పాక్‌ ఆటగాడి ఎంపికపై సన్‌రైజర్స్‌ కోచ్‌ వివరణ | Sunrisers Official Issues Statement After Buying Abrar Ahmed In The Hundred Auction | Sakshi
Sakshi News home page

పాక్‌ ఆటగాడి ఎంపికపై సన్‌రైజర్స్‌ కోచ్‌ వివరణ

Mar 13 2026 1:19 PM | Updated on Mar 13 2026 1:28 PM

Sunrisers Official Issues Statement After Buying Abrar Ahmed In The Hundred Auction

హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. 

పాక్‌ ఆటగాడిని ఎలా తీసుకుంటారని భారత క్రికెట్‌ అభిమానులు సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ పతాక స్థాయికి చేరడంతో ఎక్స్‌ ఏకంగా లీడ్స్‌ ఖాతానే సస్పెండ్‌ చేసింది. ఈ వివాదంపై లీడ్స్‌ యాజమాన్యం తొలిసారి స్పందించింది. ఆ ఫ్రాంచైజీ తరఫున హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెటోరీ వివరణ ఇచ్చాడు.

బీబీసీ స్పోర్ట్స్‌తో ఆయన మాట్లాడుతూ.. అబ్రార్ ఓ‌ ప్రత్యేకమైన బౌలర్‌. అతడి వద్ద ఉన్న వేరియేషన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌‌ దేశీయ ఆటగాళ్లు అబ్రార్‌ను ఇంతవరకు ఎక్కువగా ఎదుర్కోలేదు. వేలంలో అందుబాటులో ఉన్న స్పిన్నర్లలో అబ్రార్‌ మాకు ఉపయోగపడతాడని అనుకున్నాం. అందుకే అతనికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నాడు.

అబ్రార్‌ ఎంపికపై వెటోరి వివరణ ఇచ్చినప్పటికీ.. అది సమర్దనగా ఉందని భారత క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హెండ్రెడ్‌ లీగ్‌ వేలంలో భారత యాజమాన్యాల్లోని ఫ్రాంచైజీల్లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ మాత్రమే పాకిస్తాన్‌ ఆటగాడిని ఎంపిక చేసుకుంది. సన్‌రైజర్స్‌కు ఇతర లీగ్‌ల్లో (ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌) కూడా ఫ్రాంచైజీలు ఉన్నా.. ఎక్కడా పాకిస్తాన్‌ ఆటగాళ్లను తీసుకోలేదు. 

పహల్గాం ఉదంతం తర్వాత భారత్‌-పాక్‌ మధ్య అన్ని రకాల సంబంధాలు పూర్తిగా క్షీణించిపోవడంతో పాక్‌ ఆటగాళ్లను భారతీయులు ఎక్కడా ఉపేక్షించడం లేదు. ఇప్పుడు ఏకంగా ఓ పాక్‌ ఆటగాడిని భారత యాజమాన్యంలో నడిచే ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకోవడం పెద్ద వివాదంగా మారింది. 

అబ్రార్‌ ఎంపికలో మరో ఫ్రాంచైజీ (ట్రెంట్‌ రాకెట్స్‌) పోటీపడుతున్నా, సన్‌రైజర్స్‌ తగ్గకుండా అతన్ని దక్కించుకోవడం​ భారత క్రికెట్‌ అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ ప్రభావం ఐపీఎల్‌ జట్టైన ఎస్‌ఆర్‌హెచ్‌పై కూడా పడింది. ఎస్‌ఆర్‌హెచ్‌ను కూడా బ్యాన్‌ చేయాలంటూ భారత అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

ఈ వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement