల అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ప్రయాణాలు చేయాల్సిన ఆవశ్యకత ఉండనే ఉంటుంది. ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కథనమిది. అన్నిటికంటే ముందుగా ప్రయాణం చేయబోయే ముందర తాము రెగ్యులర్‌గా సంప్రదించే జనరల్ ఫిజీషియన్‌ను తొలుత తప్పనిసరిగా కలవాలి. తాము వెళ్తున్న ప్రదేశం గురించి తెలపాలి. అక్కడ ఉండే వాతావరణానికి అనువుగా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని... ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్‌కు చెప్పి, ఆ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకోవాలి. ఆ మేరకు డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేసిన ప్రకారం... తమకు అవసరమైన మందులను ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఉదాహరణకు హై–బీపీ, డయాబెటిస్, హై–కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తాము ప్రయాణం చేసే కాలానికి అవసరమైనన్ని మందులను రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సరిగ్గా తాము అనుకున్న వ్యవధికి అవసరమైనన్నే కాకుండా... వీలైతే కొద్దిగా ఎక్కువ మందులే తీసుకెళ్లడం మంచిది. ఉదాహరణకు ఆస్తమా బాధితులు ఎటాక్ వచ్చిన వెంటనే తాము తక్షణం వాడాల్సిన (ఎస్ఓఎస్) మందుల్ని వెంట ఉంచుకోవాలి. అలాగే వారు తమతోపాటు క్యారీ చేయాల్సిన ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ను (వీలైతే ఒకటి రెండు ఎక్కువగానే) తీసుకెళ్లాలి. ఇది ఉదాహరణ మాత్రమే. ప్రయాణికులు తమ ఆరోగ్య సమస్యను బట్టి మందులు క్యారీ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు... అక్కడ ఉండే ఆరోగ్య పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన ముందస్తు టీకా మందులు (వ్యాక్సిన్స్) తీసుకోవాలి. ఉదాహరణకు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో ఫీవర్ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాలకు ప్రయాణం చేసేవారు ముందుగానే అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాతే ప్రయాణం మొదలుపెట్టాలి. గర్భవతులు తాము వాడాల్సిన మందులూ, అలాగే తీసుకోవాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకొని ఉండాలి. పిల్లలకు వారికి ఉన్న ఆరోగ్య సమస్యలను బట్టి వారు తీసుకోవాల్సిన మందుల్ని రెడీగా ఉంచుకోవాలి. ఆయా దేశాలే కాదు... కొన్ని సందర్భాల్లో తాము ప్రయాణం చేసే విమాన సంస్థలు సైతం కొన్ని ఆంక్షలు పెడుతుంటాయి. ‘‘ఫిట్ టు ఫ్లై’’ నిబంధనలుగా పేర్కొనే ఈ నిబంధనల గురించి ముందుగానే తెలుసుకోవాలి. దీంతో తమ ప్రయాణంలో రాబోయే సమస్యలను తెలుసుకుని, నివారించుకోవడం తేలికవుతుంది. తాము బస చేయబోయే చోట కొందరు పాస్ట్ ట్రావెల్ హిస్టరీ’ అడిగి తీసుకుంటూ ఉంటారు. అంటే... గతంలో ఏయే ప్రాంతాలు / దేశాలు తిరిగివచ్చారో అడిగి తెలుసుకుంటుంటారు. తమ పాస్ట్ ట్రావెల్ హిస్టరీ గురించి ఎవరికి వారు ముందుగానే సమీక్షించుకుని, ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. అయితే ప్రజలందరి సంక్షేమం కోసం తమ ట్రావెల్ హిస్టరీని పారదర్శకంగా సమర్పించడం ప్రయాణికులకూ మేలు. ఒక్కోసారి ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టడం... వారికే ఇబ్బందులు తెచ్చేందుకు అవకాశమిస్తుంది. ఇవే గాకుండా... తాము వెళ్లబోయే ప్రదేశంలో ఉండే వాతావరణానికి అనువుగా దుస్తులు, అక్కడ ఎదురవ్వబోయే సమస్యలకు అనువుగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం మంచిది. ఇటీవల పిల్లలకూ, పెద్దలకు దాదాపుగా అందరికీ కళ్లజోళ్లు ఉంటున్నాయి. ఉన్న కళ్లజోడుకి తోడుగా మరొకటి అదనంగా తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే జర్నీలో కళ్లజోడు పోయినా లేదా విరిగిపోయినా అప్పటికప్పుడు మరొకటి సమకూర్చుకోవడం ప్రయాణ సమయంలో కష్టమవుతుంది. మరొకటి అదనంగా (స్పేర్‌గా) పెట్టుకోవడం చాలావరకు ఉపకరిస్తుంది. ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రయాణంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యల్ని తేలిగ్గానే అధిగమించవచ్చు. అందుకే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ప్రయాణం మొదలుపెట్టడం చాలావరకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ∙ -
'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?
ప్రస్తుత జీవన విధానంలో ఎంతమంది నిద్రలేమితో బాధపడుతున్నారో తెలిసిందే. ఒక్క క్షణం రెప్పవాలితే బాగుండును అన్నంతగా ఉంది పరిస్థితి. అందుకోసం మెడిసిన్స్ అని ఏవేవో చిట్కాలని పాటించేస్తున్నారు కూడా. కేవలం చక్కటి జీవనశైలితో శరీర ధర్మం దానంతట అదిగా సర్దుబాటు అయ్యేలా చేసుకోవాల్సిందేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని కూడా క్యాష్ చేసుకునేలా కొన్ని కార్పొరేట్ కంపెనీలు చూస్తుండటం బాధకరం. ఏకంగా సాంకేతికతో కూడిన సాధనాలు, ప్రత్యేక పరుపులు వీటితో మంచి నిద్ర గ్యారంటీ అంటూ ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ కంపెనీలు. మరోవైపు ప్రజలు నిద్ర వస్తే చాలు అన్నట్లు వాటిని కొనితెచ్చేసుకోవాలనే ఆరాటంలో ఉన్నారు. అలా వచ్చిందే ఈ "స్లీప్‌మాక్సింగ్" వెల్నెస్ ట్రెండ్..!. అసలు ఏంటిది.? దీని వల్ల నిజంగా మంచి నిద్ర పడుతుందా..?నిద్ర కోసం సాగించిన అన్వేషణ కాస్త "స్లీప్‌మాక్సింగ్"కి దారితీసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నిద్రలేమితో బాధపడేవారంతా సోషల్‌మీడియాలో గ్రూప్‌గా మారి ఒకరి అనుభవానలు ఒకరూ షేర్ చేసుకుంటున్నప్పుడూ వచ్చిందే ఈ "స్లీప్ మాక్సింగ్". ఒక ఔత్సాహిక సోషల్ మీడియా వినియోగదారు చెప్పడంతో ఇది రకరకాల చర్చలకు తెరలేపింది. 'స్లీప్‌మాక్సింగ్' అంటే..నిద్ర కోసం ఉపయోగించే ఒక విధమైన సాధనాలు లేదా ఉత్పత్తులుగా చెప్పొచ్చు. ఇయర్‌ప్లగ్‌లు, నాసికా డైలేటర్లు, మెగ్నీషియం ఫుట్ స్ప్రే, మౌత్ టేప్, చిన్ స్ట్రాప్స్ ట్రాకర్లతో మంచి నిద్రను పొందేలా మార్గం సుగమం చేసుకునే విధానమే స్లీప్‌మాక్సింగ్. దీని గురించి సోషల్ మీడియా వినియోగదారు డెరెక్ ఆంటోసిక్ చెప్పుకొచ్చారు. తన 20 ఏళ్ల జీవితంలోని అనారోగ్యకరమైన అలవాట్లు నిద్రలేమికి దారితీశాయని, దాన్ని అధిగమించేందుకు సాగిన అన్వేషణలో ఈ స్లీప్‌మాక్సింగ్ తనకు ఉపయోగపడిందంటూ వివరించాడు. ఈ సాధానాలతో మంచి నిద్రపట్టిందా లేదా అని ట్రాకర్‌తో చెక్ చేసుకునేవాడినని చెబుతున్నాడు అంతేగాదు ఆ సాధానాలు తనకు గాఢనిద్రను అందించాయని చెప్పాడు. దీన్ని క్యాష్ చేసుకునేలా కొన్ని కంపెనీలు స్మార్ట్ స్లీప్ సొల్యూషన్ అంటూ సాంకేతికతో కూడిన సాధనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ హెడ్‌బ్యాండ్ వంటవి గాఢనిద్రను ప్రేరేపించేలా నిశబ్ద వాతావరణాన్ని సృష్టించేందుకు మెదడు తరంగాలను ఉపయోగిస్తుందట. అలాగే మెదడు మెలుకువగా ఉండేలా చేసే కార్యకలాపాలను లక్ష్యంగా రూపొందిచామని ఊదరగొడుతున్నాయి కంపెనీలు. అంతేగాదు మంచినిద్రను తెచ్చిపెట్టే పరుపులు కూడా వచ్చేశాయి. అలాగే ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే సాధనాలు, గురక తగ్గించే పరికరాలు వంటి వాటితో నిద్రను ప్రజలు కొనుక్కునే దుస్థితికి తీసుకొచ్చేయటం బాధకరం. అయితే నెటిజన్లు మాత్రం ఇవన్నీ మంచి నిద్రను అందించే సాధానలే అయిన..అవేమి సహజమైన నిద్రను అందివ్వలేవని తేల్చి చెబుతున్నారు. చక్కటి శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లతోనే దాన్ని పొందగలమని నమ్మకంగా చెబుతుండటం విశేషం. ఆ గాడ్జెట్స్‌పై ఆధారపడితే క్రమేణ నాణ్యమైన నిద్రను కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తూ..పోస్టులు పెట్టారు. (చదవండి: 'సూసైడ్ పాడ్': జస్ట్ బటన్ నొక్కితే చాలు.!) -
హమ్మయ్య సొమ్ములు దక్కాయి
‘సహజ ’ ఆస్పత్రిలో ‘ వెల్నెస్ సెంటర్ ’ ప్రతిపాదన రద్దు వడ్డీతో కలిపి రూ.31.15 లక్షలు దేవస్థానానికి తిరిగి చెల్లింపు అన్నవరం : దేవస్థానంలోని సహజ ఆస్పత్రిలో ఆధునిక పరికరాలతో యోగా, నేచురోపతి, కేరళ తరహా ఆయర్వేద వైద్యాన్ని అందించే‘ వెల్నెస్ సెంటర్ ’ ఏర్పాటు చేస్తామని గతేడాది ఏప్రిల్‌లో రూ.30 లక్షలు వసూలు చేసిన బెంగుళూర్లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ (డీమ్డ్ యూనివర్సిటీ) ఎట్టకేలకు వడ్డీతో తిరిగి దేవస్థానానికి చెల్లించింది. వాస్తవానికి గత ఏడాది జూన్ కల్లా ఈ సెంటర్ ఏర్పాటై భక్తులకు సేవలందించాల్సి ఉంది. ఇప్పటి వరకూ అలాంటి సెంటర్ ఏర్పాటు కాలేదు సరికదా, ఏర్పాటు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనిపించలేదు. ఈ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కాకపోవడం, దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలు విషయమై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయమై గత ఆగష్టు లో ‘ సాక్షి ’దినపత్రికలో వార్త ప్రచురితమైంది. అధికారులలో స్పందన వచ్చి వెంటనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా నిధులను వడ్డీతో సహ వెనక్కి చెల్లించాలని ఆ యూనివర్సిటీకి, దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షలతో పాటు రూ.1.15 లక్షలు వడ్డీ కలిపి దేవస్థానానికి పంపించింది. ఈ విషయాన్ని ఈఓ నాగేశ్వరరావు శనివారం సాయంత్రం ‘సాక్షి’కి తెలిపారు. అన్నవరంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలలో బెంగళూర్‌లోని ‘స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ’ (డీమ్డ్ యూనివర్సిటీ)తో ‘వెల్నెస్ సెంటర్ ’ లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. తొలుత అన్నవరం దేవస్థానంలో సహజ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. ఆ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్న కంభంపాటి సుబ్రహ్మణ్యం మరో ఇద్దరు ప్రతినిధులు అన్నవరం లోని సహజ ఆస్పత్రిని పరిశీలించారు. ‘వెల్నెస్ సెంటర్’ కు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు. సెంటర్ ను 11 ఏళ్లపాటు నిర్వహించేందుకు విడతల వారీగా దేవస్థానం రూ.80 లక్షలు చెల్లించేలా గత ఏప్రిల్‌లో దేవస్థానానికి, ఆ యూనివర్సిటీకి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా రూ.30 లక్షలు ఆ యూనివర్సిటీ ప్రతినిధులకు అందించింది. ఆ తర్వాత ఆస్పత్రిని నెలరోజులు మూసివేసి ఆ భవనాన్ని వారికి అప్పగించారు. సహజ సిబ్బందికి బెంగళూరులోని ఆ యూనివర్సిటీలో మే నెలలో శిక్షణ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సెంటర్ ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్లలేదు. దేవస్థానం చెల్లించిన రూ.30 లక్షల గురించి ఆందోళన నెలకొంది. దీనిపై గత ఏడాది ఆగస్టులో ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో ఈఓ నాగేశ్వరరావు స్పందించి ఉన్నతాధికారులకు, యూనివర్సిటీ ప్రతినిధులకు లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు ఆ నిధులు తిరిగి వచ్చాయి. సహజ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని ఈఓ కె.నాగేశ్వర రావు ‘సాక్షి’కి వివరించారు. దీనిపై త్వరలోనే ఆ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.


