
నరేష్, యోగిబాబు, బ్రహ్మానందం, ఫరియా అబ్దుల్లా
‘‘కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి.. అప్పుడే ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. అలాగే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ సినిమా నాకు ప్రత్యేకం అని చెప్పగలను. ఎందుకంటే.. యువతరమంతా కలిసి తీసిన ఈ చిత్రంలో నేను జడ్జి పాత్రలో నటించాను’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు.
డా.సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ–‘‘డార్క్ కామెడీగా రూ పొందిన చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ‘‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాని సూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాం’’ అని జయకాంత్, అమర్ బురా, డా.సంధ్య గోలీ కోరారు.
యోగిబాబు మాట్లాడుతూ– ‘‘గుర్రం పాపిరెడ్డి’ ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో తప్పకుండా తెలుగులో మాట్లాడతాను’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో సౌధామిని పాత్రలో నటించాను. మా అమ్మ ఈ చిత్రంలో అతిథి పాత్ర చేశారు’’ అని ఫరియా అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘బ్రహ్మానందంగారు, యోగి బాబుగారు వంటి స్టార్స్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని నరేష్ అగస్త్య చెప్పారు.