గేమ్‌ చేంజర్స్‌ : ట్రెండ్‌ సెట్టర్‌ సీతారామన్‌..! | Game Changers: Female Game Developers You Should Know | Sakshi
Sakshi News home page

గేమ్‌ చేంజర్స్‌ : ట్రెండ్‌ సెట్టర్‌ సీతారామన్‌..!

Jan 17 2026 3:09 PM | Updated on Jan 17 2026 3:34 PM

Game Changers: Female Game Developers You Should Know

‘వీడియో గేమింగ్‌ ఇండస్ట్రీ అంటే చాలా టాలెంట్‌ ఉండాలి. మహిళల శక్తి సరిపోదు’... ఇలాంటి పురుషాధిపత్య ప్రేలాపనలు గేమింగ్‌ ఇండస్ట్రీలో మహిళల  ప్రాతినిధ్యాన్ని తగ్గించాయి. అయితే కాలం మారుతోంది.గేమ్‌ డెవలపర్స్‌గా మహిళలు సత్తా చాటుతున్నారు. గేమింగ్‌ ఇండస్ట్రీలో వివిధ విభాగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది.‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు. మా సత్తా ఇది’ అని తమ కళతో కళ్లు తెరిపిస్తున్నారు. తాజాగా... ‘గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026’ సదస్సులో దేశ నలుమూలల నుంచి ఎంతోమంది ఫిమేల్‌ గేమ్‌ డెవలపర్స్‌ పాల్గొన్నారు. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం... మహిళలే కీలకంగా మారే రేపటి గేమింగ్‌ ఇండస్ట్రీని ఆవిష్కరించింది. 

 

ఆల్‌ ఇండియా గేమ్‌ డెవలపర్స్‌ ఫోరం, కోరల్‌ రిక్రూట్, ఎం–లీగ్‌ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం... మొత్తం గేమర్స్‌లో దాదాపు సగం మంది మహిళలు ఉన్నప్పటికీ గేమింగ్‌ ఇండస్ట్రీలో వారి ్ర΄ాతినిధ్యం తక్కువగా ఉంది. నిజానికి ఇది మన దేశానికే పరిమితమైన విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. యూకేలో 2018–19కి సంబంధించి డేటా ప్రకారం వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులలోని విద్యార్థులలో 88 శాతం మగవాళ్లే ఉన్నారు!

గుర్తింపు లేకపోవడం వల్లే...
‘అత్యంత వివక్షాపూరిత విషయం ఏమిటంటే, పురుషులు మహిళలను గేమర్‌లుగా చూడకపోవడం. మీ ఎదుటి వ్యక్తి గేమర్‌ అని, గేమ్‌ల గురించి వారికి బాగా తెలుసునని మీరు నమ్మకపోతే వారిలోని ప్రతిభను గుర్తించడం మీకు కష్టమవుతుంది’ అంటుంది గేమ్‌ డెవలప్‌మెంట్‌ స్టూడియో ‘వాలా ఇంటరాక్టివ్‌’ కో–ఫౌండర్‌ మేఘా గుప్తా ఆమె గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026 జ్యూరీ సభ్యురాలు కూడా. ‘గుర్తింపు లేకపోవడం వల్ల గేమింగ్‌ కెరీర్‌ను కొనసాగించాలనే ఆలోచన, ఆసక్తిని అడ్డుకుంటుంది’ అంటోంది  గుప్తా

ఇరవై లక్షల ఉద్యోగాలు!
‘గేమ్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకోవడానికి కారణం అది నాకు అత్యంత సంతోషం కలిగించే పని. ఒక గేమ్‌ను క్రియేట్‌ చేయడానికి సంబంధించిన సంతోషం మాటలకు అందనిది. పెద్ద కంపెనీలో చేరిన తరువాత నా కలల గేమ్‌లను సృష్టిస్తాను’ అంటుంది ఔత్సాహిక గేమర్‌ కె.శ్రావణి కామేశ్వరి. ‘మీకు గేమింగ్‌ స్కిల్స్‌ లేవు అనేవారి మాటలకు నిరాశ చెందకుండా, ఉత్సాహంగా, పట్టుదలగా పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది మరో ఔత్సాహిక గేమర్‌ శ్రేయా అరోర.

గతంలో గేమింగ్‌ పరిశ్రమను జూదంలా భావించేవారు. ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఉద్యోగాల సంఖ్య, భద్రత పెరిగింది. మన దేశంలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్, రియాలిటీ రంగంలో 2035 నాటికి దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. ‘సామాజిక కట్టుబాట్లతోపాటు వివిధ కారణాల వల్ల కొన్ని ఉద్యోగాల వైపు మహిళలు దృష్టి సారించడం లేదు’ అంటుంది మేఘా గుప్తా

అడ్డుగోడలు ఉన్నాయి... అయినప్పటికీ...
ఇప్పుడు అడ్డుగోడలు బద్దలవుతున్నాయి. మన దేశంలో నాణ్యమైన గేమ్‌లను రూపొందించడానికి కొత్త కొత్త స్టూడియోలు వస్తున్నాయి. గేమింగ్‌ పరిశ్రమలో పెట్టుబడులు ఆశాజనకంగా ఉండడంతో మహిళలు ఇప్పుడు గేమింగ్‌ ఇండస్ట్రీలో చేరడం సులువు అయింది. ‘గేమ్‌ జామ్‌ జైపూర్‌’ లాంటి కార్యక్రమాలు ఔత్సాహికులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

‘గేమ్‌ జామ్‌ జైపూర్‌ విలువైన ఎన్నో అనుభవాలను అందించింది’ అంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు. భారతీయ గేమింగ్‌ పరిశ్రమలో లింగవివక్ష ఉంది’ అని గేమ్‌ జామ్‌ జైపూర్‌ 2026లోపాల్గొన్న చాలామంది మహిళలు అభిప్రాయపడ్డారు. అయితే ఆ వివక్ష వారినేమీ భయపెట్టడం లేదు. ‘చిన్నచూపు అనేది అడ్డంకి కాదు. మమ్మల్ని మేము నిరూపించుకునే ఇంధనం’ అంటున్నారు.

విశేషం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా గేమ్‌ జామ్స్‌లో పాల్గొనే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఇంకా ఏమి చేయాలి?’ అనేదానిపై గేమ్‌ జామ్‌లో నిర్మాణాత్మక చర్చ జరిగింది.‘గేమింగ్‌ ఇండస్ట్రీలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి’ అని సూచించాడు గేమింగ్‌ డెవలపర్‌ జతిన్‌ వర్మ.

స్థూలంగా ఈ కార్యక్రమం ఇచ్చిన సందేశం ఏమిటి?
మేఘా గుప్తా మాటల్లో చెప్పాలంటే... ‘గేమింగ్‌ రంగంలో ఇకపై మహిళలు ఎవరి అనుమతి కోసమో వేచి చూడనక్కర్లేదు. వారు ఒక్కో కోడ్‌లైన్‌తో తమ దారిని తామే నిర్మించుకుంటున్నారు. ఒకవేళ పరిశ్రమ వారికి చోటు కల్పించక పోతే వారు తమ సొంత మార్గాన్ని సృష్టించుకుంటారు’

ఆహా... ఏమి ప్రతిభ!
‘ఆసక్తి, ప్రతిభ ఉండాలేగానీ గేమింగ్‌ ఇండస్ట్రీకి వయసు, జెండర్‌ అడ్డు కాదు’ అని చెప్పకనే చెప్పింది అమి పలాన్‌ అనే మహిళ తాజా వైరల్‌ పోస్ట్‌. పుణే టు బెంగళూరు విమానంలో ప్రయాణిస్తున్న పన్నెండేళ్ల బాలుడితో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ పిల్లాడు గేమ్‌ డెవలపర్, వీడియో ఎడిటర్‌గా డబ్బు సంపాదిస్తున్నాడు. ‘ఆ అబ్బాయి రోబ్‌లాక్స్‌ అనే గేమ్‌ కోసం రిసోర్స్‌  ప్యాక్‌ క్రియేట్‌ చేశాడు. మరో ఆశ్చర్యం... బిట్‌కాయిన్, డాగ్‌ కాయిన్‌ల గురించి అద్భుతంగా మాట్లాడడం’ అని రాసింది అమి పలాన్‌.

ట్రెండ్‌ సెట్టర్‌..సీతారామన్‌
ప్రతిష్ఠాత్మకమైన ఉమెన్‌ ఇన్‌ గేమ్స్‌ గ్లోబల్‌ అవార్డ్స్‌(డబ్ల్యూఐజీ) అందుకున్న తొలి భారతీయ గేమ్‌ డెవలపర్‌గా నిలిచింది పూర్ణిమ సీతారామన్‌. ‘జింగా’లో లీడ్‌ గేమ్‌ డిజైనర్‌ అయిన సీతారామన్, మొబైల్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలో  ప్రొగ్రామర్‌గా తన కెరీర్‌  ప్రారంభించింది. తనకంటూ సొంత కంప్యూటర్‌ సమకూర్చుకున్నాక గేమింగ్‌పై ఆమెలో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి గేమ్‌ డెవలపింగ్‌కు సంబంధించి ప్రయోగాలు చేసేలా, గేమ్‌ ఇండస్ట్రీలో పైస్థాయికి చేరుకునేలా చేసింది. గేమ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌లో రాణించాలనుకునే యువతులకు పూర్ణిమా సీతారామన్‌ పోస్టర్‌ గర్ల్‌గా మారింది.

‘నా కెరీర్‌ నల్లేరు మీద నడకేమీ కాదు. చాలామంది అమ్మాయిలలాగే నేను తొలిరోజుల్లో ఇబ్బంది పడ్డాను. వెక్కిరింపులు, వివక్షపూరిత మాటలు ఎదుర్కొన్నాను. గేమ్‌ డిజైనింగ్, డెవలపింగ్‌ రంగంలో లింగ అసమానతకు పక్షపాతంతో పాటు, సమాచార లోపం కూడా పెద్దకారణం. ఇది తమ భవిష్యత్తుకు ఉపకరించే కెరీర్‌ మార్గం అనేది తెలియక΄పోవడం వల్ల చాలామంది మహిళలు గేమింగ్‌ ఇండస్ట్రీలోకి అడుగపెట్టడం లేదు’ అంటుంది సీతారామన్‌.

ఇదీ చదవండి: గడ్డకట్టిన సరస్సులో : గుండెలు పగిలే విషాదం వీడియో వైరల్‌

‘సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో లాగే గేమ్‌ డెవలప్‌మెంట్‌లో మహిళల ప్రాతినిధ్యం కచ్చితంగా పెరుగుతుంది’ అనేది సీతారామన్‌ ఆశవాదామే కాదు భవిష్యత్‌ వాస్తవం కూడా. ‘అది క్యాండీ క్రష్‌ అయినా, డోటా 2 అయినా, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ అయినా, మీరు గేమర్‌ కాదని ఎవరూ చెప్పడానికి వీల్లేదు. గేమింగ్‌ ఫోరమ్‌లలో చేరండి. గేమ్‌ జామ్స్‌లో  పాల్గొనండి. మీలోని సృజనాత్మక శక్తిని పరిచయం చేయండి’ అని గేమింగ్‌పై ఆసక్తి ఉన్న మహిళలకు పిలుపునిస్తోంది సీతారామన్‌. 

చదవండి: 26..26 : ప్రేమకు కొత్త అర్థం చెప్పిన ప్రియుడు, వైరల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement