మామూలు నీళ్లు ఎవరైనా తాగుతారు. ఖరీదైన నీళ్లు తాగే వాళ్లనే ‘పెద్దవాళ్లు’ అంటారు. దేశంలో లీటరు 100 నుంచి 1500 వరకూ పలికే మినరల్ వాటర్ బాటిళ్ల వ్యాపారం జోరు మీద ఉంది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ప్రీమియం వాటర్ బాటిళ్లు అమ్ముడవుతున్నాయి. దాంతో ‘వాటర్ టేస్టర్ల’ కు గిరాకీ పెరిగింది. నీటి రుచి చూసి మినరల్స్‌ను అంచనా కట్టడం వీరిని ‘వాటర్ సొమెలియర్’ అంటారు. ఈ నైపుణ్యంతో వాసికెక్కిన 32 ఏళ్ల అవంతి మెహతా (avanti mehta) చెప్తున్న నీటి సంగతులు...
‘మన దేశంలో హిమాలయాల చెంత దొరికే నీటిదొక రుచి, ఆరావళి పర్వతాల వద్ద దొరికే నీళ్లదొక రుచి, సెలయేళ్ల నుంచి, కొండ వాగుల నుంచి, రాతి నేలల నుంచి ఇలా ఒక్కోచోట నుంచి సేకరించే నీటిది ఒక్కో రుచి. అంతేకాదు స్థలాన్ని బట్టి మినరల్స్ శాతం మారుతూ ఉంటుంది. పాకేజ్డ్ వాటర్ కూ మినరల్ వాటర్‌కూ వ్యత్యాసం నీళ్లలోని ఖనిజాల శాతమే తేలుస్తుంది. మన దేశంలో 6000 సంస్థలకు పాకేజ్డ్ వాటర్ లైసెన్స్ ఉంటే కేవలం 30 సంస్థలకు మాత్రమే మినరల్ వాటర్ లైసెన్స్ ఉంది. శుద్ధి చేసిన నీరు పాకేజ్డ్ వాటర్‌లో ఉంటే రక్షిత పరిసరాలలోని నీటి వనరుల నుంచి సేకరించిన నీరు మినరల్ వాటర్ బాటిల్స్‌లో ఉంటుంది’ అంటుంది అవంతి మెహతా.
ఈమె మన దేశంలో ప్రస్తుతం ‘వాటర్ సొమెలియర్’గా (water sommelier) గుర్తింపు పొందుతోంది. వాటర్ సొమెలియర్ అంటే నీటి రుచి నిపుణురాలు. నీళ్లను తాగి ఆ నీటి స్వచ్ఛత, నాణ్యత తెలియచేస్తారు. వైన్ రుచి, టీ రుచికి టేస్టర్స్ ఉండటం తెలిసిందే. కాని నీళ్ల రుచి చూసే ‘వాటర్ సొమెలియర్’లు ఇప్పుడు ఉనికిలోకి వస్తున్నారు.
‘నేను ఫ్యాషన్ రంగంలో ఈ–కామర్స్ విభాగంలో పని చేసే దాన్ని. అయితే ‘ఆవా’ అనే మినరల్ వాటర్ బ్రాండ్ మా కుటుంబానికి ఉంది. దేశంలో బాటిల్డ్ వాటర్‌కు పెరుగుతున్న గిరాకీని గమనించాక మా సొంత బిజినెస్‌లోకి రావాలని అనుకున్నాను. దేశంలో 70 శాతం నీళ్లు కలుషితంగా ఉన్నాయని ప్రజలు భావించే స్థితి వచ్చింది. మున్సిపల్ ట్యాప్స్ నుంచి వచ్చే నీళ్లను ఎవరూ నమ్మడం లేదు. అందుకే బాటిల్డ్ వాటర్ వ్యాపారం పెరిగింది. అయితే పాకేజ్డ్ వాటర్‌నే మనదేశంలో మినరల్ వాటర్ అనుకుంటూ ఉంటారు. రెండూ వేరు వేరు. అంతెందుకు ఫిల్టర్డ్ వాటర్‌కూ, ప్యూరిఫై చేసిన వాటర్‌కూ తేడా ఉంటుంది. నేచురల్ మినరల్ వాటరంటే సహజసిద్ధంగా సేకరించిందని అర్థం. ఇవన్నీ కూడా వాటర్ సొమెలియర్ కోర్సులో మాకు నేర్పుతారు. ప్రస్తుతం ప్రపంచంలో సౌత్ కొరియాలో, ఇటలీలో వాటర్ సొమెలియర్ కోర్సులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. నేను ఇటలీలో కోర్సు చేసి సర్టిఫికెట్ పొందాను. ఈ కోర్సులో నీటి మూలాలు, నీటి సైకిల్స్, నీటి పరిరక్షణ, వాటిలోని పోషకాల గుర్తింపు ఇవన్నీ నేర్పుతారు’ అని తెలిపింది అవంతి మెహతా.
‘మన శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. అయినా చాలామంది ఏం తింటున్నామన్న దాని మీద తప్ప ఏం తాగుతున్నాం అనే దాని మీద శ్రద్ధ పెట్టరు. చైనా, అమెరికాలో పాకేజ్డ్ నీటి వ్యాపారం ఒకో దేశంలో 3000 కోట్లకు చేరిందంటే కారణం సరైన నీరు తాగాలనే చైతన్యం వల్లనే. సహజ ఖనిజాలు ఉన్న నీరు శరీరాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచుతుంది. మన దేశంలో ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మంచి నీటి బ్రాండ్లు ప్రీమియమ్ బాటిల్డ్ వాటర్‌ను అమ్ముతున్నాయి. మా ‘ఆవా’ కూడా ప్రీమియమ్ బ్రాండే. మన దేశంలో కొన్ని కొండవాగుల, ఇసుక పాయల నుంచి సేకరించే నీటికి డిమాండ్ ఉంది. మంచు ఫలకాల నుంచి సేకరించే నీటిని ‘వింటేజ్ వాటర్’ అంటారు– ఆ ఫలకాల వయసును బట్టి. కొన్ని మినరల్ వాటర్స్‌ను కొన్ని రకాల ఆహారాలకు పెయిర్ చేస్తూ రెస్టరెంట్లు ఫుడ్ బిజినెస్ చేస్తున్నాయి. వెల్‌నెస్ క్రేజ్ పెరగడం వల్ల ఖరీదైనా సరే మంచిగా ఉన్న నీళ్లు తాగాలని చూస్తున్నారు’ అందామె.
‘నీటి వ్యాపారం సాగుతున్న ఈ కాలంలో నా ప్రయత్నమంతా సహజ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియచెప్పడమే. కలుషితాలు చేరకుండా చూస్తే స్థానిక చెరువులు, కుంటల్లోని స్వచ్ఛమైన నీరు గొప్ప శక్తిదాయినిగా మారుతుంది. నీరే భవిష్యత్తులో ఏ దేశానికైనా ఐశ్వర్యం కాగలదు’ అని ముగించింది అవంతి మెహతా.
చదవండి: అవాంఛిత రోమాలు.. కారణాలు, పరిష్కారాలు


