కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం
హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీల మండిపాటు
రాజకీయం లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు
స్వయానా సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం
సీబీఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నా ఆగని దు్రష్పచారం
హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందే
హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల డిమాండ్
లబ్బీపేట (విజయవాడ తూర్పు) : కలియుగ దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూలో కల్తీ అంటూ చేస్తున్న ప్రచారం హిందూ ధర్మం పై దాడిగానే భావిస్తున్నామని పలువురు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి లడ్డూను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తుండటం మహా అపచారమని వారు చెప్పారు. ప్రజల దృష్టి మళ్లించే మిషతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. రాజకీయం కోసం ఇంతగా దిగజారి వ్యవహరించడం క్షమార్హం కానేకాదని నొక్కి వక్కాణించారు.
హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ ఘటనలో ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకు విజయవాడలోని ఓ కళ్యాణ మండపంలో శనివారం స్వామీజీలు ఓ సదస్సు నిర్వహించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా సాగిస్తున్న కుతంత్రమని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు, బ్రాహ్మణ సంఘాల నేతలు, పలువురు స్వామీజీలు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో పలువురు స్వామీజీలు, తిరుపత్తూర్ శివశక్తి పీఠం నుంచి శ్రీ శివపరిమళమ్మ, కడలూరు శివపీఠం నుంచి సాయిబాబా స్వామి, హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఆలయాల్లో జరిగిన అపచారాలపై క్యూఆర్ కోడ్‌తో కూడిన బ్రోచర్ ఆవిష్కరించారు.
దుష్ప్రచారం దుర్మార్గం
రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని అబాసుపాలు చేసే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. లడ్డూ కల్తీ అంటూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ హిందువుల మనోభావాలపై దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబుకు ఒక ధర్మం అంటూ ఏమీ లేదు. ధర్మ శా్రస్తాన్ని పాటించని వారు ధర్మాన్ని నిర్వర్తించలేరు. లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ సిట్ తేల్చిన తర్వాత కూడా బాత్‌రూమ్ శుభ్రం చేసే కెమికల్స్ వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు దు్రష్పచారం చేయడం దుర్మార్గం. – శ్రీ జ్యోతి స్వామి, శ్రీకాకుళం త్రినాథ త్రివటి ధర్మక్షేత్రం
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
రాష్ట్రంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి శ్రీవారి లడ్డూలో గొడ్డు కొవ్వు కలిసిందని మాట్లాడటం సరికాదు. ఇది హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. అందరం సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ఊరూరా చాటి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. – బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ సంఘం నేత
హైందవ ధర్మానికి వ్యతిరేకం
నెయ్యిలో కల్తీ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది రాజకీయ కక్షల నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందంటూ మాట్లాడటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. హైందవ ధర్మానికి వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడుతున్నారు. తప్పు జరిగిందని పాలకులు లెంపలేసుకోవాలి. – రాధవస్వామి, హైదరాబాద్
స్థాయి దిగి మాట్లాడుతున్నారు
శ్రీవారి లడ్డూలు కల్తీ అనే ప్రచారం హిందూ ధర్మంపై దాడిగానే భావించాలి. రాజకీయాల కోసం కలియుగ దైవం శ్రీవారి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. గొడ్డుకొవ్వు, పందికొవ్వు కలిసిందని తొలుత చెప్పారు. కానీ.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ జంతువుల కొవ్వు కలవలేదని తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో మళ్లీ బాత్రూమ్ కడిగే కెమికల్స్ కలిశాయంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రీవారి ప్రసాదం విషయంలో ఇంత దిగజారి మాట్లాడమంటే హైందవ ధర్మంపై దాడిగానే భావించాలి. – కామేశ్వరప్రసాద్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత
చంద్రబాబుదే ఈ పాపం
బోలేబాబా డెయిరీకి ద్వారాలు తెరిచిందీ, ఆర్డర్లు ఇచ్చింది 2018లో చంద్రబాబే. పరాగ్ మిల్‌్క, దొడ్ల డెయిరీకి కూడా గత చంద్రబాబు ప్రభుత్వంలోనే ఆర్డర్లు ఇచ్చారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్‌కు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అని అదే హెరిటేజ్‌లో స్పష్టంగా ఉంది. అయితే ఈ విషయం బట్టబయలు కాగానే హెరిటేజ్ వెబ్‌సైట్‌లో కో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా మార్పు చేయడం నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్నీ అపచారాలే.
గోదావరి పుష్కరాల్లో 29 మంది మృతి, ఆలయాల కూల్చివేత, తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి, సింహాచలంలో చందనోత్సవం రోజు, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాస ఘటనలు జరిగి పలువురు మృతి చెందడమే ఇందుకు నిదర్శనం. టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు మళ్లీ లోపలకు ఎలా అనుమతించారనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే
ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. కేవలం సొంత వ్యాపార ప్రయోజనాల కోసం (హెరిటేజ్ నెయ్యి విక్రయాల కోసం) గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఈ కల్తీ డ్రామా ఆడారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధికి, 2019–24 మధ్య వైఎస్ జగన్ పాలనలో జరిగిన అభివృద్ధికి పోలికే లేదు.
కాణిపాక ఆలయ పునర్నిర్మాణం, గండి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి వంటివి వైఎస్ జగన్ హయాంలోనే జరిగాయి. వీటిపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఆధ్మాత్మిక చైతన్యంతో.. గతంలో బూట్లతో పూజలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు బూట్లు విప్పుతున్నారు. – వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి


