సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
పణాజి: మానవత్వం ప్రతిబింబించని చట్టంతో అరాచకమే ప్రబలుతుందని, అదే సమయంలో చట్టంలేని మానవత్వం నిరంకుశానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. ‘చట్టం ఒక సజీవ వ్యవస్థ. అది నిలకడకు, మార్పునకు సమతుల్యతను పాటించాలి. చట్టం మార్పును అడ్డుకోరాదు. అదే సమయంలో, సరైన ఆలోచన లేకుండా కేవలం కొత్తదనం కోసం దేనినీ గుడ్డిగా స్వీకరించకూడదు. లేదంటే నైతిక స్థానాన్ని కోల్పోతుంది’అని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్పును ఆకళింపు చేసుకోలేని చట్టం శుద్ధంగా ఉండజాలదన్నారు. ఆదివారం ఆయన గోవాలో ఇంటర్నేషనల్ లీగల్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంతోపాటు గోవా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డ్రగ్స్ వ్యసనంపై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి చట్ట వ్యవస్థ కూడా శతాబ్దాల తరబడి జరిగిన పోరాటాలు, చర్చలు, రాజీలు, నైతిక ధైర్యం నుంచి అందిన ఒక వారసత్వంగా ఆయన అభివరి్ణంచారు.
వారసత్వంగా అందుతూ, అనేక పరీక్షలకు తట్టుకుని నిలబడిన న్యాయ వ్యవస్థకు తాము యజమానులం కాదు, కేవలం తాత్కాలిక సంరక్షకులం మాత్రమే అనే విషయం తన మదిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుందన్నారు. ‘మాదక ద్రవ్యాల వాడకం కేవలం నేరం మాత్రమే కాదు, అది ఒక సామాజిక, మానసిక, వైద్యపరమైన సమస్యగా గుర్తించాలి. అవగాహన ద్వారానే ఇది పరిష్కారం కావాలే తప్ప, శిక్షలు హెచ్చరికల ద్వారా కాదు’అని సీజేఐ అన్నారు. ‘డ్రగ్స్ వ్యసనం నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి, తరగతి గదుల్లోకి, సమాజంలోకి ప్రవేశించి, భవిష్యత్తును నాశనం చేస్తుంది. ఇది కేవలం వ్యక్తులనే కాదు, సమాజాన్నే పాడు చేస్తుంది’అని ఆయన హెచ్చరించారు.


