‘ఎవర్ని చూసుకునిరా ఆ పొగరు.. అని అడుగుతుంటారు. కానీ నన్ను చూసుకునే నాకు ఆ పొగరు’’ అన్నారు ఇటీవల సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖండ తాండవం బాక్సాఫీస్ వద్ద తానాశించినట్టుగా తాండవమాడకపోవడం అనే నిజం నుంచి ఆయన ఏం గ్రహిస్తున్నారో తెలీదు కానీ... ఆయన గుర్తించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి అంటున్నారు
సినీ పండితులు. వాళ్లు చెబుతున్న ప్రకారం...బాలకృష్ణ ఏమీ స్వయంకృషితోనో, ఏ వారసత్వం లేకుండానో ఎదిగిన నటుడు కాదు. ఇప్పటికీ ఆయన ప్రతీ చోటా స్మరించే తండ్రి పేరు... ఎవరి పుణ్యాన తాను హీరోగా నిలబడగలిగాడో చెప్పకనే చెబుతుంది. మరి బాలకృష్ణకు ఎందుకు ఉండాలి పొగరు? తన సమకాలీకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్...వీళ్లెవరికీ లేని ప్రత్యేకత ఆయనలో ఏముందని తనను తాను చూసుకోవాలి? తల పొగరు ఉండాలి? తండ్రి వారసత్వంతో పాటు తెలుగు నాట ఉన్న కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం, అలాగే తమ కులమే అన్ని రంగాల్లో ముందుండాలనే కులోన్మాదం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశాల్లో ఒకటి.
అవే ఆయన తన నటనా ప్రతిభకు మించిన స్థాయిని ఆయనకు కట్టబెట్టాయనేది బహిరంగ రహస్యం. ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నోరు జారినా ఎంతమందిని తూలనాడినా ఆయనపై అదే స్థాయిలో ఎవరూ తిరగబడకపోవడానికి ఆయన నటనా ప్రతిభో లేక తిరుగులేని స్టార్‌డమ్మో కారణం కాదనీ ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గ బలమేననేది తలపండిన ఆ విళ్లేషకుల మాట.
దాదాపుగా కొన్ని దశాబ్ధాల పాటు అటు నటనలో గానీ, ఇటు అభిమానధనంలో గానీ చిరంజీవి మెగా స్థాయి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన బాలకృష్ణ... ఇటీవల తన వయసు 60 దాటాక కొన్ని చెప్పుకోదగ్గ విజయాలు దక్కించుకోగలిగారు. దానికి ఆయన సంతోషించవచ్చు... ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. అంతే గానీ ఈ స్వల్పకాలపు విజయాలకే తనకెవరూ సాటిలేరన్నట్టు మిడిసిపాటు తగదు. అది ఇతరుల కన్నా ఆయనకే ఎక్కువ చేటు చేస్తుందని ఆయన గ్రహించాలి. తనను తాను గొప్పగా చెప్పుకుని చెప్పుకునే స్వోత్కర్షల్లో ప్రమాదం ఏమిటంటే.. నిజంగానే తాను గొప్ప అనే భ్రమల్లోకి వెళ్లిపోవడం అదే ఆయన అఖండ తాండవానికి చావు దెబ్బ కొట్టింది.
సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాప్ హీరోలు అందరూ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అదే సమయంలో విడుదలైన అఖండ(Akhanda 2) సినిమా గురించి బాలకృష్ణ మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం... ‘‘నా సినిమాలకు రేట్లు పెంచనవరం లేదు. పెంచకపోయినా నష్టం రాదు’’ అంటూ చెప్పారాయన. అయితే అదే బాలకృష్ణ రెండవ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి తనను తాను బాక్సాఫీస్ కింగ్ లాగో, పాన్ ఇండియా హీరోగానో భ్రమించారనీ. అవసరానికి తన స్థాయికి మించి నిర్మాతల చేత భారీ పెట్టుబడులు పెట్టించారనేది సినీ పండితుల వ్యాఖ్య.
దాంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే జనం ఎగబడి చూస్తారని అనవసర అపోహలు ఏర్పరచుకున్నారంటున్నారు. అయితే సీనియర్ తెలుగు హీరోల్లో అంతో ఇంతో నాగార్జునని తప్ప మరెవరినీ ఉత్తరాది ప్రేక్షకులు పట్టించుకోరు అనే నిజం బాలకృష్ణకి తప్ప అందరికీ తెలుసు. ఆ నిజం ఆయనకు కనపడనీయకుండా తల పొగరు కళ్లు మూసేసింది. ఆ ఫలితమే ఉత్తరాదిలో అఖండ తాండవం తాలూకు ఘోర పరాజయం. ఇకనైనా బాలకృష్ణ తన భజనపరుల, కులోన్మాదులను కాక వాస్తవ డిమాండ్‌ను స్థాయిని గుర్తించి మసలుకుంటే... గతంలో నిర్మాతలకు అందుబాటులో హీరోగా ఆయనకు ఉన్న ఇమేజ్ అయినా కాపడుకుంటారని సినీ మార్కెట్ నిపుణులు అంటున్నారు..


