– నరేశ్ అగస్త్య
‘‘మా డైరెక్టర్ మురళీ మనోహర్ చెప్పిన ‘గుర్రం పాపిరెడ్డి’ కథ బాగా నచ్చింది. నేను గతంలో నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్‌గా ఉంటాయి. అయితే ‘గుర్రం పాపిరెడ్డి’లో నా పాత్ర కొంచెం ఎనర్జిటిక్‌గా నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి మూవీ చేయలేదు. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నరేశ్ అగస్త్య తెలిపారు. ఆయన హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’.
బ్రహ్మానందం, యోగిబాబు ఇతర పాత్రలు పోషించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నరేశ్ అగస్త్య విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎదుటివాళ్లకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ.
‘గుర్రం పాపిరెడ్డి’ లోని పాత్రలు ఇబ్బంది పడుతుంటే ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సన్నివేశాలు వినోదంతో వెళుతున్నా బలమైన కథ ఉంటుంది. ఇంటర్వెల్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఈ చిత్రంలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు నాకు తెలిసిన వాళ్లలో కొందరు తెలివిలేని వాళ్లను సెలెక్ట్ చేసుకుంటాను. తెలివైనవాడు తెలివితక్కువ పని చేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పని చేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి? అనేది కథ.
నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఫ్రీ డైవింగ్ చేస్తుంటా. అంటే ఒక్కసారి ఊపిరి పీల్చి సముద్రంలో ఎంత లోతు వెళ్లగలమో అంత లోతు వెళ్లాలి. ఇప్పటివరకు సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్‌లో 80 అడుగుల లోతుకు వెళ్లాను. ఇక నేను హీరోగా నటిస్తున్న ఓ తెలుగు సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. తమిళంలో హీరోగా ఓ చిత్రం ఒప్పుకున్నాను’’ అని చె΄్పారు.


