మా సినిమా హాయిగా ఉంటుంది  | Producer Chinta Gopala Krishna Reddy Speech at Sri Chidambaram Garu Release Date Announcement | Sakshi
Sakshi News home page

మా సినిమా హాయిగా ఉంటుంది 

Feb 5 2026 1:48 AM | Updated on Feb 5 2026 1:48 AM

Producer Chinta Gopala Krishna Reddy Speech at Sri Chidambaram Garu Release Date Announcement

– చింతా గోపాలకృష్ణా రెడ్డి 

శ్రీ చిదంబరంగారు’ని క్రౌడ్‌ ఫండెడ్‌ మూవీగా ఈ టీమ్‌ ఆరంభించింది. నాలుగేళ్లుగా వీళ్లు పడుతున్న కష్టం చూసి మా అమ్మాయి వినీషా రెడ్డి... ఈ సినిమా మనం చేద్దామని చెప్పింది. ఈ కథ వినగానే మాకూ బాగా నచ్చింది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘శ్రీ చిదంబరంగారు’ చిత్రాన్ని నిర్మించాం’’ అని నిర్మాత చింతా గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు.

 వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్‌ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఫీల్‌ గుడ్‌ కథతో తీసిన ఈ మూవీలో ఫైట్స్, యాక్షన్‌ గోల ఉండదు. ప్రేక్షకులు రెండు గంటల పాటు హాయిగా సేద తీరేలా మా సినిమా ఉంటుంది. వంశీ, సంధ్య పాత్రలు చాలా బాగుంటాయి. వినయ్‌ రత్నం చక్కగా తెరకెక్కించాడు.

 మా సినిమా ‘పెళ్లి చూపులు, కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రాలకంటే ఇంకా బాగుంటుందని చెప్పగలను. చందు రవి సంగీతం, కీరవాణిగారు పాట పాడటం మాకు ప్లస్‌. మా మూవీని వంశీ నందిపాటి పంపిణీ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ వారం మా సినిమాతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలూ ప్రేక్షకాదరణ పొందాలి. మా సినిమా టిక్కెట్‌ ధర కేవలం 99 రూపాయలుగా నిర్ణయించాం. భవిష్యత్‌లో కె. విశ్వనాథ్‌గారి తీసిన తరహా సినిమాలు తీయాలని ఉంది. మా సంస్థలో ప్రస్తుతం ‘రావు బహదూర్‌’ అనే సినిమాతో పాటు కొత్త దర్శకుడితో మరో మూవీ చేస్తున్నాం. అదే విధంగా 2027లో ‘క’ మూవీ సీక్వెల్‌ను రిలీజ్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement