‘జిమ్‌కు వెళ్లేవారు స్టెరాయిడ్‌లు వాడుతున్నారు’ అనే మాట వినిపించినప్పుడు కళ్ల ముందు కండలు తిరిగిన పురుషుడి చిత్రం ఆవిష్కృతం అవుతుంది. అయితే సీన్ మారుతోంది. పురుషులే కాదు స్టెరాయిడ్‌లు వాడుతున్న మహిళల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి...
ప్రపంచవ్యాప్తంగా మహిళలలో అనబాలిక్ స్టెరాయిడ్‌ల వాడకం పెరిగిందని చెబుతోంది ఇంటర్నేషనల్ స్టడీస్ సిస్టమేటిక్ రివ్యూ. 2014లో స్టెరాయిడ్‌లు వాడిన మహిళలు 1.6 శాతం ఉండగా, 2024 రివ్యూ ప్రకారం 4 శాతం మంది మహిళలు స్టెరాయిడ్‌లు ఉపయోగిస్తున్నారు.
మహిళా బాడీబిల్డర్‌లలో దాదాపు 17 శాతం మంది, ప్రతి ఆరుగురిలో ఒకరు స్టెరాయిడ్‌లను ఉపయోగిస్తున్నారని నివేదిక చెబుతోంది. ఈ పెరుగుదలకు సోషల్ మీడియాలోని ‘ఫిట్‌ఫ్లూయెన్సర్స్’ ప్రభావమే కారణం అనే విమర్శ ఉంది.
స్టెరాయిడ్‌లు వాడుతున్న వారిలో ఎక్కువమంది మహిళలకు దీర్ఘకాలంలో వాటి దుష్ప్రభావం గురించి అవగాహన లేదు. వీటిని వాడుతున్న క్రమంలో అనారోగ్య సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం లేదు.
గతంతో పోల్చితే పవర్‌లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీబిల్డింగ్‌లలో మహిళల సంఖ్య వేగంగా పెరిగింది. ‘ఆటతీరు మెరుగు పడాలి. ప్రత్యర్థిపై పైచేయి ఉండాలంటే మాదకద్రవ్యాలు వాడాలి’ అనే భావన వల్ల కొందరు వాటికి దగ్గరవుతున్నారు.
ఆస్ట్రేలియా, స్కాండినేవియాలలో చేసిన ఒక అధ్యయనం ప్రకారం...పురుష స్నేహితులు, కోచ్‌ల వల్ల స్టెరాయిడ్‌లను ఉపయోగించడం మొదలుపెడతారు. ఇవి హానికరం అనే భావన కంటే పోటీకి అనివార్యమనే భావనే వారిలో ఉంటుంది. స్టెరాయిడ్‌లు ఆటకు ఎంత మేలు చేస్తాయనేది పక్కన పెడితే ఆరోగ్యానికి హాని చేస్తాయి.
వాటిలో కొన్ని...
ముఖంపై వెంట్రుకలు పెరగడం
స్వరంలో మార్పులు
రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి
రొమ్ము కణజాలం తగ్గడంమొటిమలు రావడం, వెంట్రుకలు రాలడం ఆందోళన, చిరాకు, తీవ్రమైన మానసిక స్థితి
స్టెరాయిడ్‌లలో సీసం, ఆర్సెనిక్, కాడ్మియంలాంటి ప్రమాదకరమైన విషపూరితాలు ఉంటాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇవి క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులకు కారణమయ్యే విషాలు.
‘ఈ ప్రమాదాలను నివారించాలంటే స్టెరాయిడ్‌ల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి సోషల్ మీడియా వేదికగా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయడమే మార్గం’ అంటున్నారు నిపుణులు.
(చదవండి: అయోర్టిక్ స్టెనోసిస్ అంటే..? తొమ్మిది పదుల వయసులో ఇది తప్పదా..?)


