ఆ రెండింటినీ రాయగడకే అప్పగించేసిన రైల్వే బోర్డు
కాపాడుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలం
తుది హద్దులు ఖరారు చేసిన కేంద్రం
విశాఖ డివిజన్ పరిధి 401.68 కిలోమీటర్లు
రాయగడ డివిజన్ పరిధి 704.75 కిలో మీటర్లుగా నిర్థారించిన బోర్డు
సాక్షి, విశాఖపట్నం: అనుకున్నదంతా అయిపోయింది.. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ముందు మరోసారి మోకరిల్లి.. విశాఖ రైల్వే డివిజన్ ఆదాయ వనరులను రైల్వే బోర్డుకు తాకట్టు పెట్టేసింది. దశాబ్దాల కలగా ఉన్న విశాఖ రైల్వే డివిజన్ నెరవేరే రోజులు సమీపిస్తున్నాయన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. శతాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ విచ్ఛిన్నమైపోయింది. విశాఖ డివిజన్‌కు రావాల్సిన ఆదాయాన్నంతా ఒడిశా తీసుకెళ్లిపోతోంది. అరకు, కేకేలైన్ మొత్తాన్ని రాయగడ డివిజన్ పరిధిలో విలీనం చేసేస్తూ రైల్వే బోర్డు తాజాగా తుది ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
పర్యాటక ప్రాంతమంతా రాయగడకే
కొత్తగా ప్రతిపాదించిన విశాఖపట్నం డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య కిలోమీటర్ల వారీగా విభజనను అధికారులు ఖరారు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అత్యంత కీలకమైన అరకు ప్రాంతం విశాఖ డివిజన్ పరిధి నుంచి రాయగడ పరిధిలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత విభజన లెక్కల ప్రకారం.. సరకు రవాణా పరంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే (కొత్తవలస–కిరండూల్) లైన్ మొత్తం.. రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయింది.
కేకే లైన్‌లో కొత్తవలస యార్డు మినహాయించి.. పర్యాటక ప్రాంతాలైన బొర్రాగుహలు, అరకు, కిరండూల్ వరకు ఉన్న సుదీర్ఘ మార్గం అంతా రాయగడ డివిజన్ కిందికే వెళ్లింది. దీనివల్ల విశాఖపట్నం తన ఆదాయ వనరులలో ప్రధానమైన పర్యాటక, కార్గో రైల్వే మార్గాన్ని కోల్పోయింది. చంద్రబాబు కూటమి ఎంపీల వైఫల్యం వల్లే విశాఖ డివిజన్ నష్టపోయింది. విశాఖ డివిజన్ ప్రయోజనాల కోసం ఏనాడూ టీడీపీ, జనసేన ఎంపీలు లోక్‌సభలో గళమెత్తిన పాపాన పోలేదు.
కొత్త జోన్‌కు వాల్తేరే కీలకం.. కానీ.!
తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు 1106.435 కిమీ విస్తీర్ణం, 2859.376 కి.మీ. ట్రాక్‌లైన్‌తో ఉన్న వాల్తేరు డివిజన్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఆదాయాన్ని తెచి్చపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది.
దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లతో అతిపెద్ద లోకోషేడ్, 160 ఇంజిన్లతో భారీ ఎలక్ట్రికల్ లోకోషేడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ ఇది.
ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. దీనివల్ల కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు.
కొత్తగా రానున్న విశాఖపట్నం రైల్వే డివిజన్ స్వరూపం ఇదీ..
డివిజన్ పరిధి: 401.68 కిలోమీటర్లు
ట్రాక్ మొత్తం : 1317.501 కిలోమీటర్లు
» విశాఖపట్నం నుంచి దువ్వాడ వరకూ ఉన్న యార్డులతో కలిపి ప్రధాన సెక్షన్
» విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి మీదుగా పలాస వరకూ ఉన్న మార్గం
» నౌపడ–గుణుపూర్ నేరోగేజ్ లైన్‌లోని కొంత భాగం.. బొబ్బిలి, పార్వతీపురం స్టేషన్లు
రాయగడ డివిజన్ పరిధిఇలా..
డివిజన్ పరిధి : 704.755 కిలోమీటర్లు
ట్రాక్ మొత్తం : 1541.875 కిలోమీటర్లు
రాయగడ డివిజన్‌లోకి వెళ్లిన కేకేలైన్ మొత్తం పరిధి : 445 కిలోమీటర్లు


