వైభవంగా నృసింహుని హంస వాహనోత్సవం
నేడు పొన్న వాహనోత్సవం...
మంగళగిరి టౌన్ : మంగళాద్రితో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత నరసింహస్వామి వారు శనివారం ఉదయం హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి రంగురంగు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం దేవస్థానం వద్దనుంచి ప్రారంభమై సాధుసోడా సెంటర్, పూలమార్కెట్ సెంటర్‌మీదుగా మిద్దెసెంటర్ వరకు సాగింది. ఈ ఉత్సవంలో మహిళలు కోలాటం చేస్తూ స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాలు కొట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రి గజవాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వగా అశేష సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని ముగ్ధులయ్యారు. ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించగా, హంసవాహన సేవా కై ంకర్యపరులుగా వేదాంత గోపాలసత్యవతి, వేణుగోపాల వాసుదేవ భట్టర్, అరుణ ప్రియలు వ్యవహరించగా, గజవాహన సేవా కై ంకర్యపరులుగా పాత మంగళగిరి శ్రీపద్మశాలీయ సంఘం వారు వ్యవహరించారు.
రాత్రి గజవాహనంపై విహరించిన శ్రీవారు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించనున్నారు. రాత్రి పొన్నవాహనం ఉత్సవం జరుగుతుందని ఆలయ ఈవో సునీల్‌కుమార్ తెలిపారు. భక్తులు ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
వైభవంగా నృసింహుని హంస వాహనోత్సవం


