‘లాంగ్ లీవ్స్ సీజన్’గా డిసెంబర్ నెల
ఒకేసారి లీవ్స్ వాడుకోవడం ఆనవాయితే..
ఐటీ ఉద్యోగుల్లో పెరిగిన కల్చర్
కొన్ని సంస్థల్లో క్రిస్మస్ లీవ్స్‌కి నో అబ్జెక్షన్
టూరిస్ట్ డెస్టినేషన్స్‌కు భారీగా బుకింగ్స్
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ నెల అంటే హైదరాబాద్ నగర వాసులకు ప్రత్యేకమైన క్రేజ్.. ఏడాది చివరి నెలగా మాత్రమే కాకుండా లాంగ్ లీవ్స్ ఫెస్టివల్‌గా మారింది. ఏడాదిగా దాచుకున్న లీవ్స్‌ను ఐటీ ఉద్యోగులు ఈ ఒక్క నెలలోనే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థల్లో ఈ కల్చర్ స్పష్టంగా కనిపిస్తోంది.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌వంటి ప్రాంతాల్లోని ఐటీ ఆఫీసుల్లో డిసెంబర్ మొదలవుతూనే లీవ్ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా కంపెనీల్లో ఈ సమయంలో లీవ్స్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉండవు. దీనికి ప్రధాన కారణం.. క్రిస్మస్ పండుగ. నగరంలో పనిచేస్తున్న అనేక విదేశీ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు క్రిస్మస్‌ను (Christmas) ప్రధాన పండుగగా భావిస్తాయి. అందువల్ల ఈనెల చివరి రెండు వారాలు ఆఫీసుల్లో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
ట్రావెల్ ట్రిప్స్.. డేట్స్ ఫిక్స్
ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐటీ ఉద్యోగులు లాంగ్ లీవ్స్ (Long Leaves) ప్లానింగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొందరు వారం నుంచి పది రోజులు లీవ్స్ కలిసొచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుని, దేశవ్యాప్తంగా ట్రావెల్ ట్రిప్స్‌కు బయలుదేరుతున్నారు. గోవా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్స్‌కు నగరం నుంచి భారీగా బుకింగ్స్ పెరిగాయి. ఫ్లైట్స్, ట్రైన్స్, హోటల్స్ ఫుల్ అవుతున్నాయి.
ఇంకొందరు ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి స్వగ్రామాలకు వెళ్లి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏడాదంతా నగర జీవనశైలిలో బిజీగా ఉండే వారికి, ఈ లాంగ్ లీవ్స్ కుటుంబంతో గడిపే అమూల్యమైన సమయంగా మారుతోంది. మరోవైపు యువత మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్, బీచ్ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు (New Year Celebrations) ప్రాధాన్యత ఇస్తున్నారు.
సిటీ లైఫ్ ఆస్వాదించొచ్చు..
లాంగ్ లీవ్ కల్చర్‌లో (Long Leave Culture) అందరూ నగరం విడిచి వెళ్లిపోతున్నారు అనుకోవడం కూడా తప్పే. భాగ్యనగరంలోనే ఉండి సెలబ్రేషన్స్ చేసుకునే బ్యాచ్ కూడా ఉంది. ఈనెలలో నగరమంతా ఈవెంట్స్‌తో కళకళలాడుతుంది. మాల్స్, పబ్బులు, క్యాఫేలు, క్లబ్బులు ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నాయి. లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, ఫుడ్ ఫెస్టివల్స్ నగర యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ వల్ల నగర లైఫ్ స్టైల్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ట్రాఫిక్ కొంతమేర తగ్గడం, ఐటీ ఏరియాల్లో ఆఫీసుల హడావుడి తగ్గిపోవడం సాధారణంగా మారింది. చాలా మంది ఉద్యోగులు ఈ నెలను వర్క్ ఫ్రీ మంత్‌గా అభివర్ణిస్తున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు డిసెంబర్ ఒక బ్రేక్‌లా ఉపయోగపడుతోందని ఉద్యోగులు భావిస్తున్నారు.
నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం..
డిసెంబర్ నెల (December Month) ఇప్పుడు కేవలం క్యాలెండర్ చివరి నెల మాత్రమే కాదు. ఐటీ ఉద్యోగుల జీవితాల్లో ఇది రిలాక్సేషన్, ట్రావెల్, సెలబ్రేషన్స్‌కు సంకేతంగా మారింది. కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు టెకీలు సిద్ధమవుతున్నారు. లాంగ్ లీవ్స్ ట్రెండ్ సిటీ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫాంలకు ఈ నెల పీక్ సీజన్‌గా మారింది.
చదవండి: ఆహా అనిపించే సినిమా లొకేషన్లు
అలాగే నగరంలోని కెఫేలు, పబ్బులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లలో ఫుట్‌ఫాల్ గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు కంపెనీలు కూడా టీమ్ అవుటింగ్స్, ఇయర్ ఎండ్ పార్టీలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో మోరల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ నెల సిటీలో కేవలం సెలవుల సీజన్ మాత్రమే కాదు, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రతీకగా మారుతోంది.


