ఢిల్లీ: పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, మంచి కెరీర్ నిర్మించుకోవాలని విద్యార్థులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు భరించలేని ఒత్తిడితో ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించే పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఓ విద్యార్థి మాత్రం అలా చేయలేదు. ఒత్తిడిని దూరం పెట్టి, ఎంజాయ్ చేయాలని గోవాకు వెళ్లిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నా.. గోవాకు వెళ్లే ముందు ఆ విద్యార్థి చేసిన పనికి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.
ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలుడు పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే తన అక్క యూపీఎస్సీ ఫీజు కోసం ఇంట్లో దాచి పెట్టిన రూ.3లక్షల్ని దొంగిలించాడు. అనంతరం, ఎంజాయ్ చేసేందుకు గోవా వెళ్లాడు.
అయితే, కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులు సైబర్ ట్రాకింగ్ ద్వారా బాలుడిని గుర్తించారు. గోవాలో ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక గోవా పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు. గోవా వెళ్లేందుకు తన అక్క కోసం దాచిన మూడు లక్షల్ని దొంగించినట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు.


