బిగ్‌బాస్ తెలుగు 9 అసలైన విజేత ఇమ్మాన్యుయేల్ అని సోషల్‌మీడియాలో చాలామంది అంటుంటారు. ఈ సీజన్‌లో తను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థం అవుతుంది. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్‌లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమ్మాన్యుయేల్‌నే కావడం విశేషం.. కమెడియన్‌గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్‌బాస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ దక్కలేదు. కానీ, ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు.
హౌస్‌లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్లు తప్పు చేసినా సరే.. మంచివైపే నిల్చున్నాడు. తనవారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్ ఎంటర్‌టైనర్‌గా నిలవడమే కాకుండా ఆటలో ఒక పోరాట యోధుడిని కూడా చూపించాడు. కానీ, 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్ము అసలైన విజేత అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రెమ్యునరేషన్ ఎంత..?
బిగ్‌బాస్‌లో ఇమ్మానుయేల్ 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు. ఏడిపించాడు.. అలరించాడు. గతంలో కమెడియన్స్ చాలామంది బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కానీ, ఇమ్ము మాత్రం బలమైన మార్క్ చూపాడు. అయితే, ఇమ్ము తన రెమ్యునరేషన్‌కు మించి కంటెంట్‌ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్‌బాస్ నుంచి వారానికి రూ. 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్‌బాస్ నుంచి మొత్తంగా రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో భరణి, సంజనలు రెమ్యునరేషన్‌లో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇమ్ము ఉన్నాడు.


