పట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన బిహార్ మౌలిక సదుపాయాలపై చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. నలంద సాహిత్య ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రశంసించడం విశేషంగా మారింది.
బిహార్‌లో గతంతో పోలిస్తే రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా మొదలైన సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని శశి థరూర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్ధరాత్రి వేళల్లో కూడా ప్రజలు నిర్భయంగా రోడ్లపై తిరగగలుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. బిహార్‌లో ప్రత్యర్థి కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తిస్తూ, థరూర్ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో విలేకరులు థరూర్‌ను రాజకీయ అంశాలపై స్పందించమని కోరగా, ఆయన ‘నన్ను రాజకీయాల్లోకి లాగకండి, ఇక్కడి పురోగతిని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈ ప్రశంసలు బిహార్ ప్రజలకు, వారి ప్రతినిధులకు దక్కుతాయి’ అని పేర్కొన్నారు. కాగా రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ప్రత్యర్థి పార్టీలోని మంచిని గుర్తించాలనే తన ధోరణిని మరోసారి బయటపెట్టారు. అయితే ఇటీవల సీఎం నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ విషయంలో ప్రవర్తించిన తీరును థరూర్ తప్పుబట్టారు.
బిజెపి-జేడీయూ కూటమి ప్రభుత్వాన్ని థరూర్ ప్రశంసించడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమర్థించడం, పాకిస్తాన్‌పై సైనిక దాడుల నిర్వహణను మెచ్చుకోవడం తదితర అంశాల కారణంగా థరూర్‌కు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదనే వార్తలు వినిపించాయి. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకుంటూనే, తమ పార్టీ సిద్ధాంతాలకు భంగం కలిగినప్పుడు విమర్శించడంలో థరూర్ తన శైలిని బయటపెట్టారు. తాజాగా బిహార్ పర్యటనలో థరూర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: నేటికీ శతాబ్దాల నాటి యుద్ధ వ్యూహాలు.. వీడియో వైరల్


