టైటిల్: గుర్రం పాపిరెడ్డి
దర్శకత్వం: మురళీ మనోహర్
నటీనటులు: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, వంశీధర్ కోస్గి తదితరులు
విడుదల తేదీ: డిసెంబర్ 19, 2025
హాలీవుడ్ నుంచి జేమ్స్ కామెరూన్ అవతార్-3 రిలీజవ్వగా.. ఈ వారం టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలు అలరించేందుకు వచ్చేశాయి. జిన్, గుర్రం పాపిరెడ్డి లాంటి థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి లాంటి డార్క్ కామెడీ థ్రిల్లర్‌పైనే కాస్తా బజ్ నెలకొంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
గుర్రం పాపిరెడ్డి కథేంటంటే..
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంత యువకుడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). డబ్బుల కోసం బ్యాంక్ దోపిడీకి పాల్పడతాడు. అది విఫలం కావడంతో మరో ప్లాన్ వేస్తాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆమెతో కలిసి డబ్బుల కోసం విచిత్రమైన స్కెచ్ వేస్తాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ మిలటరీ (రాజ్ కుమార్ కాసిరెడ్డి), చిలిపి (వంశీధర్ కోసి) కలిసి గుర్రం పాపిరెడ్డి శ్రీశైలం అడవుల్లోని ఓ శవాన్ని దొంగతనం చేసేందుకు నలుగురు వెళ్తారు. అసలు డబ్బుల కోసం శవాన్ని కిడ్నాప్ చేయడమేంటి? ఆ శవాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడం ఎందుకు? అసలు ఆ శవాన్ని దొంగతనం చేసేందుకు వెళ్లిన వీళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో ఉడ్రాజు (యోగిబాబు)ఎందుకు ఎంటరయ్యాడు? చివరికీ వీళ్ల ప్లాన్ వర్కవుట్ అయిందా? అనేది గుర్రం పాపిరెడ్డి కథ.
ఎలా ఉందంటే..
డార్క్ కామెడీ థ్రిల్లర్ స్టోరీలు మన టాలీవుడ్‌లో కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కాన్సెప్ట్‌తో చాలా సినిమాలొచ్చాయి. కానీ కాస్తా గుర్రం పాపిరెడ్డిలో రోటీన్‌కు భిన్నంగా కథను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలో డార్క్ కామెడీ కామెడీ బాగానే వర్కవుట్ అయింది. ఆసక్తికరంగా కథను మొదలెట్టిన డైరెక్టర్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేశాడు. శవాల దొంగతనం.. వాటిని మార్చడం.. వాటి కోసం హీరో పడే ఇబ్బందులు ఫుల్ కామెడీని పండించాయి. ఇంటర్వెల్ వరకు ఫుల్ కామెడీ సీన్స్‌తోనే అలరించాడు.ఫస్ హాఫ్ కథనం మొత్తం శవాల చుట్టే తిరుగుతుంది. అలా ప్రీ ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేశాడు.
సెకండాఫ్ కథలో వేగం తగ్గుతుంది. స్క్రీన్ ప్లే కూడా మరీ స్లోగా ఉండడంతో ఆడియన్స్‌కు కొంత విసుగు తెప్పిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ నుంచి కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ మరింత ఫోకస్ చేయాల్సింది. అయితే బ్రహ్మానందం రోల్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత ఎక్కువ సేపు స్క్రీన్‌పై అలరించిన తీరు ఆకట్టుకుంది. కథలో కామెడీ పండినా.. కొన్ని సీన్స్‌లో అనవసరంగా పెట్టారేమో అనిపించేలా ఉంటాయి. సింపుల్ కథకు.. పురాణాలను లింక్ పెట్టడంతో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. కామెడీకి అవకాశమున్నా చోట ప్రేక్షకులను నవ్వించేశాడు.
సింపుల్ కథను కామెడీ, పురాణాలకు ముడిపెట్టి నడిపించిన తీరు ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. అయితే హీరో వేసే కోర్టు రూమ్ డ్రామా మొదయ్యాక కథలో సీరియస్‌నెస్ కనిపించదు. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. చివరగా రెండో భాగానికి లీడ్ ఇస్తూ కథను అలా ముగించేశాడు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే.
లీడ్ రోల్‌లో నరేశ్ అగస్త్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిరియా అబ్దుల్లా సౌదామినిగా తన పాత్రలో ఒదిగిపోయింది. మిలటరీగా రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీధర్‌గౌడ్, గొయ్యి పాత్రలో జీవన్ తమ పాత్రల పరిధిలో అలరించారు. బ్రహ్మానందం తన పాత్రతో అభిమానులను మెప్పించారు. అయితే యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్నంతలో ఆకట్టుకున్నారు. కృష్ణ సౌరభ్ సంగీతం ఫర్వాలేదనిపించింది. అర్జున్ రాజా సినిమాటోగ్రఫీ ఓకే అనేలా ఉంది. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.


