స‌న్‌రైజ‌ర్స్‌లోకి పాక్ ఆట‌గాడు.. బీసీసీఐ స్పంద‌న ఇదే | BCCIs 1st Reaction To SRH-Owned Team Buying Pakistan Star Abrar Ahmed In The Hundred Auction | Sakshi
Sakshi News home page

స‌న్‌రైజ‌ర్స్‌లోకి పాక్ ఆట‌గాడు.. బీసీసీఐ స్పంద‌న ఇదే

Mar 13 2026 3:05 PM | Updated on Mar 13 2026 3:36 PM

BCCIs 1st Reaction To SRH-Owned Team Buying Pakistan Star Abrar Ahmed In The Hundred Auction

'ది హండ్రెడ్' లీగ్‌-2026 వేలంలో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కొనుగోలు చేయడం పెను వివాదానికి దారితీసింది. గురువారం లండ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ వేలంలో అబ్రార్‌ను సన్‌రైజర్స్‌ లీడ్స్‌(స‌న్ గ్రూప్‌) యాజ‌మాన్యం ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ. 2.34 కోట్లు) సొంతం చేసుకుంది.

వేలంలో మరో పాకిస్తానీ ఉస్మాన్‌ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్‌ ఫోనిక్స్‌ టీమ్‌ తీసుకుంది. అయితే ఫోనిక్స్‌ యాజమాన్యానికి భారత్‌లో ఎలాంటి సంబంధం లేదు. కానీ భార‌త్‌కు చెందిన సన్‌గ్రూప్ యాజ‌మాన్యం  ఒక పాక్‌ ఆటగాడిని ఎంచుకోవాల్సిన అవసరం ఏముందని అన్ని వైపులనుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌ వేలంలో ఎంచుకున్న తర్వాత కూడా వివాదం ముదరడంతో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తప్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పైగా ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో, అంతకు ముందు కూడా ‘టీ’ తాగుతున్న ఫోటోలతో పలు సందర్భాల్లో భారత్‌పై అబ్రార్‌ తన విద్వేషాన్ని ప్రదర్శించాడు.

అలాంటి క్రికెటర్‌ను ఎంచుకున్న సన్‌రైజర్స్‌...అతడిని కొనసాగిస్తుందా లేదా అనేది ఆసక్తికరం. అయితే ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ వ్యవహారంలో బోర్డు జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "ఇది మాకు సంబంధించిన విష‌యం కాదు. అదొక విదేశీ లీగ్‌. తుది నిర్ణయం ఆ ఫ్రాంచైజీయే తీసుకోవాలి. మేము జోక్యం చేసుకోలేము" అని రాజీవ్ శుక్లా ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు.

కాగా గతేడాది సీజన్ అనంతరం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీని సన్ గ్రూపు కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్యా మారన్ దాదాపు 100 మిలియన్ పౌండ్ల (సుమారు ₹1,100 కోట్లు) భారీ మొత్తాన్ని వెచ్చించి పూర్తి టేకోవర్ చేసుకుంది. నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టు పేరును సన్‌రైజర్స్‌ లీడ్స్‌గా మార్చారు.
చదవండి: T20 WC: రాస్కెల్స్‌.. నిప్పుతో చెలగాటం: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ప్రశంసలు
 

Advertisement
 
Advertisement
Advertisement