పచ్చ పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకింగ్ ఏజెన్సీ
వాటికి వైద్యశాఖలో రూ.4 వేల కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం
టెండరు నిబంధనల్లో మార్పులు.. ‘సాల్వెన్సీ’ షరతు ఎత్తివేత
బీమా కంపెనీకి రూ.వేల కోట్లు ప్రీమియం రూపంలో మళ్లింపు
ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు
కమీషన్ కింద రూ.వందల కోట్లు.. అదంతా పెద్దల జేబుల్లోకి!
అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దల పావులు
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమలులో స్కామ్‌కు రంగం సిద్ధమైంది! ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీసినట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పచ్చ పార్టీ కార్యకర్తల బీమా సేవలో తరిస్తున్న కంపెనీకే వైద్యశాఖలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన ఆరోగ్య బీమా కాంట్రాక్ట్‌ను కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అస్మదీయ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్లించడం, ప్రీమియంపై భారీ మొత్తంలో కమీషన్ బ్రోకర్ ఏజెన్సీకి చెల్లించడం, ఏజెన్సీ నుంచి పెద్దలకు ముడుపులు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. ఈ దోపిడీ పరంపరతో భారీ కుంభకోణానికి తెర తీసినట్లు విశ్వసనీయ సమాచారం.
అంతటా అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ..
ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా అమలులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ బ్రోకర్ సంస్థ చక్రం తిప్పుతోంది. పచ్చ పార్టీ కార్యకర్తలకు బీమా సేవలు అందించే ఇన్సూరెన్స్ కంపెనీ, పార్టీకి మధ్య ఓ సంస్థ బ్రోకింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ గతేడాది కోటి మంది కార్యకర్తలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా కోసం కేవలం రూ.42 కోట్లు ప్రీమియం చెల్లించేలా ఓ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిర్చింది. ప్రస్తుతం ఆ బ్రోకర్ ఏజెన్సీ ద్వారానే వివిధ శాఖల్లో బీమా అమలు స్కామ్‌ను ప్రభుత్వ పెద్దలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది విద్యుత్ శాఖలో ట్రాన్స్‌కో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
రూ.100 కోట్ల విలువైన ఈ టెండర్‌ను తొలుత పచ్చ పార్టీ సేవలో తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ, బ్రోకర్ ఏజెన్సీకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అయితే సాల్వెన్సీ నిబంధన, ప్రమాణాల కారణంగా ఆ బిడ్‌లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో కోరినంత కమీషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకుని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి అడ్డదారుల్లో కాంట్రాక్టు ముట్టజెప్పారు. కాంట్రాక్టు దక్కించుకున్న బీమా సంస్థ నుంచి కమీషన్‌లు వసూలు చేసేందుకు టెండర్ల సమయంలో తిరస్కరణకు గురైన అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీని మళ్లీ రంగంలోకి దించారు. ఇన్సూరెన్స్ సంస్థకు, ఉద్యోగులకు మధ్య సమన్వయం కోసం టెండర్ల దశలో అనర్హతకు గురైన ఏజెన్సీని నియమించారు. 
పచ్చ పార్టీ బీమా సేవలో తరిస్తున్న కంపెనీకి మేలు చేసేందుకు వైద్యశాఖ బీమా టెండర్‌లో సాల్వెన్సీ నిబంధనకు మినహాయింపు
ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే అస్మదీయ ఏజెన్సీకి విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ ప్రమాద బీమాలో 15 శాతం వాటాను నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చేశారు. 2024–25, 2025–26లో ఇదే ప్రాతిపదికన ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయనే భయంతో విజయవాడతో పాటు మరో థర్మల్ పవర్ స్టేషన్‌కు 2026–27లో బ్రోకింగ్ ఏజెన్సీల ఎంపికకు టెయిలర్ మేడ్ నిబంధనలతో ఇటీవల టెండర్ పిలిచారు. ఇలా ప్రభుత్వ శాఖల్లో బీమా కార్యకలాపాలన్నింటిలో బ్రోకర్ ఏజెన్సీ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు.
సాల్వెన్సీ నిబంధన ఎత్తివేత
వైద్య శాఖలో బీమా టెండర్‌ను ఎలాగైనా సరే పచ్చ పార్టీకి బీమా అందిస్తున్న ప్రైవేట్ కంపెనీకే కట్టబెట్టాలనే లక్ష్యంతో టెండర్ నిబంధనల్లో మార్పులు తెచ్చినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అస్మదీయ బ్రోకర్ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. పచ్చ పార్టీకి బీమా సేవలు అందిస్తున్న సంస్థ సాల్వెన్సీ నిబంధనతో ట్రాన్స్‌కో టెండర్‌లో వైదొలగింది. దీంతో వైద్య శాఖ బీమా టెండర్‌లో ప్రీ బిడ్ అనంతరం సాల్వెన్సీ షరతులో మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సమర్పిస్తే సాల్వెన్సీ నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల మంది పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య సంరక్షణతో చెలగాటమాడుతూ రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టు విషయంలో సాల్వెన్సీ నిబంధన నుంచి మినహాయిం ఇస్తామని పేర్కొనడం విస్మయం కలిగిస్తోంది.
ప్రభుత్వం తీరుపై పలు ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం అభ్యంతరం తెలపడం గమనార్హం. భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఐఏ) నిబంధనల ప్రకారం ప్రతి బీమా సంస్థ (లైఫ్, జనరల్/హెల్త్ ఇన్సూరెన్స్) కనీసం 150 శాతం సాల్వెన్సీ రేషియోను నిరంతరం కొనసాగించాలి. ఉదాహరణకు ఒక సంస్థ చెల్లించాల్సిన క్లెయిమ్‌ల విలువ రూ.100 అనుకుంటే.. ఆ సంస్థ వద్ద కనీసం రూ.150 విలువైన ఆస్తులు సిద్ధంగా ఉండాలి. అయితే ప్రభుత్వ పెద్దలు ఎంపిక చేసుకున్న బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో లోటులో ఉండటం గమనార్హం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి టెండర్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది.


