 
													ఐఐటియన్‌గా పెద్ద కలలు, ఖరీదైన కలలేవీ కనలేదు సౌరభ్. ‘మార్పు తెచ్చే శక్తి యోగాలో ఉంది’ అని గ్రహించిన ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నాడు. ‘హబిల్డ్’ గ్లోబల్ మూమెంట్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించాడు. ఈ విశ్వవేదికలో 169 దేశాల నుంచి 1.2 కోట్ల మంది యోగాభ్యాసకులుఉన్నారు. ఇక వరల్డ్ రికార్డ్‌లు సరే సరి... ‘ఐఐటీ పూర్తి చేసి ఆరుసంవత్సరాలైనా సౌరభ్ ఏమీ సంపాదించలేదు’ అని కొద్దిమంది అనుకునేవారు. వారికి తెలియని విషయం ఏమిటంటే సౌరభ్ చాలా సంపాదించాడు. ఎంతో పేరు! ఎన్నో రికార్డ్‌లు!! మహారాష్ట్రలోని ధనజ్ అనే చిన్న గ్రామంలో పుట్టాడు సౌరభ్. అతడి పూర్వీకులు రాజస్థాన్‌కు చెందిన వారు.
తాత లక్ష్మీచంద్ 1955లో యంబీబీయస్ పూర్తి చేశాడు. బాగా డబ్బులు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి, పట్టణాలలో మాత్రమే ఉండాలి అనుకోలేదు. పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రోడ్లు కూడా సరిగ్గా లేని మారుమూల గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. వైద్యుడిగా సేవలందించడమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఎంతో చేశాడు లక్ష్మీచంద్.
చిన్నప్పటి నుంచి తాత గురించి ఎన్నో మంచి విషయాలు విన్నాడు సౌరభ్. అలా తనకు తెలియకుండానే తాత స్ఫూర్తిగా మారాడు. స్వామి వివేకానంద బోధనలు కూడా సౌరభ్‌ను ఎంతో ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉద్యోగం కాదు. సమాజం కోసం ఏదైనా చేయాలి’ అనుకున్నాడు.
కాలేజి రోజుల్లో ఒకసారి బెనారస్ నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న సౌరభ్‌కు ఒక ధ్యానకేంద్రానికి చెందిన సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారితో పరిచయం తన జీవనగమనాన్ని మార్చింది. యోగాపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. వారు నిర్వహించే ధ్యాన, యోగ తరగతులకు హాజరయ్యేవాడు. యోగ తరగతులకు హాజరుకావడం టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్రమం తప్పకుండా ధ్యానం, యోగా చేసేవాడు. దీనివల్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఆస్తమ సమస్య ఉపశమనం దొరికినట్లయింది.
యోగాలో ప్రావీణ్యం సాధించిన సౌరభ్ ఆ విద్యను వీలైనంత ఎక్కువ మందికి నేర్పించాలనే లక్ష్యంతో ప్రయాణం ప్రారంభించాడు. దేశం నలుమూలలా తిరుగుతూ ఎంతోమందికి యోగా నేర్పించాడు. ‘యోగా బోధించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగాను.
ఆ సమయంలో నా సంతోషం మాటలకు అందనిది. ప్రతిరోజూ కొత్తగా, ఉత్సాహంగా ఉండేది. రోజూ నిద్ర లేవగానే ఈరోజు క్లాస్‌లో ఎలా బోధించాలి అనేదాని గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజూ పండగ జరుపుకున్నంత ఉత్సాహంగా ఉండేది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సౌరభ్.
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా యోగా ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభించాడు. అయితే మొదట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరయ్యేవారు. తాను నిర్వహించే తరగతులు ఉచితం కాబట్టి వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని గ్రహించిన సౌరభ్ తన ఆన్‌లైన్ క్లాస్‌లకు నెలకు వంద రూపాయలు ఫీజుగా పెట్టాడు.
ముగ్గురితో మొదలైన ఆన్‌లైన్ క్లాస్ విద్యార్థుల సంఖ్య వందకు చేరింది. ఆ తరువాత దేశదేశాలకు విస్తరించి, విద్యార్థుల సంఖ్య లక్షలు దాటింది. తాను నిర్వహించే ఆన్‌లైన్ తరతులకు ముగ్గురు మాత్రమే హాజరైనప్పుడు సౌరభ్ నిరాశకు గురికాలేదు. ఘనమైన రికార్డ్‌లు నెలకొల్పినప్పుడు అహంతో ప్రవర్తించడం లేదు. యోగా నేర్పిన సమ్యక్ దృష్టితోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
వావ్ అనిపించే వరల్డ్ రికార్డులు
యూట్యూబ్‌లో యోగా లైవ్ స్ట్రీమ్‌ను అత్యధికంగా వీక్షించిన ప్లాట్‌ఫామ్‌గా హబిల్డ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అదే సంవత్సరం ఈ ప్లాట్‌ఫామ్ రెండు వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించింది. అందులో ఒకటి...ఒకేరోజులో చాలామంది లైవ్ వ్యూయర్స్‌కు సంబంధించింది, రెండోది లార్జెస్ట్ వర్చువల్ మెడిటేషన్ క్లాస్‌కు సంబంధించింది. 
మొదటి దానిలో 5,99,162 మంది, రెండో దానిలో 2,87,711 మంది పాల్గొన్నారు. ఈ సంవత్సరం 169 దేశాలకు చెందిన 7,52,074 మందితో వర్చువల్ యోగా సెషన్ నిర్వహించి మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు సౌరభ్.
(చదవండి: ఇద్దరు పిల్లల తల్లి సాహసం..! మరో రికార్డు కోసం..)
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
