సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది.
అల్లూరి జిల్లాలో అత్యధికం..
విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరీ్టజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్‌ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు.


