జెనీలియా వేగన్‌గా ఎందుకు మారిపోయిందో తెలుసా? | Genelia Dsouza Turned Vegan, Do you Know Reason Behind | Sakshi
Sakshi News home page

మాంసం మానేసిన జెనీలియా.. కొడుకు అలా అడగడం వల్లే..!

Feb 4 2026 6:14 PM | Updated on Feb 4 2026 6:29 PM

Genelia Dsouza Turned Vegan, Do you Know Reason Behind

జెనీలియా.. ఈ పేరు చెప్పగానే చాలామందికి హ..హ.. హాసిని అన్న డైలాగ్‌ గుర్తుకొస్తుంది. సై, హ్యాపీ, బొమ్మరిల్లు, రెడీ వంటి పలు సినిమాలతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా రాణించింది. తర్వాత హిందీ, మరాఠి సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గతేడాది జూనియర్‌ మూవీతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి తప్పకుండా టైం కేటాయిస్తుంది. భర్త రితేశ్‌, పిల్లలు రియాన్‌, రాహుల్‌తో సరదాగా గడుపుతుంది. అయితే కొడుకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్నతో జెనీలియా పూర్తి శాకాహారిగా మారిపోయిందన్న విషయం మీకు తెలుసా?

కొడుకు అమాయక ప్రశ్న
జెనీలియా (Genelia D'souza) జంతు ప్రేమికురాలు. కానీ చిన్నప్పటినుంచి పుష్టిగా మాంసం లాగించేది. ఒకరోజు ఆమె పెద్ద కొడుకు రియాన్‌ స్కూల్‌ నుంచి రాగానే తల్లిని ఓ ప్రశ్న అడిగాడు. అమ్మా.. నువ్వు మన ఫ్లాష్‌ (కుక్క)ను ప్రేమిస్తావు, కానీ కోడిని మాత్రం తింటావు. రెండింటికి మధ్య తేడా ఏముంది? రెండూ జంతువులే కదా? అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది. మాంసాహారానికి దూరంగా ఉండాలన్న ఆలోచనవైపు నడిపించింది. 

భార్యాభర్తలిద్దరూ..
అలా జెనీలియా 2017లో శాకాహారిగా మారింది. నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తోంది. అయితే మొదట్లో కోడిగుడ్లు, చీజ్‌, ఇతరత్రా డెయిరీ పదార్థాలు మాత్రం ఆహారంలో తీసుకునేది. శాఖాహారం తీసుకున్నప్పుడు తన శరీరంలో పాజిటివ్‌ మార్పులు వచ్చాయని సంతోషించింది. జెనీలియా భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కూడా ఒకప్పుడు మాంసప్రియుడే. కానీ ఒకానొక సమయంలో అది కరెక్ట్‌ కాదనిపించడంతో 2016లో నాన్‌వెజ్‌ తినడం మానేశాడు.

వేగనిజం
2020లో కరోనా తాండవిస్తున్న సమయంలో దంపతులిద్దరికీ ఇంట్లో బోలెడంత సమయం దొరికింది. అప్పుడే వీరిద్దరూ నెమ్మదిగా డెయిరీ పదార్థాలకు కూడా స్వస్తి పలికి వేగన్‌కు జై కొట్టారు. వేగన్‌ అంటే.. జంతు సంబంధిత ఆహారాలకు (మాంసంతో పాటు పాలు, గుడ్లు, నెయ్యి వంటివి) దూరంగా ఉంటూ మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంచుకోవడం. దీన్నే వేగనిజం అని కూడా అంటారు.

చదవండి: బుల్లెట్‌ సునీల్‌గా రాజశేఖర్‌.. గ్లింప్స్‌ చూశారా?

Advertisement
 
Advertisement
Advertisement