కైలాసపట్నంలో పేలుడుధాటికి ధ్వంసమైన ‘విజయలక్ష్మీ ఫైర్ వర్క్స్’ కేంద్రం(ఫైల్)
సాక్షి నెట్‌వర్క్: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా విస్ఫోట ఘటనతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఈ జిల్లాలోనే జరుగుతుండడం విషాదకరం. ఇక ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో చిచ్చుబుడ్లు కూరుతుండగా జరిగిన ప్రమాదాలే అధికం. వెరసి పొట్టకూటి కోసం పనిచేస్తున్న కూలీల కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి విషాద ఘటనల్లో కొన్ని...
ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు
అక్టోబర్ 2025: చిచ్చుబుడ్లు కూరే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో బాణసంచా విస్ఫోటం. గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ యజమానితో పాటు పది మంది మృతి.
సెప్టెంబర్ 2025: అయినవిల్లి మండలం విలసలో ఎలాంటి అనుమతులూ లేకుండా అనధికారికంగా బాణసంచా విక్రయించేందుకు సిద్ధమవుతుండగా మందుగుండు పేలిపోయి దంపతులు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహలక్ష్మి మృతి.
అక్టోబర్ 2019: తాళ్లరేవు మండలం వేమవరం బాణసంచా తయారీ కేంద్రంలో చిచ్చుబుడ్డి కూరుతుండగా ప్రమాదం. ముగ్గురు మృతి. ఎనిమిది మందికి గాయాలు.
అక్టోబర్ 2019: సామర్లకోట మండలం జి.మేడపాడు బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ప్రమాదంలో ఆరుగురు మృతి
అక్టోబర్ 2014: ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని మణికంఠ ఫైర్ వర్క్స్‌లో విస్ఫోటం. 18 మంది దుర్మరణం. లైసెన్స్ లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడం, మందుగుండు భారీగా నిల్వ కారణం.
అక్టోబర్ 2014: మండపేట మండలం ఏడిదలో బాణసంచా తయారు చేస్తూండగా ప్రమాదం. ఒకరు మృతి.
అనకాపల్లి జిల్లాలో..
ఏప్రిల్ 2025: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో గల ‘విజయలక్ష్మీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు.
నెల్లూరు జిల్లాలో..
సెప్టెంబర్ 2024: నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో గల భవానీ ట్రేడర్స్ బాణసంచా విక్రయ దుకాణం/ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో వాచ్‌మెన్ సుబ్బయ్య సజీవదహనం.
ఎన్టీఆర్ జిల్లాలో...
సెప్టెంబర్ 2025: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి భీమేశ్వర కాలనీలో రెంటపల్లి కోటమ్మ ఇంట్లో భారీ పేలుడు. గుట్టుచప్పుడు కాకుండా కాలనీలోని కొన్ని ఇళ్లల్లో గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు దీపావళి సామాగ్రి తయారు చేయిస్తున్నట్లు అప్పట్లో బయటపడిన నిజం.
పేలుడు ధాటికి చుట్టుపక్కల కొన్ని ఇళ్ల గోడలు అద్దాలు, కిటికీలు, రేకులు షెడ్లు ధ్వంసం. గోపి అనే ఒక వెల్డర్ మృతి. మరో వ్యక్తికి అంగవైకల్యం. పరిహారం కోసం గోపి భార్య ఏడాది వయస్సు బిడ్డతో పేలుడు జరిగిన ఇంటి వద్ద జరిగిన ఆందోళన అప్పట్లో సంచలనం. స్పందించని చంద్రబాబు ప్రభుత్వం.
ప్రాణాలు హరిస్తున్న నిర్లక్ష్యం
» నిబంధనలకు నీళ్లొదలడం ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
» బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. అగ్ని నిరోధక పరికరాలు సిద్ధంగా ఉండాలి.
» షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధించగలగాలి.
» షెడ్ల గుమ్మాలు 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
» పనిచేసే కార్మికులు ఫైర్ ఫైటింగ్ కోర్సులో తర్ఫీదు పొందాలి.
» అగ్నిమాపక సిలిండర్లు, ఐదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు అందుబాటులో ఉండాలి.
» మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు.
» ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఎక్స్‌ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్‌ఫాం తగినంత దూరంలో ఉండాలి.


