చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం! | Rajasthan, Goa and Darjeeling tourist places in Movies | Sakshi
Sakshi News home page

సినిమా లొకేష‌న్లు.. చూశారా మీరు!

Dec 22 2025 7:45 PM | Updated on Dec 22 2025 8:07 PM

Rajasthan, Goa and Darjeeling tourist places in Movies

సినిమాలలో కొన్ని లొకేషన్స్‌ చూసి... ‘ఆహా’ అనిపిస్తుంది. ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు... ‘ఫలానా సినిమాలో ఈ సీన్‌ చూశాం కదా!’ అని గుర్తు తెచ్చుకుంటాం. ప్రయాణాలకు, చిత్రాలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రయాణ.. చిత్రం, చిత్ర.. ప్రయాణం ఎంత అద్భుతం!

తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో ఒకటి. ఈ అద్భుత ప్రకృతి దృశ్యం బాలీవుడ్‌ సినిమా ‘3 ఇడియెట్స్‌’లో కనువిందు చేస్తుంది. కాలేజీ స్నేహాలు ముగిసి కలలు కనే ప్రదేశంగా ఈ ప్రదేశం దర్శనమిస్తుంది. పాంగాంగ్‌ లేక్‌ క్లైమాక్స్‌’గా ఈ ఎపిసోడ్‌కు పేరు వచ్చింది. యశ్ చోప్రా ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ ఫర్హాన్‌ అక్తర్‌ ‘లక్ష్యా’  మణిరత్నం ‘దిల్‌ సే’లాంటి చిత్రాలలో లద్దాఖ్‌  కనిపిస్తుంది. ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ సినిమాలో మిల్కాసింగ్‌ ట్రైనింగ్‌ దృశ్యాలను లద్దాఖ్‌లో చిత్రీకరించారు. ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాను మూన్‌ల్యాండ్‌ ఏరియాలో చిత్రీకరించారు. ‘సనమ్‌ రే’ ‘రేస్‌ 3’ ‘హైదర్‌’ ‘తషాన్‌’ ‘ఎల్వోసీ: కార్గిల్‌’ సినిమాలలోనూ లద్దాఖ్‌ కనిపిస్తుంది. ‘రోడ్డ్‌ టు లద్దాఖ్‌’ పేరుతో ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ వచ్చింది.

సరస్సుల నగరం మెరిసింది!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి ‘సరస్సుల నగరం’ అని పేరు. ఆడంబర వివాహాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. ఉదయ్‌పూర్‌. ధర్మప్రొడక్షన్‌ ‘యే జవానీ హై దివానీ’ సినిమాలోని రాజసం ఉట్టిపడే సన్నివేశాలను ఈ అందాల నగరంలో చిత్రీకరించారు. చిత్రాలకు సంబంధించి భావోద్వేగ దృశ్యాలు పండాలంటే, పండగ సంతోషాలు వెల్లివిరియాలంటే  ‘ఉదయ్‌పూర్‌’ సరిౖయెన నగరం అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. పీచోల సరస్సులో పడవలు వయ్యారంగా పరుగెడుతున్న దృశ్యాలు, సూర్యాస్తమయం తరువాత ప్యాలెస్‌ లైట్ల వెలుగులు నీటి అలలలో తేలియాడుతున్నప్పుడు.. ఉదయపూర్‌లో కనిపించిన క్షణాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. ‘యే జవానీ హై దివానీ’ ‘దడఖ్‌’ ‘జోదా అక్బర్‌’ ‘ఏక్‌లవ్య: ది రాయల్‌ గార్డ్‌’ ‘బాజీరావు మస్తానీ’లాంటి ఎన్నో సినిమాలలో ఉదయ్‌పూర్‌ కనిపిస్తుంది.

గతంలోకి వెళితే...
గైడ్‌(1965), మేరా సాయ(1966) చిత్రాలలోని సన్నివేశాలను ఉదయ్‌పూర్‌లో చిత్రీకరించారు. సిటీ ప్యాలెస్‌ కాంప్లెక్స్, లేక్‌ పిచోలా, జగమందిర్, లేక్ ప్యాలెస్, ఫతే ఘర్, అంబ్రాయ్‌ ఘాట్‌.. మొదలైనవి సినిమాల చిత్రీకరణకు కీలకమైన లొకేషన్స్‌గా (Cinema Locations) మారాయి.

ఆత్మశోధన అద్దం
‘గోవా అనేది ఆత్మశోధనకు అద్దంలాంటిది’ అంటారు భావుకులు. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించిన ‘దిల్‌ చాహ్తా హై’లో గోవా కనువిందు చేస్తుంది. పోర్ట్‌ అగ్వాడా ఎంతోమందికి సినిమాటిక్‌ ల్యాండ్‌ మార్క్‌గా మారింది. గోవా బీచ్‌ల (Goa Beach) వెంట నడుస్తూ ఆలోచిస్తుంటే...అలలు ఎగిసి పడే శబ్దాలు వింటుంటే, నవ్వులు గాలిలో తేలుతుంటే, ఉరుకు పరుగుల జీవితం కాస్తా ఆ అలల ముందు ప్రశాంత చిత్తంతో చూస్తుంటే.. ఇలా ఎన్నో ఎన్నో  భావాలకు గోవా కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుంది. అందుకే సినీ దర్శకులకు గోవా బాగా నచ్చుతుంది. ‘డియర్‌ జిందగీ’ ‘గోల్‌మాల్‌ సిరీస్‌ (2006–2010), ‘దృశ్యం’  ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’  ‘దిల్‌వాలే’ ‘ధమ్‌ మారో ధమ్‌’ ‘గో గోవా గాన్‌’లాంటి ఎన్నో చిత్రాలను గోవాలో చిత్రీకరించారు. గోవా ప్రత్యేకత ఏమిటంటే భారీ బడ్జెట్‌ సినిమాల దర్శకులకు నచ్చుతుంది. చిన్న నిర్మాతలకు సైతం అందుబాటులో ఉంటుంది.

పొగమంచు కొండలలో...
పొగమంచు కొండలతో స్నేహం చేసే డార్జిలింగ్‌ ఎన్నో సినిమాలలో కనిపించింది. నేత్రపర్వం చేసే హిమాలయ దృశ్యాలకు, విశాలమైన టీ తోటలకు డార్జిలింగ్‌ ప్రసిద్ధి పొందింది. డార్జిలింగ్‌ను బాగా అర్థం చేసుకోవాలంటే, ఆ అందాలను ఆస్వాదించాలంటే బాలీవుడ్‌ (Bollywood) సినిమా ‘బర్ఫీ’ చూడాల్సిందే. ‘మై హూ నా’ ‘యారియాన్‌’ ‘పరిణిత’ ‘రాజు బన్‌ గయా జెంటిల్‌మెన్‌’ ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ అయ్యర్‌’లాంటి ఎన్నో చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు. వెనక్కి వెళితే... బర్సాత్‌ కి ఏక్‌ రాత్‌(1982), ప్రొఫెసర్‌(1962), జబ్ ప్యార్‌ కైసీ సే హోతా హై(1961), ఆరాధన (1969) చిత్రాల సన్నివేశాలను డార్జిలింగ్‌లో చిత్రీకరించారు.

అద్భుత కట్టడాలతో అలరించే..
శతాబ్దాల సంస్కృతుల ప్రభావంతో రూపుదిద్దుకున్న అండలూసియా ప్రాంత‌ చారిత్రక రాజధాని సెవిల్లె. సూర్యకాంతితో అద్భుతంగా వెలిగే కట్టడాలు, అద్భుతమైన మూరిష్‌ వాస్తు శిల్పానికి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది సెవిల్లె. జోయా అక్తర్‌ ‘జిందగీ నా మిలేగీ దోబారా’ ఇక్కడే చిత్రీకరించారు.

చ‌ద‌వండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?

వెనిస్‌ ఆఫ్‌ నార్త్‌
వాయువ్య బెల్జియంలోని అందమైన చారిత్రక నగరం బ్రూజెస్‌. వంకర కాలువలు, మెట్ల–గేబుల్‌ ఇళ్ళు, రకరకాల శిల్పాలు, రాతి వంతెనలకు బ్రూజెస్‌ పెట్టింది పేరు. బ్రూజెస్‌ను ‘వెనిస్‌ ఆఫ్‌ నార్త్‌’గా పిలుచుకుంటారు. అమీర్‌ఖాన్‌  ‘పీకే’లో బ్రూజెస్‌ అందాలు కనువిందుచేస్తాయి. లవర్స్‌ బ్రిడ్జి, మిన్నె వాటర్‌ కాజిల్, మార్కెట్‌ స్క్వైర్, బ్రెల్ఫీ టవర్, వంకలు తిరిగే కాలువలు కనిపిస్తాయి. ‘పీకే’లోని ‘చార్‌ కదమ్‌’ పాటను ఇక్కడే చిత్రీకరించారు.

వంద స్తంభాల నగరం
ఎత్తైన గోతిక్‌ స్తంభాలు, టెర్రకోట–ఎరుపు పైకప్పులు, చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి పొందింది చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌. ‘వంద స్తంభాల నగరం’ అని పిలవబడే ప్రాగ్‌లో మధ్యయుగాలనాటి ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. వల్తావా నది ప్రవాహాన్ని చూడడం అద్భుత అనుభవం. రాతి వీధుల్లో ఈల పాట పాడుతూ వేగంగా నడుస్తుంటే, ప్రాగ్‌ అందాలు ఇంతియాజ్‌ అలీ ‘రాక్‌స్టార్‌’ సినిమాలో కనిపిస్తాయి. సినిమాలోని రకరకాల భావోద్వేగాలకు ప్రాగ్‌ (Prague) సరిగ్గా సరిపోయింది. చార్లెస్‌ వంతెన కింద నది వయ్యరాలను చూడడం మరో అద్భుత అనుభూతి.
– పాషా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement