ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో అడుగడుగునా అవినీతి
సాక్షి, అమరావతి: రాజధానిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా ఒక్కో ఐఏఎస్ అధికారి బంగ్లా నిర్మాణ విలువ రూ.5.97 కోట్లుగా లెక్కగట్టడం ఇంజినీరింగ్ నిపుణులను, కాంట్రాక్టు వర్గాలను విస్మయ పరుస్తోంది. ధరల సర్దుబాటు, అదనపు పనుల పేరుతో నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఈ స్థాయిలో నిర్మాణ విలువ ఉండటంపై ఇంజినీర్లు, రియల్టర్లు విస్తుపోతున్నారు. సీఆర్‌డీఏ పేర్కొన్న ప్రమాణాల మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతోపాటు విజయవాడలో అత్యంత ప్రధానమైన ప్రాంతంలోనూ భూమితోపాటు ఐఏఎస్ అధికారులకు నిర్మిస్తున్న బంగ్లాల వంటివి ఒక్కోటి రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు దొరుకుతాయని రియల్టర్లు, ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.
ఈ లెక్కన ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని చెబుతున్నారు. కాంట్రాక్టు సంస్థ ‘కేఎమ్వీ ప్రాజెక్ట్స్’ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడిది కావడంతో ప్రజాధనాన్ని భారీ ఎత్తున దోచి పెడుతున్నారనే చర్చ కాంట్రాక్టు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్‌తో ఆర్‌సీ కాలమ్స్, బీమ్స్‌తో అంతర్గత, బహిర్గత విద్యుదీకరణ, ఐటీ పనులు.. అంతర్గత, బహిర్గత ప్రాంతాల్లో ప్లంబింగ్ చేసి 5,28,125 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో 115 బంగ్లాల నిర్మాణ పనులకు రూ.237.02 కోట్ల వ్యయంతో 2018 ఫిబ్రవరి 19న సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది.
వాటిని కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.9.88 కోట్లకు.. అంటే రూ.246.09 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగించింది. 2019 నాటికే 28.5 శాతం పనులు అంటే రూ.61.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని.. రూ.41.80 కోట్ల బిల్లులు చెల్లించారని సీఎం చంద్రబాబు 2024లో విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రకటించారు. దీన్ని బట్టి.. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో రూ.184.69 కోట్ల విలువైన పనులు మిగిలాయి. వాటిని 2024లో చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
అంచనా వ్యయం ఏకంగా రూ.244.54 కోట్లు పెంపు
రద్దు చేసిన ఐఏఎస్ బంగ్లాల నిర్మాణ పనులకు 2018 ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న వాటికి అదనంగా హోమ్ ఆటోమేషన్‌ను చేర్చి పనుల కాంట్రాక్టు విలువను రూ.184.69 కోట్ల నుంచి రూ.411.37 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు 2025 ఫిబ్రవరి 17న సీఆర్‌డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. 2018–19తో పోల్చితే 2024–25లో సిమెంటు, స్టీలు, బంగ్లాల నిర్మాణంలో వినియోగించే సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని అదనంగా రూ.226.68 కోట్లు పెంచేశారు. అంటే.. మిగిలిన పనుల విలువ కంటే అదనంగా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
ఇక ఆ పనులను కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.17.86 కోట్లకు కోట్ చేసిన అంటే రూ.429.23 కోట్లకు అదే కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు పనులు అప్పగించారు. అంటే.. నాడూ నేడు ఒకే కాంట్రాక్టు సంస్థే. కానీ, అప్పట్లో మిగిలిన పనుల విలువ రూ.184.69 కోట్లు కాగా, ఇప్పుడు వాటిని రూ.429.23 కోట్లకు అప్పగించారు. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.244.54 కోట్లు ఎక్కువ ధరకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడంతోపాటు కాంట్రాక్టర్‌కు ప్రయోజనం చేకూరుతుంది. పైగా సీనరేజీ, జీఎస్టీ, వంటి పన్నుల రూపంలో రూ.86.79 కోట్లు కాంట్రాక్టర్‌కు రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. తద్వారా అంచనా వ్యయం రూ.577.42 కోట్లకు చేరుకుంది.
అదనంగా రూ.109.52 కోట్ల పనులు
ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు మరిన్ని హంగులు చేకూర్చే పనులు చేపట్టడానికి రూ.109.52 కోట్లతో సోమవారం ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హోమ్ ఆటోమేషన్, అదనపు వార్డ్ రోబ్స్, అదనపు స్టోర్ రూమ్, జ్యూస్ సెంటర్, స్పైరల్ స్టెయిర్ కేస్, క్యానోపి బాల్కానీ, కార్ పార్కింగ్ షెడ్, గ్లేజ్డ్ రెయిలింగ్, టెన్సిల్ రూఫింగ్, హీట్ పంప్స్, అదనపు హెచ్‌వీఏసీ, ట్రాన్స్‌ఫార్మర్, బయట విద్యుదీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులకు టెండర్లు పిలవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను నిర్దేశించింది. నిజానికి ఈ పనులకు 2025 ఫిబ్రవరి 17న సీఆర్‌డీఏ పిలిచిన టెండర్లలోనూ హోమ్ ఆటోమేషన్, బయట విద్యుదీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ వంటి పనులు ఉన్నాయి.
అయినా సరే ఇప్పుడు అదనంగా ఆ పనుల పేరుతో రూ.109.52 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించడం గమనార్హం. ఈ పనులు కూడా కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకే కట్టబెట్టడం తథ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ రూ.109.52 కోట్లను కూడా కలుపుకుంటే.. 5,28,125 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 115 ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయం రూ.686.94 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.13,007.15. ఒక్కో బంగ్లా కాంట్రాక్టు విలువ రూ.5.97 కోట్లు.


