హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వృక్షాలలో అరటి చెట్టు ఒకటి. ఈ చెట్టును దేవ వృక్షంగా, సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఏ శుభకార్యం జరిగినా, పూజాది కార్యక్రమాలు నిర్వహించినా అరటి ఆకులు, గెలలు తప్పనిసరి. అయితే, ఈ పవిత్రమైన చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల అపారమైన శ్రేయస్సు పాజిటివ్ ఎనర్జీ కలుగుతాయని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యదిశలో అరటి చెట్టును నాటడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో తెలుసుకుందాం..
ఈశాన్యం అనేది శుభాలకు నిలయంగా భావిస్తారు. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, అరటిచెట్టును నాటడానికి ఈశాన్య దిశ అంటే తూర్పు–ఉత్తర దిక్కుల మధ్య మూల. ఇది అత్యంత శ్రేయస్కరం అయింది. ఈశాన్యాన్ని దేవతల స్థానంగా, శివుడు, గురువు బృహస్పతి కి సంబంధించిన దిక్కుగా భావిస్తారు. ఈ దిశలో అరటి చెట్టు ఉండడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది. అరటి చెట్టు బహస్పతి గ్రహానికి సంబంధించినది. ఈశాన్యంలో అరటి చెట్టును నాటి, పూజించడం ద్వారా జాతకంలో గురు గ్రహం బలం పెరుగుతుంది.
గురు బలం పెరిగితే, జ్ఞానం, విద్య, అదృష్టం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. గురువారం రోజున శ్రీమహావిష్ణువుకు అరటి చెట్టు రూపంలో పూజ చేయడం, పసుపు నీరు పోయడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అరటి చెట్టు నాటేటప్పుడు పాటించాల్సిన వాస్తు నియమాలు ఏమిటంటే..? అరటి చెట్టు ఇంట్లో శుభాన్ని తీసుకురావాలంటే, కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈశాన్యంతోపాటు, ఉత్తర లేదా తూర్పు దిశలో కూడా నాటవచ్చు. అయితే అరటిచెట్టు నీడ ఇంటిపై పడకుండా చూసుకోవడం ముఖ్యం.
ముఖ్య గమనిక.. అరటి చెట్టును ఇంటి ప్రధాన ద్వారం ముందు భాగంలో నాటకూడదు. ఎల్లప్పుడూ ఇంటి పెరట్లో లేదా కాంపౌడ్ లోపల వెనుక భాగంలో ఉండేలా చూసుకోవాలి. అరటి చెట్టుకు దగ్గరలోనే తులసి మొక్కను నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. తులసి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి, ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది.
అరటి చెట్టు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఆకులు ఎండిపోకుండా చూసుకోవడం, ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా ప్రతికూల శక్తిని నివారించవచ్చు. పవిత్రమైన అరటి చెట్టును ఈశాన్యంలో నాటి, నిత్యం పూజించడం ద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు ఎల్లప్పుడూ వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నారు.
– పసుపులేటి వెంకటేశ్వరరావు


