భారత క్రికెట్‌లో అత్యంత అన్ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్‌కు చెందిన జలజ్ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.
20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్‌ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్‌లు కొట్టి, కెరీర్‌లు మలచుకున్నారు. కానీ జలజ్ మాత్రం దేశవాలీ క్రికెట్‌లో పరిమితమయ్యాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో జలజ్ సూపర్‌గా సెట్ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్.. మిడిలార్డర్ బ్యాటింగ్ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్‌కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.
2005లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన జలజ్.. ఇప్పటివరకు 150 మ్యాచ్‌ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
జలజ్‌కు లిస్ట్-ఏ ఫార్మాట్‌లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్‌లో 109 మ్యాచ్‌ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్ టీ20 ఫార్మాట్‌లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో 73 మ్యాచ్‌ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.
మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్నా జలజ్ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-ఏ జట్లపై అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనలు చేశాడు.
జలజ్ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్‌లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్‌కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.
జలజ్ కెరీర్‌లో అత్యుత్తమ రికార్డులు..
రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడు
ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడు
గోవా-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్‌తో పాటు రామకృష్ణ ఘోష్ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్ స్నేహల్ కౌతాంకర్ (73) ఒక్కడే రాణించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్ గైక్వాడ్ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్ నవలే (46), జలజ్ సక్సేనా (4) క్రీజ్‌లో ఉన్నారు. లలిత్ యాదవ్ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు.


