నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ మరొక్కసారి. ఈ మూవీకి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో జరుగుతోంది. గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ఘనత సాధించింది. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.
కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తి చేశారు. ఈ మూవీని దక్షిణాది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి కీలక పాత్రల్లో నటించారు.


