సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. బీఆర్ నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా కనిపిస్తున్న నిన్నటి దృశ్యాలతో హిందువుల హృదయాలు మండిపోతున్నాయి. 94 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్న వ్యక్తిని చైర్మన్‌గా నియమించారు. ఘటన తర్వాత మౌనంగా టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సింది. ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టాలనే కుట్ర మీలో కనిపిస్తోంది. రాసలీలల వీడియోలతో హిందువులంతా నిర్ఘాంతపోయారు.. నివ్వెరపోయారు. వాత్సాయనుడికి వారసుడు ఈ నాయుడు. మా హయాంలో జస్ట్ వాయిస్ బయటికి వస్తేనే పృథ్వీతో రాజీనామా చేయించాం.
మా నాయకుడు వైఎస్ జగన్ గురించి బీఆర్ నాయుడు దారుణంగా మాట్లాడాడు. వైఎస్ జగన్ గురించే కాదు.. ఆయన కుటుంబంపై కూడా దారుణంగా మాట్లాడాడు. దీనికి ప్రతిఫలంగా దేవుడే.. బీఆర్ నాయుడికి శిక్ష వేశారు. వీడియోలు, ఫొటోలు బయటికి రావడం భగవంతుడి వేసిన శిక్షే. విజయనగర కాలంలో ప్రధాన అర్చకుడు తప్పు చేస్తే తల నరికేశారు. పాపాల ఊబిలో చిక్కుకున్న బీఆర్ నాయుడిని చంద్రబాబు ఏం చేస్తారు?. చంద్రబాబుకు భక్తి అనేది ఒక నాటకమే. బీఆర్ నాయుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దేవుడితో ఆటలొద్దు.. ఇది భగవంతుడు వేసిన అత్యంత భయానక శిక్ష ఇది. టీటీడీ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారా? అని సోషల్ మీడియా బీఆర్ నాయుడిని అడుగుతోంది. పవనానంద స్వామి, ఓ మహా పురుషా.. దీనిపై స్పందించండి. బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.
బీఆర్ నాయుడు కాదు.. కామ నాయుడు..
ఆయన కామ క్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని టీటీడీకి చైర్మన్‌గా నియమించారు. ఆయన బీఆర్ నాయుడు కాదు.. కామ నాయుడుగా మారాడు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్న మాట అబద్దం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడాను. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదు. బీఆర్ నాయుడు హిందూ ధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారన్న అనుమానం కలుగుతోంది’ అని వ్యాఖ్యలు చేశారు.



