భగవంతుడి అనుగ్రహాలూ, లీలలూ చాలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. చాలామందిని దీవించి, వరాలిచ్చి పంపుతుంటాడా... మరికొందరి పట్ల ఆగ్రహించడం ద్వారా చాలామందిని అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అలా ఓ చిన్నారి బిడ్డకు శిక్ష విధించి... ‘‘ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారూ... వాళ్లకు నువ్వు సేవలందించ’’మంటూ ఓ తల్లికి అనాథల బాధ్యతలు అప్పగించాడు. భగవంతుడు ఆదరించకపోతే అదెంత బాధాకరంగా ఉంటుందో అనుభవమైంది కాబట్టి... అలాంటి అభాగ్యులెందరినో ఆమె ఆదరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ తల్లే అల్కా శర్మ. ఎందరిలోనో స్ఫూర్తి నింపే ఆ అమ్మ కథేమిటో చూద్దాం.
దేవుడెందుకోగానీ... అల్కా శర్మ పట్ల నిర్దయగా ఉన్నాడు. ఆమె కొడుకైన అయాన్‌కు ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’ – (ఓఎమ్‌ఎస్) అనే ఓ అరుదైన వ్యాధిని అనుగ్రహించాడు. ఆ వ్యాధి కూడా చాలా చిత్రమైంది. తాను నమ్ముకున్న భగవంతుడే తనను శిక్షించినట్టుగా... తన సొంత వ్యాధి నిరోధకవ్యవస్థ తననే కబళించి దెబ్బతీసే ‘ఆటో ఇమ్యూన్’ వ్యాధి అది. అమాయకమైన చిన్నారులను దెబ్బతీసే ఆ వ్యాధి... ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత లేదా న్యూరోబ్లాస్టోమా అనే నరాల వ్యాధి వచ్చాక బయటపడుతుంది.
ఈ వ్యాధి లక్షణాలేమిటంటే..?
ఈ వ్యాధి ఉన్నవారి కనుగుడ్లు అత్యంత వేగంగా చకచకా అటు ఇటూ కదిలిపోతుంటాయి. ఈ కండిషన్‌ను ‘ఆప్సోక్లోనస్’ అంటారు. ఇలా కనుగుడ్లు చకచకా కదలడాన్ని ‘డాన్సింగ్ ఐస్’ (నాట్యం చేస్తున్న కళ్లు)గా కూడా అభివర్ణిస్తారు. దీనినే వైద్యపరిభాషలో ‘నిస్టాగ్మస్’ అంటారు. ఇక కండరాలపై అదుపు ఉండక అవి కూడా వాటంతట అవే కదిలిపోతుంటాయి. ఫలితంగా కాళ్లూ చేతుల కండరాలపై పట్టు ఉండదు. ఒక్కోసారి నాలుక కండరంపైనా అదుపు ఉండదు కాబట్టి మాట ముద్ద ముద్దగా వస్తుంటుంది.
ఇలా కళ్లూ, కాళ్లూ, కండరాలపై అదుపు ఉండని ఈ ‘ఆప్సోక్లోనస్ మయోక్లోనస్ సిండ్రోమ్’తో తన బిడ్డను అనుగ్రహించగానే ఓ చిర్నవ్వు నవ్వింది ఆ తల్లి. ‘ఓహో... నాకీ శిక్ష విధించి ఇలాంటి అభాగ్యులెందరి బాధలనో గుర్తించమంటూ నన్ను అనుగ్రహించావా తండ్రీ’’ అంటూ ఆ తల్లి అల్కా శర్మ తన బిడ్డల్లాంటి ఎందరో దివ్యాంగ బిడ్డలకేసి దయగా చూసింది. వాళ్ల బాధలు బాపేందుకు పూనుకుంది. తన భర్త నీరజ్ శర్మ కూడా ఆమె సంకల్పానికి తన చేయూతనిచ్చారు.
అప్పటికి తనకున్న బంగారాన్నీ, ఆభరణాలనూ అన్నింటినీ అమ్మేసి వచ్చిన డబ్బుతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ తహసిల్‌లోని ఛత్తర్ అనే చోట దివ్యాంగులైన పిల్లల కోసం ఓ అనాథాశ్రమాన్ని ప్రారంభించింది. ‘ఏంజెల్ డిజేబిలిటీ అండ్ ఆర్ఫనేజ్ హోమ్’ అనే ఆ అనాథాశ్రమాన్ని మొదలుపెట్టిన నాటి నుంచీ... అంటే 2018 మొదలుకొని ఇప్పటివరకూ దాదాపు 160 మందికి పైగా దివ్యాంగ బాలిబాలికలలకు నివాస ఫిజియోథెరపీ సేవలనూ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలద్వారా సేవలందిస్తోంది అల్కా. ఈ పిల్లల్లో చాలామంది ఇప్పుడు తమ వైకల్యాన్ని అధిగమిస్తూ తమ పనులు తాము చేసుకునేలా స్వావలంబన సాధించారు.
ఇలా తన కొడుకుకు వైకల్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ భగవంతుడు తనపై అలక బూనినా తాను మాత్రం తన సేవా అసిధారావ్రతాన్ని అదేపనిగా కొనసాగిస్తూ పిల్లలను అనుగ్రహిస్తూనే ఉంది అమ్మ అల్క శర్మ.
– యాసీన్


