వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే | Upcoming Telugu Movies Update: Telugu actors are collaborating with Tamil directors | Sakshi
Sakshi News home page

వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే

Feb 11 2026 2:05 AM | Updated on Feb 11 2026 2:38 AM

Upcoming Telugu Movies Update: Telugu actors are collaborating with Tamil directors

తెలుగు హీరోలతో తమిళ దర్శకులు

టాలీవుడ్‌... కోలీవుడ్‌.... మాలీవుడ్‌... శాండల్‌వుడ్‌... బాలీవుడ్‌... ఇప్పుడు అన్ని వుడ్స్‌ ఒకటే. ఇప్పటివరకూ హీరోయిన్లు మాత్రమే రక రకాల భాషల్లో సినిమాలు చేసేవారు. అప్పుడప్పుడూ డైరెక్టర్లు కూడా వేరే భాషల్లో వేరే హీరోలతో సినిమాలు చేసేవారు. అయితే ఆ కాంబినేషన్‌ అరుదుగా సెట్‌ అయ్యేది. ఇప్పుడు పాన్‌  ఇండియా’ హవాతో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో... తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.... అలానే వేరే భాషల దర్శకులతో ఇంకో భాషకు చెందిన హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ ఎక్కువైంది. ఒక్క తెలుగు గురించి మాట్లాడుకుంటే... ఇక్కడి టాప్‌ స్టార్స్‌ కొందరు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ అవి సెట్స్‌ మీద ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఇక ‘వాంగ అన్నే... రెడీయా... స్టార్ట్‌ కెమెరా’ (రండి అన్నా... రెడీయా... స్టార్ట్‌ కెమెరా) అంటూ తెలుగు హీరోలను డైరెక్ట్‌ చేసే చాన్స్‌ దక్కించుకున్న తమిళ దర్శకులు, చర్చల్లో ఉన్న దర్శకుల గురించి తెలుసుకుందాం. 

యంగ్‌ డైరెక్టర్‌తో నూరవ చిత్రం 
నూరవ చిత్రం అనేది ఏ హీరోకైనా వెరీ వెరీ స్పెషల్‌. ఈ మైల్‌స్టోన్‌ మూవీ గ్రాండ్‌గా ఉండాలని, మంచి కథతో, మంచి దర్శకుడితో రూపొందించాలని అనుకుంటారు. నాగార్జున కూడా అలానే అనుకుని, పకడ్బందీగాప్లాన్‌ చేసుకున్నారు. అయితే తెలుగు దర్శకుడికి కాకుండా తన నూరవ చిత్రం దర్శకత్వ బాధ్యతను తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్‌కి ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితం నాగార్జునకు కార్తీక్‌ ఓ స్టోరీ లైన్‌ వినిపించారని, అది నచ్చి కథగా డెవలప్‌ చేయమన్నారనీ తెలిసింది. ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కార్తీక్‌కి ఇది రెండో చిత్రం.

తమిళ చిత్రం ‘నిదమ్‌ ఒరు వానమ్‌’తో దర్శకుడిగా పరిచయమై, రెండో ఫీచర్‌ ఫిల్మ్‌కే నాగార్జునలాంటి స్టార్‌ని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కింగ్‌ 100, కింగ్‌ 100 నాటౌట్, లాటరీ కింగ్‌’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం లాటరీ నేపథ్యంలో ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్‌’ టైటిల్‌ ఫిక్స్‌ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. అలాగే అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని సమాచారం.  

మల్టీస్టారర్‌ మూవీలో ఎన్టీఆర్‌? 
‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్, ‘వార్‌ 2’లో హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో నటించిన ఎన్టీఆర్‌ మరో మల్టీస్టారర్‌ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్‌తో ‘జైలర్‌’ వంటి హిట్‌ మూవీ తెరకెక్కించి, ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా రజనీతోనే ‘జైలర్‌’ 2’ తెరకెక్కిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నెక్ట్స్‌ ఓ సినిమాప్లాన్‌ చేస్తున్నారట. ఎన్టీఆర్‌ కోసం నెల్సన్‌ ఓ భారీ యాక్షన్‌ స్టోరీని తయారు చేశారని సమాచారం. ఆ స్టోరీ లైన్‌ని ఎన్టీఆర్‌కి వినిపించారనే టాక్‌ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో ‘డ్రాగన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్‌.

మరోవైపు కొత్త చిత్రాల కోసం కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలోనే నెల్సన్‌ చెప్పిన స్టోరీ లైన్‌ విని, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. అయితే మల్టీస్టారర్‌ మూవీగా రూపొందనుందని భోగట్టా. ఎన్టీఆర్‌తో పాటు మరో స్టార్‌ హీరో ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం అవుతోంది. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారట. సో... ఓ తమిళ స్టార్‌ హీరో నటించే అవకాశం ఉందని అటు చెన్నై ఫిల్మ్‌నగర్‌ అంటున్న మాట. మరి... ఎన్టీఆర్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అది సోలో హీరో సినిమానా? లేక మల్టీస్టారరా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

ఇద్దరు దర్శకులతో... 
వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్‌ సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ సెట్స్‌లో ఉండగానే... సంక్రాంతి సందర్భంగా మరో చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్‌. తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఆ మధ్య లోకేశ్‌ హైదరాబాద్‌ వచ్చి, అల్లు అర్జున్‌కి స్టోరీ లైన్‌ వినిపించారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ దర్శకుడి కాంబినేషన్‌లో ఈ హీరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆ ఊహలను నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్‌ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా ముగిసే సమయానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలోని సినిమా షూట్‌ని ఆరంభించాలనుకుంటున్నారట. యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆరంభం కానుందని తెలిసింది.  

తమిళ దర్శకుడు–తమిళ బేనర్‌... 
‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ తర్వాత రామ్‌ ఓ కొత్త దర్శకుడితో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించనున్నారట. కాగా టాలీవుడ్‌కి చెందిన ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్‌కి నచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆరంభం కానుందని తెలిసింది. మరోవైపు తెలుగులో బాగా పాపులర్‌ అయిన తమిళ నటుడు–దర్శకుడు సముద్ర ఖనితో సినిమా చేయడానికి రామ్‌ అంగీకారం తెలిపారని భోగట్టా. ఈ చిత్రాన్ని తమిళ బేనర్‌ కేవీఎన్‌ నిర్మించనుందట.

ఈ సినిమా కథ రెడీ అయిందని, రామ్‌కి సముద్ర ఖని కథ నరేట్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ నచ్చి, ఈ హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. రాఘవేంద్ర రావు బేనర్లో నూతన దర్శకుడితో సినిమా పూర్తయ్యే సమయానికి సముద్ర ఖనితో సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నారట రామ్‌. ఇక సముద్ర ఖని ఇప్పటికే తెలుగులో ‘శంభో శివ శంభో, జెండా  పై కపిరాజు, బ్రో’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఉన్నట్లా? లేనట్లా? 
‘దసరా, హిట్‌ 3’... ఇలా వరుసగా మాస్‌ యాక్షన్‌ సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మరో మాస్‌ యాక్షన్‌ మూవీ ‘ది ప్యారడైజ్‌’లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన మాస్‌ సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అనేలా భారీ యాక్షన్‌తో రూపొందుతోంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు నాని. ఇక రెండు మూడేళ్లుగా ఫలానా దర్శకుడితో నాని సినిమా చేయనున్నారంటూ వినిపించిన లిస్ట్‌లో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా ఉంది.

శివ కార్తికేయన్‌ హీరోగా శిబి దర్శకత్వంలో రూపొందిన ‘డాన్‌’ (2022) సినిమా చూసి, ఇంప్రెస్‌ అయ్యారట నాని. ఈ నేపథ్యంలోనే శిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారనే వార్త ప్రచారమైంది. నానీకి శిబి స్టోరీ లైన్‌ కూడా చెప్పారట. అయితే ఆ లైన్‌ అసంతృప్తిగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్‌ పెండింగ్‌లో పడిందని సమాచారం. మరి... నాని–శిబి చక్రవర్తి కాంబినేషన్‌లో సినిమా ఉన్నట్లా? లేనట్లా... కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే.... ఈ యువదర్శకుడికి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  

సుందర్‌ ఔట్‌ శిబి ఇన్‌ 
‘తలైవర్‌ 173’ (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో రజనీకాంత్‌ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాకి ముందు సుందర్‌. సీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ఓ నిర్మాత. కమల్‌–రజనీ–సుందర్‌ కాంబినేషన్‌లో ‘తలైవర్‌ 173’ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్లీ సూపర్‌ స్టార్‌ సినిమా శిబి చక్రవర్తికి దక్కింది. ఇలా తెలుగు–తమిళ దర్శకుల కాంబినేషన్‌లో సినిమాలంటూ కొన్ని ప్రాజెక్ట్స్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement