‘‘నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. దీంతో నా సినిమాల్లో కథ, లాజిక్‌లు ఉండవని ఆడియన్స్‌కు అనిపించవచ్చు. కానీ నా అన్ని సినిమాల్లో కథ, లాజిక్ ఉంటాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగానే ‘ఫంకీ’ ట్రైలర్‌ను కట్ చేశాం. ట్రైలర్‌లో ఎక్కువగా కామెడీ సీన్స్ కనిపిస్తాయి. కానీ ఈ చిత్రంలో మంచి లవ్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని చెప్పారు కేవీ అనుదీప్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరల సమావేశంలో కేవీ అనుదీప్ పంచుకున్న సంగతులు.
⇒ ‘ఫంకీ’ చిత్రంలో విశ్వక్ సేన్ ఓ సినిమా దర్శకుడి పాత్ర చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘ఫంకీ’లోని హీరో క్యారెక్టరైజేషన్‌కు విశ్వక్ అయితే బాగుంటుందనిపించింది. కథ నచ్చి, ఆయన ఒప్పుకున్నారు.
⇒ జాతి రత్నాలు’తోపోలిస్తే ‘ఫంకీ’ కొత్తగా ఉంటుంది. దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా, సరదాగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. కొన్ని ఊహించని సన్నివేశాలను కూడా చూస్తారు. నిర్మాతలు నాగవంశీ, ‘దిల్’ రాజులతో పాటు దర్శకులు హరీష్ శంకర్, కల్యాణ్ శంకర్ గెస్ట్ రోల్స్ చేశారు. నేను కూడా నటించాను. కానీ హీరోగా యాక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. దర్శకుడిగా నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి.
⇒ విశ్వక్ మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. హీరోకు సమానమైన పాత్రలో కయాదు యాక్ట్ చేసింది. ఈ చిత్రం విషయంలో నాగవంశీగారితో కంటే కూడా నేను చినబాబుగారితో ఎక్కువగా ట్రావెల్ చేశాను. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి, మంచి సలహాలు ఇచ్చారు.
⇒ ప్రతి సినిమా హిట్ కావాలనే ఆకాంక్షతోనే చేస్తాం. కానీ నా గత చిత్రం ‘ప్రిన్స్’కు సరైన రిజల్ట్ రాలేదు. స్క్రిప్ట్ వర్క్‌కు సరైన సమయం దొరకలేదు. ‘ఫంకీ’ స్క్రిప్ట్‌కు మంచి టైమ్ దొరికింది... మంచి కథ కుదిరింది. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉంటే ఆ సినిమా ఆడియన్స్‌కు చేరువ అవుతుంది. అలా ‘జాతి రత్నాలు’ విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. ఇక ‘జాతిరత్నాలు 2’ ఇప్పట్లో ఉండదు. కథ పరంగా సంతృప్తిగా ఫీలైనప్పుడే ‘జాతిరత్నాలు 2’ చేస్తాం.
⇒ మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థల్లో నేను సినిమాలు చేయాల్సి ఉంది. వెంకటేశ్‌గారితో ఓ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. రవితేజగారితో సినిమా కోసం చర్చలు జరిగాయి కానీ ఈ సినిమా ఉండదు. ఓ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఉంది.


