ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగర్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?
56 ఏళ్ల అనుగర్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగర్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం.
ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్‌మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.
మరో విశేషం ఏంటంటే అనుగర్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్‌మెంట్ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు.
నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగర్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగర్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.
(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?)


