breaking news
Naresh Agastya
-
ట్రిమ్ చేసిన వెర్షన్‌కూ స్పందన బాగుంది
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ– ‘‘నిన్న (శుక్రవారం) మ్యాట్నీ షోస్ నుంచే 90 శాతం థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ ట్రిమ్ చేశాం. ఆ ట్రిమ్ అయిన వెర్షన్‌కూ రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతూ నవ్వుకుంటున్నారు. చిన్న సినిమాకు నిర్మాణ విలువలు బాగుంటే, ఎంత మంచి క్వాలిటీతో సినిమా స్క్రీన్ మీదకు వస్తుందనే విషయానికి ‘గుర్రం ΄ాపిరెడ్డి’ ఓ ఉదాహరణ’’ అని చెప్పారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం వల్ల మా సినిమా మార్నింగ్ షోస్ కాస్త స్లోగా మొదలయ్యాయి. సాయంత్రానికి 90శాతం ఆక్యుపెన్సీతో మా సినిమా ప్రదర్శితం కావడం హ్యాపీ’’ అని చెప్పారు మురళీ మనోహర్. ‘‘థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రేక్షకులు ఇంకొంత సపోర్ట్ చేసి, మా సినిమాను హిట్ చేయాలి’’ అని కోరారు వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, యాక్టర్స్ జీవన్ కుమార్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోసిగి, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడారు. -
డార్క్ కామెడీ థ్రిల్లర్.. గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గుర్రం పాపిరెడ్డిదర్శకత్వం: మురళీ మనోహర్నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులువిడుదల తేదీ: డిసెంబర్ 19, 2025హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్‌పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.ఎలా ఉందంటే..డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్‌కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్‌తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు.సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్‌కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్‌పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్‌లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.సింపుల్ కథను స్వాతంత్రానికి పూర్వం ఉన్న సంస్థానాలతో ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్‌నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.ఎవరెలా చేశారంటే.లీడ్ రోల్లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీధర్‌గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్: 2.75/5 -
ఇంటర్వెల్ చూసి షాక్ అవుతారు
‘‘మా డైరెక్టర్ మురళీ మనోహర్ చెప్పిన ‘గుర్రం పాపిరెడ్డి’ కథ బాగా నచ్చింది. నేను గతంలో నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్‌గా ఉంటాయి. అయితే ‘గుర్రం పాపిరెడ్డి’లో నా పాత్ర కొంచెం ఎనర్జిటిక్‌గా నేనే లీడ్ తీసుకునేలా ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి మూవీ చేయలేదు. మా సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నరేశ్ అగస్త్య తెలిపారు. ఆయన హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగిబాబు ఇతర పాత్రలు పోషించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నరేశ్ అగస్త్య విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎదుటివాళ్లకు నవ్వొస్తుంది. అదే డార్క్ కామెడీ. ‘గుర్రం పాపిరెడ్డి’ లోని పాత్రలు ఇబ్బంది పడుతుంటే ప్రేక్షకులు నవ్వుకునేలా ఉంటాయి. సన్నివేశాలు వినోదంతో వెళుతున్నా బలమైన కథ ఉంటుంది. ఇంటర్వెల్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఈ చిత్రంలో నేనొక పని కోసం వస్తాను. ఆ పని చేసేందుకు నాకు తెలిసిన వాళ్లలో కొందరు తెలివిలేని వాళ్లను సెలెక్ట్ చేసుకుంటాను. తెలివైనవాడు తెలివితక్కువ పని చేస్తే, తెలివి లేని వాళ్లు తెలివైన పని చేస్తే వాళ్ల జీవితాల్లో వచ్చిన పరిణామాలు ఏంటి? అనేది కథ. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఫ్రీ డైవింగ్ చేస్తుంటా. అంటే ఒక్కసారి ఊపిరి పీల్చి సముద్రంలో ఎంత లోతు వెళ్లగలమో అంత లోతు వెళ్లాలి. ఇప్పటివరకు సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్లో 80 అడుగుల లోతుకు వెళ్లాను. ఇక నేను హీరోగా నటిస్తున్న ఓ తెలుగు సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. తమిళంలో హీరోగా ఓ చిత్రం ఒప్పుకున్నాను’’ అని చె΄్పారు. -
శవాలను దొంగతనం చేసే ముఠా.. ఆసక్తిగా ట్రైలర్
గుర్రం పాపిరెడ్డి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. డార్క్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన మురళీ మనోహర్ ఈ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తెలివి తక్కువవాళ్ల మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథ. తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినా, తెలివి తక్కువవాడు తెలివైన పని చేసినా... వారి జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయి? అన్నది ప్రధానాంశంగా ఈ మూవీ ఉండనుంది. బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ నటించారు. యోగిబాబు వంటి ఇతర భాషల తారలు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. -
ఫరియా అబ్దుల్లా డార్క్ కామెడీ థ్రిల్లర్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'గుర్రం పాపిరెడ్డి'. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ మూవీని డార్క్ కామెడీ కథగా దర్శకుడు మురళీ మనోహర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఏదోటి చేయ్ గుర్రం పాపిరెడ్డి అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా.. లక్ష్మి మేఘన, ఎంసీ చేతన్ పాడారు. కృష్ణ సౌరభ్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమకాు కృష్ణ సౌరభ్ సంగీతమందిస్తున్నారు. -
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ 'మరొక్కసారి' ఫస్ట్ లుక్
నరేష్ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ 'మరొక్కసారి'. బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మాత. నితిన్ లింగుట్ల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.'మరొక్కసారి' మూవీకి భరత్ మాంచిరాజు సంగీతాన్ని అందించారు. అందమైన ప్రేమకథా చిత్రానికి విజువల్స్ మరింత అందాన్ని తీసుకురాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. 5,430 మీటర్ల ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ నదిలో షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి భారతీయ సినిమాగా 'మరొక్కసారి' నిలిచింది. -
కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి: బ్రహ్మానందం
‘‘కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి.. అప్పుడే ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. అలాగే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను. ఎందుకంటే.. యువతరమంతా కలిసి తీసిన ఈ చిత్రంలో నేను జడ్జి పాత్రలో నటించాను’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.డా.సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ–‘‘డార్క్ కామెడీగా రూ పొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాని సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాం’’ అని జయకాంత్, అమర్ బురా, డా.సంధ్య గోలీ కోరారు.యోగిబాబు మాట్లాడుతూ– ‘‘గుర్రం పాపిరెడ్డి’ ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో సౌధామిని పాత్రలో నటించాను. మా అమ్మ ఈ చిత్రంలో అతిథి పాత్ర చేశారు’’ అని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘బ్రహ్మానందంగారు, యోగి బాబుగారు వంటి స్టార్స్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని నరేష్ అగస్త్య చెప్పారు. -
'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ట్రైలర్ రిలీజ్
నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ జోడీగా నటించిన చిత్రం 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ'. విపిన్ దర్శకత్వం వహించగా ఉమాదేవి కోట నిర్మించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మంచి విజువల్స్‌తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఆస్ట్రేలియా ప్రజల్ని హడలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్)నరేష్ అగస్త ఇదివరకే కొన్ని తెలుగు సినిమాల్లో హీరో, సహాయ నటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మేఘాలు చెప్పిన ప్రేమకథ'లోనూ ఓ కథానాయకుడిగా చేశాడు. రీసెంట్ టైంలో ప్రేమకథలు కాస్త తక్కువగానే వస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి?(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
‘వికటకవి’కోసం ‘మాభూమి’ సినిమా చూశాను: జోశ్యుల గాయత్రి దేవి
వికటకవి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. అది కూడా పీరియాడిక్ కథాంశం కావటంతో, చాలా రీసెర్చ్ చేశాను. 1940 సమయంలో హైదరాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్న సమయంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడమన్నారు. ఆ సినిమా ద్వారా నాటి హైదరాబాద్ ఎలా ఉండింది.. అప్పటి ప్రజల వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలిసింది. దానికి తగ్గట్టు టీమ్‌ను ప్రిపేర్ చేశాను. కథకు తగ్గట్లు ప్యాంట్, షర్ట్ ఎలా ఉండాలనే దానిపై వీడియోలను డౌన్ లోడ్ చేశాను. లుక్ టెస్టులను చేశాం. టెక్నీషియన్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది’ అన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. నవంబర్ 28 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జోశ్యుల గాయత్రి దేవి మీడియాతో ముచ్చటిస్తూ.. ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ అనుభవాలను పంచుకున్నారు. → రెగ్యులర్‌గా ఇతర డిజైనర్స్ వచ్చి నా దగ్గర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొదలైన ఈ ప్రయాణంతో నేను కూడా మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. పలాస మూవీకి నేను డిజైనింగ్ మాత్రమే చేసిచ్చాను... షూట్‌కి వెళ్లలేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడమైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా నా కెరీర్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. తర్వాత పారాహుషార్ అనే మరో సినిమాకు వర్క్ చేశాను. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత కరుణకుమార్గారు రూపొందించిన కళాపురం సినిమాకు వర్క్‌చేశాను. తర్వాత ప్రదీప్ మద్దాలిగారు డైరెక్ట్ చేసిన సర్వం శక్తిమయం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్క్‌చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్‌డోర్ ప్రాజెక్ట్‌ని తక్కవు బడ్జెట్..తక్కువ మ్యాన్ పవర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.→ సర్వం శక్తి మయం సిరీస్‌కు పని చేయటం నాకు వికటకవి సిరీస్‌కు వర్క్ చేయటానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి సర్వం శక్తిమయం సిరీస్ తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ సంస్థ నిర్మించిన సిరీస్ హరికథకు వర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ దశకం కథ,కథనంతో రూపొందింది. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు వికటకవి సిరీస్‌కు వర్క్ చేసే అవకాశం ఒకేసారి వచ్చింది. పీరియాడిక్ సిరీస్‌ల్లో హరికథ ముందుగా స్టార్ట్ అయ్యింది.→ ఒక సిరీస్ షూట్ ఉన్నప్పుడు మరో సిరీస్ షూట్ లేకుండా ఉండటం కూడా కాస్త కలిసొచ్చింది. అలాగే హరికథ చేసిన వర్క్ వికటకవి విషయంలో హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వర్క్ చేయటం అనేది రెగ్యులర్‌గా సాధ్యంకాదు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలంతే.→ సిరీస్‌లకు వర్క్ చేసే సమయంలో బడ్జెట్‌కు సంబంధించిన పరిమితులుంటాయి. తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఔట్పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విషయానికి వచ్చే సరికి బడ్జెట్ విషయంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌లకు వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్‌తో పాటు ఓటీటీలకు సంబంధించిన ఇన్పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్టరే ఫైనల్ డిసిషన్ మేకర్.→ టెక్నిషియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. నేను సినిమాలు చేసిన తర్వాత వెబ్ సిరీస్‌లకు వర్క్ చేయలేదు. సిరీస్‌లకు వర్క్ చేయటంతోనే కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామని అప్డేట్ కావటం మానుకోలేం.→ హీరో లుక్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటి లుక్‌లో కనిపిస్తూనే పొడవుగా కనిపించాలి.. ఇవన్నీ మాకు చాలెంజింగ్‌గా అనిపించాయి. అయితే వాటన్నింటినీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ కథానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా నప్పుతుందనిపించింది. అలాగని పట్టు శారీలను ఉపయోగించలేదు. కాటన్, లెనిన్, ఖాదీ చీరలనే ఉపయోగించాం.→ ప్రస్తుతం సతీష్ వేగేశ్నగారు దర్శకత్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మర్మయోగి కోసం వర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మానసచోర అనే సినిమాకు వర్క్ చేస్తున్నాను. -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
టాలీవుడ్ మిస్టరీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఓటీటీల్లో వెబ్ సిరీసులకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ లాంటి సిరీస్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఏ భాషలోనైనా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అయితే తెలుగులో స్ట్రైట్ వెబ్ సిరీస్‌లు చాలా తక్కువే వచ్చాయి. తాజాగా తెలుగులో తెరకెక్కించిన డిటెక్టివ్ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి రానుంది.(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు)నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన డిటెక్టివ్ సిరీస్ 'వికటకవి'. ఈ వెబ్ సిరీస్‌కు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఈ సిరీస్‌ను తెరకెక్కించడం మరో విశేషం. ఈ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. The suspenseful and suspicious tale of Amaragiri and the mystery that follows it. 🫣It will see you on screens from 28th November 💥#Vikkatakavi, Amaragiri and the team wish you a Happy Diwali 🪔#VikkatakaviOnZee5@nareshagastya @akash_megha @pradeepmaddali @srtmovies pic.twitter.com/0b2G7b69Lz— ZEE5 Telugu (@ZEE5Telugu) November 1, 2024 -
Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కలి'. ట్రైలర్‌తోనే కాస్త అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథ, కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)కథేంటి?శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయిని ఇతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లుని ఎదురించి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్.. కష్టాల పాలవుతాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అడిగిన ఫోన్ కొనివ్వలేదనో, లవర్ బ్రేకప్ చెప్పిందనో ప్రతి చిన్న విషయానికి చాలామంది తమ ప్రాణాల్ని చిన్న వయసులోనే తీసేసుకుంటున్నారు. అలా భార్య వదిలేసిందని, అందరూ మోసం చేశారని అనుకునే వ్యక్తి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇస్తే.. తర్వాత ఏం జరిగిందనేదే 'కలి' థీమ్.ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.దేవుడు మనం ఎన్నాళ్లు బతకాలనేది నిర్ణయిస్తాడు. కానీ మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే పాయింట్‌ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో చెప్పడం బాగుంది. నిడివి కూడు కేవలం గంటన్నరే. ఇలా ప్లస్సలు ఉన్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. సినిమా అంతా కూడా శివరామ్, కలి పాత్రల మధ్య తిరుగుతుంది. యుగాలు, చనిపోవాలనుకున్న వాడితో గేమ్ ఆడటం బాగున్నప్పటికీ పదే పదే ఒకే సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ ఎమోషన్స్ బాగానే పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్ అగస్త్య సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా ఓకే. టెక్నికల్ విషయానికొస్తే స్టోరీ మంచి ఐడియా. కమర్షియల్ అంశాలు అని కాకుండా దర్శకుడు శివ శేషు.. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్గా చెప్పాడు. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి గానీ ఉన్నంతలో బాగా తీశారు. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.- రేటింగ్: 2.75/5-చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ) -
‘కలి’లో మంచి కంటెంట్ ఉంది : వరుణ్ తేజ్
మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలాంటి మంచి కంటెంట్‌తో వస్తున్న ‘కలి’ సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ నాకు క్లోజ్ ఫ్రెండ్. డెడికేషన్ ఉన్న నటుడు. హీరోగా చేస్తూనే మంచి రోల్స్ వస్తే డీజే టిల్లు, స్కంధ లాంటి మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అలాంటి క్యారెక్టర్స్ తో ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. నా మూవీస్ లో కూడా ప్రిన్స్ నటించాడు. ప్రిన్స్ ఈ సినిమా గురించి నాకు చాలా ఎగ్జైటింగ్ గా చెప్పాడు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించాలని కోరుతున్నాను’అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్, ప్రియదర్శి, ఆకాశ్ జగన్నాథ్‌తో చిత్రబృందం పాల్గొంది. కథ కొత్తగా అనిపించింది: కె. రాఘవేంద్ర రెడ్డి‘‘కరోనా ప్యాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. మన దేశంలో కూడా ఎక్కవగానే ఉన్నాయంటున్నారు. అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసే వ్యక్తిని ఎవరైనా అడ్డుకుని, వారి ఆత్మహత్య ఆలోచనను దూరం చేస్తే బాగుంటుంది. ఈ పాయింట్‌తో ‘కలి’ కథను శివ శేషు రాసుకున్నాడు. కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించాను’’ అని అన్నారు కె. రాఘవేంద్ర రెడ్డి. ప్రిన్స్, నరేష్ అగస్త్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కలి’. శివ శేషు దర్శకత్వంలో కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కె. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘జీవితంలోని సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న శివరాజ్ జీవితంలోకి ఓ అపరిచిత వ్యక్తి రావడం వల్ల ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రకథ. దర్శకుడు శివ శేషు ప్రతిభావంతుడు. అతనికి పురాణాల మీద పట్టు ఉంది. కలి అతనికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం నేను రెండు కథలు రాస్తున్నాను’’ అని అన్నారు.


