నటి మమితా బైజు క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. పదహారేళ్ల ప్రాయంలోనే నటిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ గత ఎనిమిదేళ్లగా మలయాళం, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందుకుంటూ సక్సెస్ రేట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. తను నటించిన మలయాళం చిత్రం ప్రేమలు మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల్లోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రెబల్ చిత్రంతో జివీ.ప్రకాష్ కుమార్‌కు జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా విజయ్ కథానాయకుడుగా నటించిన జననాయకన్ చిత్రంలోనూ మమితా బైజు కీ రోల్ చేశారు. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కారా చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా బెత్లెహేమ్ కుడుంబ అనే మలయాళం చిత్రంలోని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ తాజా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు జంటగా కాకుండా ఆయన నిర్మించనున్న చిత్రంలో మమితా బైజు నాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలామంది నటుల మాదిరిగానే ప్రదీప్ రంగనాథన్ కూడా నిర్మాతగా మారిపోతున్నారు. ఈ చిత్రానికి ఆయన అసోసియేట్ డైరెక్టర్ ను దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలుతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.


