ఒక ఊర్లో ఒక ముసలవ్వ ఉండేది. ఆమెకు చిన్నప్పటినుంచీ భద్రాచలం వెళ్లాలని, గోదావరిలో మునిగి శ్రీసీతారామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక. అయితే సంసార సాగరంలో మునిగి తేరుకునేలోగా ఆమెకు వయసు అరవై దాటింది.ఒకరోజు తన మనవడితో అదే విషయం చెప్పింది. ‘‘రాముణ్ణి చూడటానికి అంతదూరం పోవాలా? మన ఊరి గుడిలో రాములవారి పటం ఉంది కదా, రోజూ దాన్ని చూస్తూ పూజ చేసుకుంటే పోలేదా?’’ అని ఎదురు ప్రశ్న వేశాడు. అతడికి ఎలా సర్ది చెప్పాలో ముసలవ్వకు అర్థం కాలేదు.
నెలలు గడిచాయి. ఆమె వయసు అరవై ఆరుకు చేరుకుంది. కోరిక తీరకుండానే ఫోటోకి పూలమాల వేయించుకోవాల్సి వస్తుందేమోనని అవ్వకు అనుమానం వేసింది. గట్టిగా మాట్లాడి మనవడిని ఒప్పించాలనుకుంది. ఒక నిండు పౌర్ణమినాడు మనవడు ఇంటికి వచ్చాడు. భద్రాచలం విషయం అడిగింది. ‘నువ్వు ఇప్పుడు భద్రాచలం వెళ్ళి రాముణ్ణి చూడకపోతే ఏమీ కాదు, ఇదిగో... రామకోటి రాసుకో.
రాముణ్ణి చూసిన పుణ్యం కలుగుతుంది’’ అని చెప్పి పుస్తకం ఆమె చేతికి ఇచ్చాడు. పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. భోజనం చేద్దామని వంటగదిలోకి వచ్చాడు. ‘‘ఆకలిగా ఉంది, అన్నం పెట్టు’’ అని అడిగాడు. గడసరి అయిన అవ్వ ‘‘అన్నం, అని వందసార్లు ఈ తెల్ల కాగితం మీద రాయి, ఆకలి పోతుంది’’ అని చెప్పి తెల్లకాగితం, పెన్ను ఇచ్చింది.
‘‘అన్నం తింటే ఆకలి తీరుతుంది కానీ లక్షసార్లు రాస్తే కడుపు నిండదు, అన్నం తినాల్సిందే’’ అన్నాడు.‘‘మరి శ్రీరాముణ్ణి చూడాలని నేను ఎన్నో ఏండ్లుగా ప్రాధేయపడుతూ ఉంటే రామకోటి రాయమని చెబుతావేమి?’’ అని నిలదీసింది. తప్పు తెలుసుకున్నాడు. వీలు చూసుకుని పోదామన్నాడు. అవ్వ మురిసిపోయింది. అభిమానంగా పప్పూ నెయ్యి కలిపిన బువ్వ కడుపు నిండా పెట్టింది. తృప్తిగా తిన్నాడు.
ఆరు నెలల తర్వాత ఇద్దరూ భద్రాచలం బస్సు ఎక్కారు. అప్పటికే ఆ ముసలవ్వ రాత్రింబగుళ్ళూ మేలుకుని రామకోటి పుస్తకం పూర్తి చేసింది. ‘రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము’ పాట పాడుకుంటూ ఇద్దరూ శ్రీ సీతారాములవారి దర్శనం చేసుకున్నారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
(చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..)


